అందరూ బీఆర్ఎస్‌ను ఆడిపోసుకుంటారు… కేసీయార్, కేటీయార్, కవిత, హరీష్‌రావు, సంతోష్‌రావు… అంతా ఆ కుటుంబమేనా అని… కానీ అయిదుగురే కదా… మొన్నమొన్నటిదాకా కేసీయార్ జిగ్రీ దోస్త్ దేవెగౌడ ఫ్యామిలీని చూడండి… ఏకంగా తొమ్మిది మంది రాజకీయాల్లో యాక్టివ్… లోకసభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి… ఏదైనా వాళ్లకే… మా కుటుంబం, మా పార్టీ, అంతే… ఈ కుటుంబ పెద్ద త్వరలో 90 ఏళ్లు నిండబోయే మాజీ ప్రధాని దేవెగౌడ…
సరిగ్గా సంవత్సరం క్రితం మోడీ ఎక్కడో మాట్లాడుతూ… జేడీఎస్ ప్రైవేటు లిమిటెడ్ అని వ్యంగ్యాన్ని దట్టించాడు… ఇప్పుడు అదే పార్టీ బీజేపీ మిత్రపక్షం… ఎన్డీఏలో భాగస్వామి… అంతేనా..? మోడీ ఎప్పుడు మాట్లాడినా కుటుంబ పార్టీలు అంటూ చాలా పార్టీలను వెక్కిరిస్తుంటాడు… ఇప్పుడు ఆ జేడీఎస్ తనకు మిత్రుడైపోయాడు… మోడీయే దేవెగౌడ అల్లుడికి బీజేపీ టికెట్టిచ్చాడు… అదీ ఐరనీ…
నమ్మబుద్ధి కావడం లేదా..? సింపుల్ ఉదాహరణ… కర్నాటకలో 28 ఎంపీ సీట్లు ఉంటే… ఎన్‌డీఏలో సీట్ షేరింగ్… బీజేపీ 25, దేవెగౌడ పార్టీ (జేడీఎస్) 3… ఆ మూడు సీట్లలోనూ ఆ కుటుంబసభ్యులే పోటీచేస్తున్నారు… దేవెగౌడ ఆల్రెడీ రాజ్యసభ మెంబర్ కదా, ఇప్పుడు బరిలో దేవెగౌడ కొడుకు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మండ్యా నుంచి లోకసభకు పోటీచేస్తున్నాడు… (ప్రస్తుతం చెన్నపట్న ఎమ్మెల్యే)… ఇక్కడ గత ఎన్నికల్లో మాజీ నటి సుమలత ఇండిపెండెంటుగా పోటీచేస్తే బీజేపీ మద్దతునిచ్చింది… ఆమె ఇప్పుడు బీజేపీలో చేరింది, ఆమె సీటే గల్లంతయ్యింది…
Ads
దేవెగౌడ అల్లుడు, ప్రముఖ కార్డియాలజిస్టు మంజునాథ బెంగుళూరు రూరల్ నుంచి పోటీచేస్తున్నాడు… కాకపోతే తను బీజేపీ టికెట్టుపై…! దేవెగౌడ మనమడు ప్రజ్వల్ రేవణ్న హసన్ సీటు నుంచి పోటీచేస్తున్నాడు… గతంలో ఇక్కడ నుంచే గెలిచాడు తను… కుమారస్వామి భార్య అనిత రామనగర నుంచి ఎమ్మెల్యేగా ఉండేది… కుమారస్వామి కొడుకు నిఖిల్ ఇంతకుముందు మండ్యా నుంచి ఎంపీగా, రామనగర నుంచి ఎమ్మెల్యేగా పోటీచేశాడు.,. ఓడిపోయాడు…
దేవెగౌడ కుమారుడు, ప్రజ్వల్ తండ్రి రేవణ్న హోలెనర్సిపుర నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు… ఆయన భార్య భవానీ హసన్ జిల్లా పరిషత్ సభ్యురాలు… వాళ్ల కొడుకు సూరజ్ ఎమ్మెల్సీ… జెడ్పీటీసీ నుంచి రాజ్యసభ దాకా అంతా వాళ్లే… ఇదేమిటయ్యా అనడిగితే… పార్టీ, కార్యకర్తల ప్రయోజనాల కోసం కుటుంబసభ్యులందరమూ కష్టపడాల్సి వస్తోంది మరి అంటున్నాడు కుమారస్వామి… ఆయన ఎంపీగా గెలిస్తే, అసెంబ్లీ సీటు ఖాళీ అవుతుంది కదా, ఆ ఉపఎన్నికల్లో నిలబడేది ఎవరు..? నో, నెవ్వర్, పార్టీ ఇతర నాయకులు కాదు… తన కొడుకు నిఖిల్..!! కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భారత రాజకీయాలన్నీ కుటుంబ పార్టీల గుప్పిట్లోనే..! కాస్త ఎక్కువ, కాస్త తక్కువ, అంతే..!!
Share this Article