Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒక్క “పల్లె కన్నీరు పెడుతోందో” పాట పల్లవి ఈడ్చి తంతే… అవన్నీ…

April 8, 2024 by M S R

ఎన్నికల భాషాజ్ఞానంలో ప్రాసలు- పంచులు

‘రాజకీయం’ మాట వ్యుత్పత్తిలో నీచార్థం లేదు. కాలగతిలో రాజకీయ స్వభావం వల్ల ఒకరకమైన అర్థం స్థిరపడింది. రాజకీయంతో ముడిపడని విషయమే ఉండదు. రాజకీయ పరిభాషకు బయట ఎక్కడా నిఘంటువులు దొరకవు. అవసరం కూడా లేదు.

“2050 నాటికి దేశంలో అందరికీ ఇళ్లు ఉండాలి”
“2075 నాటికి దేశంలో నదులనన్నిటినీ కలిపి తాగునీటి సమస్యను తీర్చేస్తాం”
“3075 నాటికి భారత్ ప్రపంచాన్ని శాసించేలా చేయడమే మా పార్టీ సంకల్పం”
“నగరంలో ట్రాఫిక్ సమస్య లేకుండా మరో వందేళ్లకు సరిపడా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం”

Ads

లాంటి రాజకీయ ప్రకటనల్లో భాషాపరంగా ఎలాంటి దోషాలు లేకపోయినా…వినేవారికెందుకో అవి అర్థం కావు. అర్థమైనా ఆచరణలో అవి సాధ్యం కాదని…స్పష్టత ఉంటుంది. ప్రజలకు ఆ స్పష్టత ఉంటుందన్న ధైర్యంతోనే నాయకులు ప్రకటనల గాలిమేడలను కట్టి…హామీల దేవతా వస్త్రాలను అమ్మి…ఎన్నికల వైతరుణులు దాటేస్తూ ఉంటారు.

“2050 కాదు కదా 5050కి కూడా ఇళ్లులేని నిరుపేదలు ఉంటారు”
“నదులన్నిటినీ కలిపితే…ఇప్పుడు మిగిలి ఉన్న నదులు కూడా నామరూపాల్లేకుండా పోతాయి”
“3075 లో ప్రపంచాన్ని శాసించడమేమిటి? ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్నది మీ పార్టీయే కదా?”
“నగరాల్లో ట్రాఫిక్ సమస్యను దేవుడే దిగి వచ్చినా పరిష్కరించలేడు”

ఇలా క్రమాలంకారంలో రాజకీయ ప్రకటనలు ఒక్కొక్కటి జనానికి స్పష్టంగా అర్థమవుతాయి.

ఎన్నికలొస్తే రాజకీయ నాయకుల కష్టం పగవాడికి కూడా వద్దు. మిగతా విషయాల సంగతి ఎలా ఉన్నా పంచ్ డైలాగుల కోసం వారు పడే తపన అంతా ఇంతా కాదు. సాహిత్యం చదివి, పద్యాలు, పాటలు, సామెతలు, నుడికారాలు, భాషలో చమత్కారాలు, వెటకారాలు, శ్లేషలు, ధ్వనులు, నిందాస్తుతులు, స్తుతి నిందలు, కారాలు-మిరియాలు, మాటల పొందికలో అందం, రంగు- రుచి- వాసన తెలిసి…నాలుక మీద మాతృభాష పరవళ్లు తొక్కే రాజకీయనాయకులు నూటికో కోటికో ఒక్కరు. మిగతావారు ఎవరితో అయినా రాయించుకోవాల్సిందే. చెప్పించుకోవాల్సిందే. డిజిటల్ పొట్టి ట్విట్టర్, ఇన్స్టా, షార్ట్ వీడియో యూ ట్యూబ్ చట్రాల్లో ఇమిడే భాష కావాలి. ప్రాసలు పండాలి. వైరల్ అయ్యే పంచ్ లు పడాలి. పాపులర్ సినిమా డైలాగులను అటు ఇటు మార్చి…జనం నోళ్లల్లో నానేనా చేసుకోవాలి.

రాజకీయం ఒక వృత్తి. ఒక వ్యాపారం. ఒక వృత్తి వ్యాపారం. ఒక వ్యాపార వృత్తి. ఒక వ్యసనం. ఒక ఊబి. కుడి ఎడమల తుపాకులుండే ఒక హోదా. టోల్ గేట్లలో ఆగక్కర్లేని, డబ్బు కట్టక్కర్లేని బాధ్యతలేని ఒక గర్వం. వైట్ అండ్ వైట్ గంజి పెట్టి ఇస్త్రీ బట్టలు తొడుక్కునే ఒక వ్యామోహం. తరతరాలకు తరగని సంపద పోగేసుకోవడానికి ఒక రాజమార్గం. అలాంటి రాజకీయాల్లో ఉనికి కోసం ప్రాసలు, యాసలు, సామెతలు, పిట్టకథలు, పాటల పల్లవులు ఉపయోగపడడం భాషాభిమానులు ఆనందించాల్సిన విషయం. పల్లెజనానికి అర్థమయ్యేలా ఆ ప్రాంతానికి అత్యంత సహజమైన మాండలికంలో మాట్లాడుతుండడం మరింత ఆనందించాల్సిన విషయం.

ఎటొచ్చి- యంగ్ జనేరేషన్ ఇంగ్లీషు మీడియం చదువులు చదివి…ఎన్నికల ప్రచారాన్ని తెలుగులో రాస్తుండడంతో అది చాలాసార్లు గుడ్డి గూగుల్ ఈత చెట్టుకు స్విమ్మింగ్ ట్రీ అన్నట్లు కర్ణ కఠోరంగా ఉంటోంది. గూగుల్లో తెలుగు సినిమా పంచ్ డైలాగులను వెతికి…వాటిని కట్ అండ్ పేస్ట్ లా వైరల్ ఉద్యమాలకు ఆజ్యం పోసే అద్దె బుర్రలు ఒక్కసారి ఏ పల్లె రచ్చబండ దగ్గరో చెవి ఒగ్గి వింటే…త్రివిక్రమ్ లు రాయలేనన్ని పంచ్ డైలాగులు దొరుకుతాయి. జంధ్యాలలు పట్టుకోలేనంత హాస్యం దొరుకుతుంది. పింగళులు వినిపించలేనంత వ్యంగ్యం దొరుకుతుంది. స్మార్ట్ ఫోనే ప్రపంచం అయినవారికి ప్రపంచంతో సంబంధం తెగిపోయింది. అందుకేనేమో ఎంతగా డిజిటల్ సునామీలు కనిపిస్తున్నా…అది బలుపు కాదు- వాపేనన్న ఎరుకతో ఇప్పటికీ నాయకులు వీలైనంతవరకు ఓటర్లతో నేరుగా కలవడానికే ఎండననక వాననక…రాత్రనక పగలనక ఊళ్లమీద పడి తిరుగుతూ ఉంటారు.

ఎన్నెన్ని ఎన్నికల కలల, కళల వ్యూహాలు రూపొందించినా…ఒక్కోసారి ఎన్నెన్ని హై టెక్ ఆకాశ హర్మ్యాలను ముందు పెట్టినా…ఒక్క “పల్లె కన్నీరు పెడుతోందో!” పాట పల్లవి ఈడ్చి తంతే…అవన్నీ పేకమేడల్లా కూలిపోయిన సందర్భాలు కోకొల్లలు.   -పమిడికాల్వ మధుసూదన్   9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions