తిరువళ్ళువార్ పద్యాలు పాడండి!
ఉచితంగా పెట్రోల్ పొందండి!!
——————–
తమిళుల మాతృ భాషాభిమానం గురించి ఎంత చెప్పుకున్నా- ఇంకా చెప్పాల్సింది ఎంతో మిగిలే ఉంటుంది. భాష, యాస, వేషం, ఆచారాల్లో వారు చాలా పట్టుదలగా ఉంటారు. ఎంతగా అత్యాధునికతను అంది పుచ్చుకున్నా అడుగడుగునా, అణువణువునా తమిళ ముద్రను మాత్రం జాగ్రత్తగా పొదివి పట్టుకునే ఉంటారు. మాతృ భాష పరిరక్షణ విషయంలో తమిళులతో సరితూగగలవారు చాలా తక్కువగా ఉంటారు.
ఇక అసలు విషయంలోకి వెళదాం. తమిళనాడులో కరూర్ పట్టణంలో సెంగుత్తవన్ అనే పెద్దాయన చాలా కాలంగా పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నాడు. తమిళ భాష అంటే ఆయనకు పులకింత. తమిళ సాహిత్యంలో ఎవరెస్టు శిఖర సమానుడయిన తిరువళ్ళువార్ ద్విపదలంటే చెవి కోసుకుంటాడు. తమిళులు ఆ ద్విపదలను తిరుక్కురళ్ అంటారు. మన వేమనలా అత్యంత సరళమయిన, అందమయిన తమిళంలో తిరువళ్ళువార్ దాదాపు పదిహేను వందల సంవత్సరాల క్రితం సామాజిక, ఆర్థిక, కుటుంబ పరమయిన అనేక విషయాల మీద ద్విపదలు అల్లాడు. ప్రతి పదంలో తమిళ భాష అందచందాలు తొంగి చూస్తుంటాయి. వేల ఏళ్ల ప్రవాహంలో రూపుదిద్దుకున్న అనేక తమిళ నుడికారాలను, సామెతలను, వాడుక మాటలను తిరువళ్ళువార్ తన కవితల్లో పట్టి బంధించాడు. పెట్రోల్ బంక్ లాభాల బాట పట్టగానే సెంగుత్తివన్ తన అభిమాన తమిళ మహాకవి తిరువళ్ళువార్ పేరిట మేనేజ్మెంట్ కాలేజీ కూడా ప్రారంభించాడు. ఆయన కృషి, దీక్షల ఫలితంగా ఆ కాలేజీ కూడా చక్కగా నడుస్తోంది.
Ads
దేశంలో ఇదివరకు ఆరు నెలలకు, సంవత్సరానికి పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు పెరిగేవి. ఇప్పుడు రోజులు మారాయి కాబట్టి రోజూ రేట్లు మారుతుంటాయి. త్వరలో గంట గంటకు రేట్లు పెరుగుతాయి. పెరుగుతున్న పెట్రోల్ రేట్ల వల్ల నిజానికి కమిషన్ రూపంలో సెంగుత్తివన్ కు ఆదాయం పెరిగి హాయిగా ఉండాలి. కానీ- మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి పెరిగే పెట్రోల్ ధరలకు వణికిపోతుండడం సెంగుత్తివన్ జీర్ణించుకోలేకపోయాడు. ఈ జనవరి నుండి ఆయన తన పెట్రోల్ బంక్ లో ఒక వినూత్న ఆఫర్ ప్రకటించాడు. దాంతో జాతీయ వార్తలకెక్కాడు. ఆ ఆఫర్ వివరాలివి.
1. ఒకటి నుండి పన్నెండో తరగతిలోపు చదివే పిల్లలు ఎవరయినా తిరువళ్ళువార్ తిరుక్కురళ్ ద్విపదలు పది చూడకుండా నోటికి చెబితే వారి తల్లిదండ్రులకు హాఫ్ లీటర్ పెట్రోల్ ఉచితం.
2. ఇరవై చెబితే లీటర్ ఫ్రీ పెట్రోల్.
3. చెప్పిన ద్విపద చెప్పకుండా ఒకరు ఎన్నయినా, ఎన్నిసార్లయినా చెప్పవచ్చు. ప్రతి పది ద్విపదలకు హాఫ్ లీటర్ పెట్రోల్ ఉచితం.
4. ఈ రెండు నెలల్లో ఇప్పటికే దాదాపు రెండు వందల మంది విద్యార్థులు చక్కగా తమిళ ద్విపదలు చెప్పి ఉచిత పెట్రోల్ బహుమతిగా వారి తలిదండ్రులకు ఇచ్చారు.
5. ఈ ఆఫర్ ఇంకొన్ని నెలలు అందుబాటులో ఉంటుంది.
6. ఆఫర్ లో పెట్రోల్ గెలుపొందిన విద్యార్థులకు కాలేజీలో జరిగే తిరువళ్ళువార్ ఉత్సవాలకు ప్రత్యేక ఆహ్వానం.
——————–
సెంగుత్తివన్ అభినందనీయుడు. మాతృభాషమీద అంతులేని మమకారం, మధ్య తరగతి మీద అవ్యాజమయిన ప్రేమ ఉన్న సెంగుత్తివన్ పది కాలాలు చల్లగా ఉండి ఇలాగే తమిళ భాషకు సేవ చేయాలి. పది మందిని ఇలాగే ఆదుకోవాలి.
——————–
ఇప్పుడు తెలుగు భాషకు- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గడ్డకు సెంగుత్తివన్ కథను అన్వయించుకుందాం. వరంగల్లో సహజకవి పోతన పద్యాలు పది చెబితే ఎవరయినా పది మిల్లీ లీటర్ల పెట్రోల్ ఉచితంగా పోస్తారా? ఒక వేళ పోసినా పుస్తకం చూడకుండా గుక్క తిప్పుకోకుండా పది పోతన పద్యాలు చెప్పే విద్యార్థులు తుపాకి గుండుకు ఒకరయినా దొరుకుతారా? వాల్మీకి రామాయణం అందాన్ని పట్టి బంధించి తెలుగులో రామాయణ కల్పవృక్షాన్ని మనకిచ్చిన విశ్వనాథ సత్యనారాయణ పది పద్యాలు విజయవాడలో ఏ విద్యార్థి అయినా చెప్పగలడా? చెప్పినా పది చుక్కల పెట్రోల్ విజయవాడ ఉచితంగా ఇవ్వగలదా?
నన్నయ, తిక్కన, పాల్కురికి, పోతన, శ్రీనాథుడు, అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య, వేమన, గురజాడ, శ్రీ శ్రీ, దాశరథి, సి నా రె… చెబుతూ పొతే తెలుగు కవుల సాహితీ సంపద అనంతం. వందల ఏళ్లు ఆయుష్షు దక్కినా చదవడానికి సమయం సరిపోని అమృతతుల్యమయిన సాహిత్యం తెలుగు సొంతం. మన నిర్లక్ష్యం, చిన్నచూపు వల్ల పోయింది పోగా- మిగిలింది మిణుకు మిణుకుమంటూ గాలిలో దీపంలా ఉంది. మనం మనమే. మనం సెంగుత్తివన్ లు కాలేము. తిరువళ్ళువార్ తిరుక్కురళ్ కు దండాలు. తిరువళ్ళువార్ సాహిత్యానికి పెట్రోల్ పోసి శతాబ్దాల ఆ సాహితీ ప్రయాణాన్ని మరింతగా ముందుకు తీసుకెళుతున్న సెంగుత్తివన్ కు శతకోటి దండాలు. తమిళ భాష వారికి శ్వాస. తెలుగు భాష మనకు కంఠ శోష…. By……. పమిడికాల్వ మధుసూదన్
Share this Article