గోట్ లైఫ్… పుస్తకం పేరు ఆడుజీవితం… సినిమాకూ అదే పేరు పెట్టారు… ప్రస్తుతం విమర్శలకు ప్రశంసలు పొందిన పాన్ ఇండియా సినిమా ఇది… రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి సినిమాపై… దర్శకుడు, సంగీత దర్శకుడు, హీరోల శ్రమ, ప్రయాస, తపస్సు కనిపిస్తాయి సినిమాలో… ఈ సినిమా వివరాల సెర్చింగులో సినిమాకు ఆధారంగా తీసుకున్న పుస్తకం గురించిన సమాచారం ఆసక్తికరం అనిపించింది…
స్వీయానుభవాల ఆధారంగా రాయబడిన పుస్తకంగా ప్రచారమైంది తప్ప నిజం కాదు, పుస్తక రచయిత బెన్యామిన్… తను బెహ్రయిన్‌లో పనిచేస్తున్నప్పుడు నజీవ్ అనే వలస కార్మికుడు పరిచయం అవుతాడు, తన గతంలోని చేదును వివరిస్తాడు… అదుగో, ఆ అనుభవాలు విని రాసిన కథే ఆడుజీవితం… 136 సార్లు పునర్ముద్రణ పొందిందంటే అది ఏ రేంజ్‌లో పాఠకాదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు… ఏ రచయితైనా కలలు గనే సక్సెస్ అది…
పుస్తక పఠనమే గగనమైన ఈరోజుల్లో ఒక పుస్తకం అన్నిసార్లు పునర్ముద్రణను పొందడం అంటే మామూలు విషయం కాదు… 2008లో మలయాళంలో మొదట విడుదలైనా తరువాత ఇంగ్లిష్, అరబిక్, ఒడియా, థాయ్, తమిళ భాషల్లోకి కూడా అనువదించారు… కన్నడ, హిందీ భాషల్లో కూడా రావల్సి ఉంది… తెలుగు గురించి ఎందుకు ఆలోచించలేదో తెలియదు… కానీ గల్ఫ్ దేశాలకు వలస కార్మికులు ఎక్కువగా వెళ్లే ప్రతి రాష్ట్రమూ కనెక్టయ్యే కథ… తెలంగాణలో కూడా వీళ్ల సంఖ్య ఎక్కువే…
Ads
నవల నాలుగు ప్రధాన భాగాలు… జైలు, ఎడారి, పరారీ, శరణం… (jail, desert, escape, refugee)… నవలలో అరబ్బులను నెగెటివ్‌గా చిత్రీకరించిన కారణంగా యూఏఈ మినహా మిగతా జీసీసీ దేశాలు (సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్) ఈ నవలను నిషేధించాయి… నిజానికి ఇలాంటి పుస్తకాలను మూవీకరించడం చాలా కష్టం… 255 పేజీల కథను రెండు గంటల కథగా కుదించాలి, అదే టెంపో రావాలి, అవసరమైన సినిమాటిక్ ఎమోషన్స్ రావాలి… ఈ ప్రయాసలో ఆడుజీవితం సినిమా దర్శకుడు, కథారచయిత సక్సెసయినట్టే భావించాలి…
ఏటా వేలాది మంది ఫేక్ పాస్‌పోర్టులు, ఫేక్ వీసాలు, ఫేక్ ఉపాధి పేరిట మోసపోతూనే ఉన్నారు… ఇప్పుడు కాస్త నయం… గతంలో, అంటే ఈ కథాకాలం నైన్టీస్‌లో గల్ఫ్ వెళ్లాలనుకునే వాళ్లను దోపిడీ చేయడానికి ముఠాలు వ్యవస్థీకృతమై ఉండేవి… ఈ నవల వాళ్లలో ఒకరి చేదు అనుభవాల్నే అక్షరీకరించింది… ఐతే నెలల తరబడీ ఎవరూ మనుషులు కనిపించక, మాట్లాడేవాళ్లు లేక, కడుపు నిండక… చివరకు గొర్రెలతోపాటు బతికీ బతికీ తనే ఓ గొర్రెలా ఓ మానసిక భ్రమలకు గురవుతాడు కథానాయకుడు… వాటితో మాట, వాటితోనే పడక, వాటిల్లో ఒకటిగా బతుకుతాడు… అందుకే పుస్తకం పేరును ఆడుజీవితం అని పెట్టారు… అంటే మలయాళంలో గొర్రెబతుకు అని..!
పరారీ కావాలనుకుంటే కుదరదు, దొరికిపోతాడు, శిక్షలు తప్పవు, గతంలో పరారీ కావడానికి ప్రయత్నించిన అస్థిపంజరంగా మారిన తనవంటి కార్మకుడి కథ తెలుస్తుంది… మరింత భయం, కానీ చావని ఆశ… ఆ తరుణంలో దొరికిన ఏకైక అవకాశాన్ని ఉపయోగించుకుని ఎలా బయటపడ్డాడనేదే కథ… నిజానికి గల్ఫ్ కంట్రీస్ వెళ్లిన చాలామందికి ఇంకా చేదు, బీభత్స, భయానక అనుభవాలూ ఉన్నాయి… అందుకే ఈ సినిమా, ఈ నవల అంతగా కనెక్టయింది ప్రజలకు… ఇది పిక్షన్ కాదు, ఫాంటసీ కాదు… రియాలిటీ… మన తెలుగులో ఇలాంటివి ఎందుకు రావు..? అదీ పెద్ద ప్రశ్నే..!!
Share this Article