తెల్లార్లేస్తే పడుకునే వరకు పుస్తకాలెన్నిసార్లు ముడుతున్నామో చాలామందిమి తెలియదుగానీ… మోబైల్ ఫోన్ చేతిలో ఉన్నవాళ్లు ముఖపుస్తకాన్ని మాత్రం లేచినప్పట్నుంచీ, మంచంలో పడుకునేవరకూ పట్టుకుంటూనే కనిపిస్తున్న రోజులివి. సోషల్ మీడియా సైట్స్ లోనూ ఎన్నో ఫ్లాట్ ఫామ్స్ ఉన్నా… అతి ఎక్కువ మంది అకౌంట్స్ కల్గి ఉన్న వేదికేది అంటే మాత్రం ఫేస్ బుక్కేనన్నది ఓ కచ్చితమైన అంచనా.
అయితే, మార్క్ జూకెర్ బర్గ్ రెవల్యూషన్ గా కొనియాడబడుతున్న ఈ ఫేస్ బుక్ సృష్టికర్తల్లో మన ఇండియన్ మూలాలున్న వ్యక్తి బుర్ర ఒకటుందనే విషయం తెలుసా..? కాస్త ఆయన గురించి చెప్పుకునేందుకే.. ఈ ఇంట్రడక్షన్.
ఆయనే దివ్య నరేంద్ర. 2004లో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి అప్లైడ్ మ్యాథమేటిక్స్ లో పట్టభద్రుడయ్యాడు. 1982, మార్చ్ 18వ తేదీన న్యూయార్క్ లోని బ్రాంక్స్ లో జన్మించిన భారత సంతతికి చెందిన దివ్య నరేంద్ర.. ప్రస్తుతం సమ్ జీరో అనే కంపెనీకి సీఈవో కమ్ వ్యవస్థాపక సభ్యుడు.
Ads
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల నుంచి మొదలుకుని గూగుల్ సుందర్ పిచ్చాయ్ వరకూ అనేక మంది భారతీయులు… భారతీయ సంతతి వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ఈరోజు నాయకత్వం వహిస్తున్నారు. మరికొందరు సొంతంగా కంపెనీలను స్థాపించి తమ ప్రాబల్యాన్ని చాటారు. అలాంటి వ్యక్తుల్లో మనం దివ్య నరేంద్ర పేరు కూడా చెప్పుకుతీరాలి.
అసలు ఫేస్‌బుక్‌ను సృష్టికర్తనే దివ్య నరేంద్ర. కానీ, మనం వాడుతున్న నేటి ఫేస్ బుక్ క్రెడిట్ ఎన్నడూ నరేంద్రకు దక్కకపోవడం విచారకరం. మరో ఇద్దరితో కలిసి నరేంద్ర… ఈ రోజు మనం వాడుతున్న ఫేస్‌బుక్ టెక్నాలజీని అభివృద్ధి చేశాడు. 2002 డిసెంబర్ లో తోటి హార్వర్డ్ విద్యార్థులను కనెక్ట్ చేయడానికి నరేంద్ర చేసిన ప్రయోగమే… ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎందరినో కలుపుతున్న సోషల్ నెట్‌వర్క్ ఫేస్ బుక్. మొదట దానిపేరు ConnectU.
దివ్య నరేంద్ర తన హార్వర్డ్ యూనివర్శిటీ క్లాస్‌మేట్సైన.. కామెరాన్ వింక్లేవోస్, టైలర్ వింక్లేవోస్‌తో కలిసి… మొదట తన ఆలోచన గురించి చర్చించాడు. ముగ్గురూ కలిసి… ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేసి.. దానికి ముందుగా హార్వర్డ్ కనెక్షన్ అని పేరు పెట్టారు. అదే తర్వాత కాలంలో ConnectU గా పేరు మారింది. నవంబర్ 2003లో నరేంద్ర, మరో ఇద్దరు మిత్రులైన కెమరాన్, టైలర్ తో కలిసి… హార్వర్డ్ కనెక్షన్ టీమ్‌లో చేరాలంటూ తమ ఆలోచనలను మార్క్ జుకర్‌బర్గ్ తో పంచుకున్నారు. అందుకు ఒప్పుకున్న జూకెర్ బర్గ్… దివ్య నరేంద్ర, మరో ఇద్దరు ఆయన మిత్రులతో కలిసి పనిచేస్తూనే… తన సొంత సోషల్ మీడియా సైట్ ప్రారంభించాలని అప్పటికే ప్లాన్ చేసుకున్నాడు. అలా జూకెర్ బర్గ్.. ఆ తర్వాత స్థాపించిన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామే… ఈరోజు మనమంతా నోళ్లు వెళ్లబెట్టి.. రెప్పవాలకుండా చూస్తున్న ఫేస్ బుక్.
అయితే, ఇది తమ బ్రెయిన్ చైల్డ్ అని.. తమ సృజనాత్మకతను కాపీ కొట్టి జూకెర్ బర్గ్ ఫేస్ బుక్ పేరుతో సోషల్ సైట్ ను ప్రారంభించారంంటూ దివ్య నరేంద్రతో పాటు.. తన ఇద్దరు మిత్రులైన కామెరాన్, టైలర్ హార్వర్డ్ యూనివర్సిటీ పెద్దలకు కంప్లైంట్ చేశారు. కానీ, వాళ్ల పరిధిలో విషయం లేదని రియలైజైన ముగ్గురు మిత్రులు కలిసి ఇక కోర్టు మెట్లెక్కారు. ఎన్నో వ్యాజ్యాలు ఈ ఫేస్ బుక్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ పై ఇంకా నడుస్తూ.. హియరింగ్స్ కొనసాగుతూనే ఉన్నాయి.
దియా నరేంద్ర ఎవరు?
దియా నరేంద్ర తల్లిదండ్రులిద్దరూ భారత్ నుంచి యూఎస్ కు వలసవెళ్లిన వైద్యులు. ప్రస్తుతం తన సహ వ్యవస్థాపకుడైన ఆలాప్ మహాదేవియాతో కలిసి సమ్ జీరో సీఈవోగా పనిచేస్తున్న అమెరికన్ బిజినెస్ మ్యాగ్నైట్ గా కూడా దివ్య పేరు అక్కడ ఫేమస్… న్యూయార్క్, బోస్టన్ వంటి నగరాల్లోని పలు కంపెనీల అనలిస్ట్ గా కూడా పనిచేస్తున్న దివ్య నరేంద్ర.. నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ నుంచి మేనేజ్ మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాడు.
అయితే, దివ్య నరేంద్ర స్టోరీని పోలిన కథతో.. 2010లో సోషల్ నెట్ వర్క్ పేరుతో ఓ సినిమా రాగా.. దివ్య నరేంద్ర పాత్రను ఇటాలియన్, చైనీస్ మూలాలున్న మాక్స్ మింఘెల్లా పోషించాడు. భారతీయేతరుడు.. తనలాంటి భారత్ మూలాలున్నవారిలా నటించడం పట్ల దివ్య నరేంద్ర ఒకింత ఆశ్చర్యపోయినట్టుగా కూడా తన అభిప్రాయాల్ని మీడియాతో పంచుకున్నారు. ఫేస్ బుక్ విషయంలో తాము నిరాశలో ఉన్న సమయంలో.. సోషల్ నెట్ వర్క్ సినిమాలో తన పాత్రను సమర్థవంతంగా పోషించిన మాక్స్ గురించి సంతోషాన్నీ వ్యక్తం చేశాడట దివ్య నరేంద్ర.
విన్నారా.. ఇదండీ… మనం వాడుతున్న ఫేస్ బుక్ కథ! మన నిత్యవాడుకలో భాగస్వామ్యమైన ఎఫ్బీ కూడా భారతీయులదేనని గట్టిగా ప్రచారం జరిగితే.. ఇక అప్పుడు మన భజనపరుల సంతోషానికి అవధులుంటాయా చెప్పండి..?...By రమణ కొంటికర్ల
Share this Article