ఫోన్ ట్యాపింగులు చేయని ప్రభుత్వం ఏదీ ఉండదు.., సంఘ విద్రోహ శక్తుల నిఘాకు, నియంత్రణకు ఒకింత సమర్థనీయమే… రాజ్యం ఎప్పుడూ చేష్టలు దక్కి ఊరుకోదు… తనకు వ్యతిరేకంగా ఉండే ఏ శక్తినైనా, ఏ గొంతునైనా నిరంకుశంగా ట్రీట్ చేస్తుంది… రాజ్యం అన్నా, రాజకీయం అన్నా క్రూరమే… ఐతే, ఫోన్ ట్యాపింగును ఏకంగా ఎన్నికల్లో ఈ స్థాయిలో వ్యూహాత్మకంగా కేసీయార్ వాడుకున్న తీరు బహుశా ప్రపంచంలోనే మొదటిసారి కావచ్చు…
ఫోన్ ట్యాపింగు విలన్లలో ఒక్కొక్కడినీ కడిగేస్తుంటే చాలా అబ్బురపడే వివరాలు బయటికొస్తున్నాయి… సరే, హీరోయిన్లను లొంగదీసుకోవడానికి, పారిశ్రామికవేత్తలు-ధనికవ్యాపారుల నుంచి కోట్ల డబ్బు బెదిరించి మరీ వసూలు చేసుకోవడానికి ఈ ఫోన్ ట్యాపింగు వ్యవస్థను వాడుకోవడం ఓ నీచమైన క్రైమ్… కేసీయార్ తమకు నిర్దేశించిన పనులు చేస్తూనే ఈ విలన్ల గ్యాంగు తమ అక్రమార్జనకు వాడుకున్నారన్నమాట… ఏమో, ఇలా వాడుకున్నవాళ్లలో ఏ రాజకీయ ప్రముఖులున్నారో చివరకు సీఎం రేవంతే విలేకరులకు చెప్పాల్సి ఉంటుందేమో…
ఇంకా అసలు కీలక సూత్రధారి ఇండియాకు రాలేదు, తను వచ్చాక, పోలీస్ కస్టడీకి వచ్చిన తరువాత… ఇన్నాళ్లూ సెల్యూట్లు కొట్టిన చేతులు, మొహాలే కాస్త ర్యాష్‌గా హ్యాండిల్ చేస్తే, మరిన్ని విభ్రాంతికర నిజాలు వస్తాయేమో చూడాలి… దాదాపు ప్రతి మీడియా బ్యానర్ స్టోరీ ఇదే ఈరోజు… ఫోన్ ట్యాపింగు వెనుక బీఆర్ఎస్ సుప్రీమే ఉన్నాడని… బీఆర్ఎస్ సుప్రీం అంటే కేసీయారే కదా… ప్రతి మంత్రి ఎక్కడికి వెళ్లినా కేసీయార్ మెడకు ఫోన్ ట్యాపింగు ఉచ్చు తప్పదు, చంచల్‌గూడ తప్పదు అని కామెంట్లు చేస్తున్నారు…
Ads
ప్రత్యర్థి పార్టీల నేతలు డబ్బును ఎక్కడ పెట్టారు, ఎటు తరలిస్తున్నారు, పంపిణీ చేసే యంత్రాంగంలో ఎవరు కీలకమో ఫోన్ ట్యాపింగ్ ద్వారా కనుక్కోవడం, వాటిని అడ్డుకోవడం, స్వాధీనం చేసుకోవడం ఒకవైపు పని కాగా… ఈ పోలీసు టీమ్స్ టాస్క్‌ఫోర్స్ వెహికిల్స్‌లో ఎవరూ ఆపకుండా, ఎవరికీ సందేహం రాకుండా డబ్బును ఎవరికి చేర్చాలో వారికి చేర్చడం మరోవైపు పని… ఇది ప్లాన్ చేసి, విజయవంతంగా అమలు చేయడం అంటే దాని వెనుక ఉన్న బుర్ర మామూలుది కాదు… ఇది గతంలో ఎన్నడూ చూడని పోల్ మేనేజ్‌మెంట్…
కాకపోతే ప్రజలకు ఓసారి వ్యతిరేకత మొదలయ్యాక, పాలకుడి అసలు రూపం అర్థం కావడం మొదలయ్యాక…. ఈ టెక్నికల్ కుట్రలు, నేరాలు గెలిపించలేవు… మొన్నటి ఎన్నికల్లో నిరూపితమైంది అదే… సొంత కుటుంబసభ్యుల మీదే గాకుండా ఏపీ పొలిటిషియన్స్ ఫోన్లను కూడా ట్యాప్ చేశారనే మరో వార్త చదివినట్టు గుర్తు… ఇప్పుడంటే జగన్ ఎక్కువగా తాడేపల్లిలో ఉంటున్నాడు గానీ, గతంలో హైదరాబాద్‌లోనే కదా… తనకుతోడు ఏపీ కీలక పొలిటిషియన్స్ అందరూ హైదరాబాద్‌లోనే కదా ఉండేది… షర్మిల, పవన్ కల్యాణ్, చంద్రబాబు, లోకేష్, పురంధేశ్వరి… ఎవరు కాదు, దాదాపు అందరూ…
అయితే పెద్ద ప్రశ్న… నిందితుల వాంగ్మూలాలను బట్టి కేసు బిల్డప్ చేయడం, కేసీయార్ మెడకు ఈ కేసు తగిలించడం, నిరూపించడం అంత ఈజీయా..? అసలు కాదు… కోర్టుకు వెళ్లాక విచారణల తీరు వేరే ఉంటుంది… ఇలా కేసీయార్ మెడకు తగిలించడానికి సీరియస్ ప్రయత్నాలు జరిగితే కాళేశ్వరం ప్రాజెక్టు సహా బోలెడు… ఏ ఒక్క దానినైనా ఓ లాజికల్ ఎండ్‌కు తీసుకెళ్లగలడా రేవంత్ రెడ్డి..? అదే చూడాలి…! ఈ దిశలో బీజేపీ కూడా ఏమాత్రం కేసీయార్‌కు సపోర్టుగా రాదు, కాగల కార్యం రేవంతుడు తీర్చాడు అనుకుని, వినిపించకుండా చప్పట్లు కొడుతుంది..!!
చంద్రబాబుకూ కేసీయార్‌కు నడుమ వోటుకునోటు రాజీలు కుదిర్చిన పెద్ద తలకాయలు కొన్ని రేవంత్‌రెడ్డికి సన్నిహితులే… లోలోపల కేసీయార్ శ్రేయోభిలాషులే… కానీ రేవంత్ ఊరుకునే రకం కాదు కదా… కేసీయార్ మీద అసలే భుగభుగ… దానికితోడు బీఆర్ఎస్ ఎంత బలహీనపడితే అంతగా కాంగ్రెస్ పార్టీకి బలం… తెలంగాణ పాలిటిక్స్ గతంలో ఎన్నడూ లేనంత ఇంట్రస్టింగ్ స్టేజీకి చేరాయి…!!
Share this Article