మన సినిమాలే రొడ్డకొట్టుడు సినిమాలు కదా… వీలైనంతవరకూ ఫార్ములా, ఇమేజీ బిల్డప్పులు… పైగా రొటీన్ ప్రజెంటేషన్లు… అందుకే మలయాళం ప్రయోగాలు సినిమా ప్రియులను ఆకర్షిస్తుంటాయి… ఓటీటీలు వచ్చాక, తెలుగు వెర్షన్లు, సబ్ టైటిళ్లతో భాషాసమస్యను కూడా అధిగమించినట్టయింది…
మరి సినిమా రివ్యూల మాటేమిటి..? అవీ అంతే, తెలుగులో… పక్కా ఓ ఫార్మాట్‌లో ఉంటాయి… డిఫరెంట్ యాంగిల్స్, లోతైన విశ్లేషణ ఉండవు… (కొందరు తప్ప)… మలయాళంలో రివ్యూలు కూడా భిన్నంగా ఉంటయ్ కొన్ని… మలయాళ మనోరమ డిజిటల్ సైట్‌లో అలాంటిదే ఓ కొత్త కోణం కనిపించింది… ఇంట్రస్టింగు… ఆడుజీవితం సినిమా మలయాళంలో చాలామంది ప్రశంసలు పొందింది, పాన్ ఇండియా సినిమాగా ఐదారు భాషల్లో రిలీజైంది కదా…
ఐతే ఒరిజినల్ పుస్తకంలో గానీ, సినిమాలో గానీ కథానాయకుడు ఎదుర్కొన్న ఎడారి నరకం, అనుభవించిన మనోవ్యథ, శారీరిక హింసలను చక్కగా ప్రజెంట్ చేశారు, హీరో పృథ్వీరాజ్ కూడా మనసుపెట్టి నటించాడు… అంతవరకూ వోకే… కానీ కథానాయకుడి భార్య వేదనను ఎందుకు అండర్ ప్లే చేశారనేది ఆ రివ్యూయర్ ప్రశ్న… నిజానికి ఈ నవల, ఈ పుస్తకం నజీబ్ అనే వలస కార్మికుడి కథ… తన భార్య పేరు సైను… ఈ పాత్రను అమలాపాల్ పోషించింది, తను కూడా గుడ్ యాక్ట్రెస్…
Ads
సినిమా ఫస్టాఫ్‌లో ఆ పాత్ర ఇంపార్టెన్స్ పుస్తకంతో పోలిస్తే పెంచినట్టు అనిపించినా సరే, అవి నజీబ్ జ్ఞాపకాల్లో ఆమెతో ప్రేమ, బంధం, రొమాన్స్, పాటలు… కానీ నిజంగా ఎమోషన్స్ చిత్రీకరించాల్సిన చోట మాత్రం ఆమె కష్టాన్ని, ఆమె మథనాన్ని పుస్తక రచయిత, సినిమా దర్శకుడు విస్మరించినట్టే… ఒక ఇంటర్వ్యూలో పుస్తక రచయిత బెన్యామిన్ ఈ ప్రశ్న ఎదురైనప్పుడు ఈ విషయాన్ని అంగీకరించాడు… నిజమే, ఈ కథలో సైను వ్యథను గనుక సమగ్రంగా చిత్రించాలంటే మరో పుస్తకమే రాయాలి అన్నాడు…
90వ దశకం ప్రారంభంలో నజీబ్ మంచి అవకాశాల కోసం సౌదీ అరేబియాకు వెళ్తాడు… ఆ సమయానికి సైను 8 నెలల గర్భిణి… ఆ సమయంలో ఇంటర్నెట్ లేదు, ఫోన్ సదుపాయాలు లేవు… వెళ్తున్న నజీబ్‌ను శూన్య దృక్కులతో చూస్తూ ఉంటుంది ఆమె… తను వెళ్లిన మరుక్షణం నుంచీ తిరిగి నజీబ్ బతికే ఉన్నాడనే వార్త తెలిసేవరకూ ఆమె అనుభవించిన క్షోభ ఎలా ఉంటుందో నవల గానీ, పుస్తకం గానీ పెద్దగా పట్టించుకోలేదు… ఎంతసేపూ అతని గురించే తప్ప ఆమె గురించి చెప్పింది తక్కువే…
నజీబ్ వెళ్తున్నప్పుడు మన ఊరి సమీపంలో ఉన్న ఓ ఫోన్ బూత్‌కు ఫోన్లు చేస్తుంటానని చెబుతాడు… సౌదీకి చేరడానికి ముందు బొంబాయి నుంచి ఒకసారి కాల్ చేస్తాడు… ఇక అంతే… ఒక్కసారి సౌదీలో అడుగుపెట్టాక అసలు మనుషులే కనిపించని ఎడారి బతుకు… తిండే లేదు, ఇక ఫోన్ ఎక్కడిది..? ఇదంతా సరే, ఒక గర్భిణి… బిడ్డ పుట్టే వేళకు భర్త లేడు, తరువాత అతను ఏమయ్యాడో తెలియదు… ఆందోళన, బాధ… అనిశ్చితి… ఎవరైనా ఏమీ చెప్పలేని పరిస్థితి…
ఆమె తన బాధను నజీబ్ తల్లితో, నజీబ్ స్నేహితుడితో, వీసా దళారీతో చెప్పుకుని ఉండొచ్చు… రోజులు గడుస్తుంటాయి, వారాలు గడుస్తుంటాయి, నెలలు దాటిపోతుంటాాయి, నజీబ్ జాడ లేదు, సమాచారం లేదు… ఆమె తన సోదరులను సంప్రదిస్తే ఆమెకు లభించింది భరోసా, ఊరట, ఓదార్పు కావు… గల్ఫ్ దేశాలకు వెళ్లిన ఇతర కార్మికుల చేదు అనుభవాలను చెప్పి ఆమెలో ఆందోళనను మరింత పెంచారు… తన నుంచి ఏ సమాచారం లేదు, అందరూ ఇక అతడు రాడని చెప్పడం స్టార్ట్ చేస్తారు… చివరకు ఆమె కూడా లోలోపల తను ఇక రాడనే భావనకు వచ్చేస్తూ ఉంటుంది…
ఊళ్లో మిగతా వాళ్ల పరామర్శలు, ఒడిలో బిడ్డ, ఏం చేయాలో తెలియదు… ఈ నిరీక్షణకు ముగింపు తెలియదు… అంతు తెలియని ఓ చీకటి సొరంగంలో ఇరుక్కున్నట్టు వ్యథ,,. ఇది నజీబ్ ఆ ఎడారిలో అనుభవించిన వేదనకన్నా తక్కువేమీ కాదు… మూడేళ్ల తరువాత నజీబ్ బతికే ఉన్నాడనే వార్త వస్తుంది… అదే నజీబ్ స్వయంగా చేసిన ఓ ఫోన్ కాల్ ద్వారా…
ఇక నా భర్త సజీవంగా రాడు అని గుండె రాయి చేసుకున్న ఓ యువతి, ఓ బిడ్డ తల్లి తన భర్త సజీవంగా ఉన్నాడనే సమాచారం తెలియగానే ఆమె ఉద్వేగం ఎలా ఉంటుంది..? ప్చ్, సినిమాలో దాన్ని సరిగ్గా చిత్రించలేదు… ఇద్దరి ఫోన్ కాల్ సమయంలో ఎంతసేపూ కెమెరా నజీబ్ ఎమోషన్స్ క్యారీ చేస్తుంది తప్ప ఆమె బలమైన ఉద్వేగాన్ని పట్టుకోలేకపోయింది, అసలు కెమెరా అటువైపు తిరిగితే కదా… ఆమెను చూపించదు కెమెరా, ఆమె మాటలు కొన్ని వినిపిస్తాయి… విరిగినట్టున్న స్వరం కొంత ఆమె ఎమోషన్‌ను పట్టిచ్చినా సరే, సరైన పదాలు దొరక్క ఎలా ప్రతిస్పందించాలో తెలియక ఆమె వెక్కుతున్న ఒకటీరెండు శబ్దాలు తప్ప ఆమె కన్నీళ్లు… విషాదం, ఆనందం, రిలీఫ్ తదితర ఎమోషన్స్ కలగలిపిన ఫీల్‌ను ఆమె మొహంలో దర్శకుడు చూపించలేకపోయాడు… నిజానికి అమలాపాల్ దాన్ని బాగా చేయగలదు… కానీ ఎంతసేపూ అతడు తప్ప ఆమె కనిపించని దర్శకుడి వైఫల్యమే ఇది…… ఇలా సాగింది ఆ రివ్యూ… బాగుంది…
Share this Article