యూ ఆర్ స్ట్రాంగ్– మహమ్మద్ ఖదీర్‌బాబు
మరణానికి దగ్గరగా ఉన్న పేషెంట్లతో ఆమె నిత్యం ఉదయం పూట రౌండ్స్‌లో అనే మాట ‘యూ ఆర్ స్ట్రాంగ్’. రాత్రి అనుభవించిన నొప్పిని, వేదనను, కొలతకు అందని దిగులును ఆ ‘చివరి రోజుల విడిది’లో ఉన్న పేషెంట్లు ఉదయాన వ్యక్తం చేస్తే కౌన్సిలర్‌గా ఆమె అనే మాట, అనక తప్పని మాట… ‘దీనిని నువ్వు తట్టుకోగలవు. యూ ఆర్ స్ట్రాంగ్’ అని…
‘స్వాతి ముత్తిన మలె హనియే’ సినిమా చూసేటప్పుడు అర్థాన్ని చూస్తుంటే ఒక కథ, అంతరార్థాన్ని చూస్తుంటే ఒక కథ ఉంటాయి– దర్శకుడి మేథ వల్ల.
ఎవరు ఎవరికి ‘యూ ఆర్ స్ట్రాంగ్‘ అని చెప్పుకుంటున్నారు?
కేర్ సెంటర్‌లో పని చేసే ఆ కౌన్సిలరే తనకు తాను రోజూ చెప్పుకుంటోంది ‘యూ ఆర్ స్ట్రాంగ్’ అని.
దేనికి?
ఆమె వివాహం చావుకు దగ్గరగా ఉంది.
కేర్ సెంటర్‌లో నిజంగా మృత్యువుకు దగ్గరైన వారు ఉన్నారు. కాని ఇంట్లో మృతప్రాయమైన భర్త ఉన్నాడు. వాడు ఆమెకు ఏమీ కాడు. వాడికి ఆమె ఏమీ కానివ్వడు. వాడికి మరొకరితో సంబంధం ఉంది. టెక్నికల్‌గా ఇంట్లో ఉంటున్నాడు. చక్కగా, మర్యాదగా ఉంటూనే ఆమెతో ఎంత దూరంగా ఉంటున్నాడంటే అడ్డంకులు లేని కండరాల ఒరిపిడి వల్ల ఎక్కడ దగ్గరితనం ఏర్పడుతుందోనని కండోమ్ వాడుతుంటాడు.
ఒక సన్నివేశం ఉంటుంది– అతడు కండోమ్ ప్యాకెట్ మంచం మీద పెట్టినప్పుడు ఆమె దానివైపు చూసే చూపు.
వివాహ బంధం మరణిస్తే, బంధంలోని వారు ఒకరికి ఒకరు మరణిస్తే– ఇక్కడే దర్శకుడు ఒక గొప్ప స్టేట్‌మెంట్ ఇస్తాడు– ఆ స్త్రీ ఆఖరికి మృత్యువుతో పోరాడుతున్న వ్యక్తిలో కూడా ప్రేమను వెతుక్కుంటుంది. వెతుక్కోవాల్సి వస్తుంది. వెతుక్కునే అగత్యంలో పడుతుంది.
చచ్చిపోతాడని తెలుసు– కాని ప్రేమలో పడుతుంది. ‘నీ చీర ఎంత బాగుంది. తాకి చూడొచ్చా’.. చిన్న మాటే. రోజూ కిటికీ వైపు కూచునే వాడు ఆ రోజు తలుపు వైపు చూస్తూ కూచుంటాడు ఆమె వచ్చేసరికి. చిన్న జెస్చరే.
రిపోర్టులు, టెస్ట్‌లు మనిషి ఎప్పుడు చనిపోతాయో చెబుతాయి. కాని పెళ్లిలోని బంధం ఎప్పుడు చనిపోయిందో గుర్తించగలిగితే భార్యాభర్తలకు వెంటనే తెలుస్తుంది. గుర్తించకపోతే గుర్తించే కాలం తప్పక వస్తుంది. ఆమె ఒక డాక్టర్, కౌన్సిలర్… పోయే ప్రాణంతో ఉన్నవారికి ధైర్యం చెప్పే ఆమె… కేవలం స్త్రీ అయిన కారణాన భార్య అయిన కారణాన భర్తకు కౌన్సిలింగ్ ఇవ్వదు. ఇవ్వలేదు. ‘నువ్వు భర్తగా బతగ్గలవు’ అని భర్తగా ఉండటం అంటే ఏమిటో గుర్తు చేయదు.
కేర్ సెంటర్‌లో పేషెంట్ మాత్రమే చనిపోతాడు. కాని ఇంట్లో బంధం చనిపోతే భార్య, భర్త, (ఉంటే) పిల్లలు అందరూ చనిపోతారు… మానసికంగా. సినిమా మొదలయ్యే సమయానికి ఆమెకు జీవితం ఎంత రొటీన్‌గా ఉంటుందంటే దోసెలు పోయడం, పూలు రాలిన వాకిలిని చిమ్ముకోవడం. కనీసం వేరే టిఫిన్ చేయాలన్న ఆసక్తి కూడా ఆమెకు లేదని సినిమా చివరి వరకూ ఆమె అనేకసార్లు దోసెలు పోసే సన్నివేశాన్ని కావాలని చూపిస్తాడు దర్శకుడు. ఇలా అయ్యేలా ఆమెను చంపింది… చావుకు దగ్గరగా చేసింది ఎవరు? ఇలా ఎన్ని ఇళ్లలో స్త్రీలు చావుకు దగ్గరగా ఉన్నారు? పైకి నవ్వుతూ కనిపిస్తూ… పెళ్లిళ్లలో వేడుకల్లో మంచి బట్టల్లో అలంకరించుకుని తిరుగుతూ.
‘స్వాతి ముత్తిన మలె హనియె’లో అత్యంత కష్టంగా అనిపించే సన్నివేశం.. కథానాయిక తల్లి (కథలో ఆమె ప్రైమరి టీచర్) కూతురిని చూడటానికి రావడం. ఒకే ఇంట్లో చచ్చినట్టు బతుకుతున్న కూతురిని, అల్లుడిని చూసి ఆమె రెండు రోజుల్లో ఎంతో మర్యాదగా వెనక్కు వెళ్లిపోతుంది. ఇక్కడ కూడా దర్శకుడి మేథ ఏమిటంటే– ఏమడిగితే ఏం వినాల్సి వస్తుందోనని ఆమె కూతురిని గాని, అల్లుణ్ణి గాని ఏమీ అడగదు. ఈ వయసులో అవసరమా? ఎవరి చావుకు ఎవరు బాధ్యులు?
‘స్వాతి ముత్తిన మలె హనియె’ చావుకుదగ్గరైన పేషెంట్ల విడిది కేంద్రంలో జరిగే ప్రేమ కథ అనుకునేరు.
ఒకరికి ఒకరు సమయం, ఒకరికి ఒకరు ప్రేమ, ఒకరి పట్ల ఒకరికి ఆసక్తి, ఒకరి పట్ల ఒకరికి బాధ్యత, ఒకరితో మరొకరు కలిసి ఉండటానికి అవసరమైన యోగ్యత… ఇవి లేని వారు, జీవన ఇంద్రియాలను కోల్పోయిన వారు… భార్యాభర్తలు… ఎవరో చచ్చిపోతున్నారని జాలి పడటం తర్వాత… ముందు మీరు పోయారని తెలుసుకుని జాలి పడండి అని చెప్పడమే ఈ సినిమా.
ఇలాంటి కథలు ‘బియాండ్ కాఫీ’, ‘మెట్రో కథలు’లో చాలా ఉన్నాయి. మన దగ్గర తీయలేదు. కన్నడంలో తీశారు. అంతే తేడా.
Share this Article