…(రమణ కొంటికర్ల)…. కళ్లతో చూసేది.. చెవులతో వినేది మాత్రమే నిజం. ఇప్పుడు పెద్ద పత్రికలు, బడా టీవీ ఛానల్స్.. మొత్తంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా నెత్తికెక్కించుకున్న మోటో ఇది. వెరసి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చచ్చిపోతోందన్నది ఇప్పుడు దేశంలో జరుగుతున్న ప్రధాన చర్చ. దాంతో కలుగులో ఉన్న ఎలుకలు.. అలాగే, తమ ఆట అవి ఆడేస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ కళ్లకు గంతలు కట్టుకుంది. కాదు.. ప్రభుత్వ, కార్పోరేట్ పెద్దలే ఆ గంతలు కట్టేసి.. ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అనే ఆటాడుతున్నాయనేది బహిరంగ రహస్యం.
కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు.. కుక్కను మనిషి కరిస్తే అదే వెరైటీ.. దాన్నే పొద్దస్తమానం తిప్పి తిప్పి చూపిస్తే.. అదే ఎక్స్ క్లూజివ్, బ్రేకింగ్, ఫస్ట్ ఆన్. ఇదీ మెయిన్ స్ట్రీమ్ ఎలక్ట్రానిక్ మీడియా వైఖరి. ఇదే వ్యూయర్ షిప్ కు.. బార్క్ రేటింగ్స్ కు బెంచ్ మార్కో, ఏమో ఇప్పటికీ మీడియాలో అనుభవమున్నవారికి కూడా సరిగ్గా అర్థం కాని ఓ బ్రహ్మపదార్థమది. వ్యూయర్స్ చూస్తున్నారు మేం వేస్తున్నాం.. టీవీ ఛానల్స్ వేస్తుంటే వీక్షకులమైన మేం చూడక చస్తామా.. అనే చర్చ తర్కానికి అందనిది. కోడి ముందా, గుడ్డు ముందా అన్న మీమాంస పోలినది.
ఓ ప్రజాప్రతినిధి ఎంత గొప్పగా తిడితే.. అంతకన్నా ఎక్కువందుకోగలమన్నట్టు మరో పార్టీ లీడర్ అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ ను వాడుతూ.. చట్టసభల్లో చట్టాలు చేస్తున్న రోజుల్లో అంతకన్నా ఎక్కువేం చూపిస్తామనుకుంటుందో, ఏమో ప్రింట్ మీడియా కూడా రాయడం మాని మూసేసుకుంటోంది. శంకుస్థాపనలు, తిట్ల పురాణాలు, ఎలాంటి ఇబ్బందులు తలెత్తని స్పోర్ట్స్ కంటెంట్, లేక మీడియాకు ఇబ్బంది పెట్టని కాంట్రవర్సీస్.. ఇదిగో ఇలా పరిమితమైపోయింది.. వార్తలు, వాటి కథనాల శైలి.
Ads
అందుకు, ఈమధ్య దేశాన్ని పట్టి కుదిపిన ఎలక్ట్రోరల్ బాండ్ వ్యవహారాన్ని ఓ చిన్న ఉదాహరణగా తీసుకోవచ్చు. ఏకంగా బీజేపీ ఎలక్ట్రోరల్ బాండ్స్ స్వీకరణ అనే దాన్ని చట్టమే చేసింది. సాధారణంగా చట్టసభల్లో రూపుదిద్దుకునే చట్టాలపై మాట్లాడేందుకు ఒకింత ఆలోచించే కోర్టులు కూడా దానిపై మొట్టికాయలు వేశాయి. కానీ, ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆ అంశాన్ని పెద్దగా పట్టించుకున్నట్టుగా.. బ్రేకింగ్ ప్లేట్లు వేయాలన్న ఆలోచన చేసినట్టుగా.. ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్స్ అందించాలన్న యోచనలో ఉన్నట్టుగా.. ఫస్ట్ ఆన్ అని చెప్పుకోవాలన్న జిజ్ఞాస కనబర్చినట్టుగా కూడా ఎక్కడా కనబడలేదు. ముందుగా దాన్ని హఫ్పింగ్టన్ పోస్ట్ అనే ఓ సైట్ బ్రేక్ చేస్తే… కనీసం ఆ తర్వాత కూడా ఎత్తుకోలేకపోయాయి మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలు. హఫ్పింగ్టన్ పోస్ట్ తర్వాత.. ఎలక్ట్రోరల్ బాండ్స్ ఫాలోఅప్ కథనాలకు కూడా మళ్లీ ఎత్తుకోవడంలో.. మెయిన్ స్ట్రీమ్ కంటే కొన్ని వెబ్ సైట్స్, ఇండిపెండెంట్ జర్నలిస్టులే ముందుండటం… పారదర్శకంగా ఉండాల్సిన మెయిన్ స్ట్రీమ్.. గొర్రెధాటిలో పక్షవాతం వచ్చి ఎలా నిర్వీర్యమైపోయిందో తెలియజెప్పింది.
ప్రస్తుత మార్కెట్ లో నీతి, నిజాయితీ, పారదర్శకత, నైతికత.. ఇలాంటి పదాలు నిషిద్ధం. ఏ ఛానల్ చూసినా, పత్రిక చూసినా.. జస్ట్ మేనేజ్ మెంట్ పాలసీని అమలు చేయాల్సిన ఉద్యోగులే తప్ప… జర్నలిస్టులెక్కడున్నారు.? లేదంటే.. జర్నలిజంలో చాలీచాలని జీతాలు.. అసలు జీతాలే అందని బతుకులతో.. ఎర్నలిస్టులుగా మారిపోతున్న క్రమంలో.. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే నాల్గో ఎస్టేట్ మీడియా అని చెప్పుకోవడం మిల్లీనియం జోక్.
అయితే, ఎక్కడో ఓ చిన్న దీపం వెలుగుతూనే ఉంటుంది. అదే ఆశై.. సమాజాన్ని నడిపిస్తుంది. ఇదిగో మనం చెప్పుకున్న మెయిన్ స్ట్రీమ్.. కళ్లకు గంతలు కట్టుకున్న నేపథ్యంలో… ఇండిపెండెంట్ జర్నలిజానికి, వెబ్ సైట్స్ కి.. డిజిటల్ మీడియా ఓ ఎర్రతివాచీ పర్చింది. ఆ దిశగా డిజిటల్ మీడియాను దుర్వినియోగపరుస్తున్న యూట్యూబ్ ఛానల్స్, పేరు గొప్ప వెబ్ సైట్స్ కూడా చాలానే కనిపిస్తున్నా… మరి కొందరు ప్యాషనేట్ జర్నలిస్టుల ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ముచ్చటగొల్పేది.
ఈ క్రమంలో కొన్ని వెబ్సైట్స్, కొందరు ఇండిపెండెంట్ జర్నలిస్టుల గురించి చెప్పుకోవాల్సిన సందర్భమిది.
2019లో లోకేష్ బాత్రా అనే ఓ రిటైర్డ్ న్యావీ అధికారి.. సమచార హక్కు చట్టం ద్వారా సేకరించిన కొన్ని ఆధారాలతో.. ప్రభుత్వాలు కార్పోరేట్ సంస్థలు, పారిశ్రామిక దిగ్గజాల నుంచి విరాళాలను పొందేందుకు ఎలా ప్రయత్నిస్తున్నాయి, వాటిని చట్టపరిధిలో సంస్కరణలని చెబుతూ ఎలా మాయ చేస్తున్నాయో వివరించేందుకు.. నితిన్ సేథీ అనే ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టును సంప్రదించాడు. నితిన్ సేథీ సుమారు రెండు దశాబ్దాలుగా భారత్ లో వలసలు, అవినీతి, పర్యావరణ కాలుష్యం, వాతావరణ మార్పులు, రాజకీయ పార్టీలకందే విరాళాలు, సహజ వనరుల దోపిడీ, ప్రజల ఆర్థిక వృద్ధి రేటు వంటి పలు అంశాలపై పరిశోధనాత్మక కథనాలు రాస్తున్న ఓ ప్యాషనేట్ జర్నలిస్ట్. ఇంత పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియాను కాదని.. రిపోర్టర్స్ కలెక్టివ్ ట్రస్టీగా వ్యవహరిస్తున్న నితీన్ సేథీని న్యావీ రిటైర్డ్ అధికారి బాత్రా ఎంచుకున్నాడంటేనే.. ఇక్కడ క్రెడిబిలిటీ ఎవరికుందనేది మళ్లీ చెప్పుకోవాల్సిన అవసరం లేని మాట.
బాత్రా ఇచ్చిన ఆధారాలతో.. సేథీ తయారు చేసిన కథనాలే… ఆ తర్వాత భారత్ లో ఎలక్ట్రోరల్ బాండ్స్ వివాదంగా దుమ్మురేపాయి. ఎలక్ట్రోరల్ బాండ్స్ అనే వివాదాస్పద పథకాన్ని అమలు చేయడంలో.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన సలహాలను ఎలా పట్టించుకోలేదు, ఎన్నికలకు ముందు బాండ్లను ఎలా అక్రమంగా విక్రయించారు అనే పలు ప్రభుత్వ తప్పిదాలను వివరించేలా ఏకంగా ఆరు భాగాల సీరిస్ నే తయారుచేశాడు సేథీ. ఈ పరిశోధనాత్మక కథనాలన్నీ.. మొదట హఫ్ఫింగ్టన్ పోస్ట్ ఇండియాలోనే ప్రచురితమయ్యాయి. ఆ తర్వాత చాలా వెబ్ సైట్స్ కూడా.. సేథీ నాయకత్వం వహిస్తున్న రిపోర్టర్స్ కలెక్టివ్ ద్వారా ఈ విషయాలను బహిర్గతం చేశాయి.
2024 ఫిబ్రవరిలోనే ఎలక్ట్రోరల్ బాండ్స్ కు సంబంధించి సుప్రీం కోర్ట్ ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ప్రభుత్వంపై మొట్టికాయలు వేసింది. ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో వచ్చిన విరాళాలు.. ఇచ్చిన దాతల పేర్లతో సహా వెల్లడించాలని ఎస్బీఐకి ఆదేశించింది. కానీ, ఏ పెద్ద వార్తా పత్రికగానీ, టీవీ ఛానల్ గానీ… ఈ విషయాన్ని అంత సీరియస్ గా పరిగణించలేదు.
కొందరు ప్యాషనేట్ జర్నలిస్టుల సమూహంగా మారిన రిపోర్టర్స్ కలెక్టివ్ వంటి సంస్థలు మాత్రమే.. కంపెనీలు తమకు వచ్చిన లాభాల కంటే పెద్ద మొత్తాలను కూడా ఎలా ఇవ్వగల్గుతున్నాయి.. వాటి వెనుక ఏం జరిగుంటుందనే వార్తలను వెలికి తీశారు. సుమారు అలాంటి డజన్ కు పైగా కథనాలు దేశంలో చర్చనీయాంశంగా మారాయి. అందులో కేంద్రంతో సన్నిహితంగా ఉండే బడా పారిశ్రామిక వేత్తలెవరెవరో కూడా పట్టి చూపే కథనాలను ప్రచురించాయి. కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాకు అంత పరిశోధన చేసే ఓపికా లేదు.. న్యూస్ రూమ్స్ లో ఉండేవారికి అంతకన్నా అవగాహనా ఉండదు.. వీడియోకు, సబ్జెక్టుకు అంతకన్నా సంబంధముండదు… ఆధారాల పట్టుకునే సాధనా సంపత్తిని పట్టించుకోదు.. దొరికినా వాటిని జనానికర్థమయ్యే రీతిలో ప్రెజెంట్ చేసే పరిస్థితి అంతకన్నా ఉండదు. దీంతో.. చాలా గొప్పవని చెప్పుకునే చాలా ప్రింట్ మీడియా.. మరోవైపు ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు.. ఇండిపెండెంట్ జర్నలిజం ముందు నానాటికీ తీసికట్టుగా మారిపోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వసనీయతనే కోల్పోతున్నాయి.
మన దేశంలో వివిధ భాషల్లో కలిపి సుమారు 21 వేల నమోదిత వార్తాపత్రికలున్నట్టు ఓ అంచనా. అలాగే దాదాపు 400 వార్తా ఛానెల్స్ ఉన్నాయట. కానీ, డిజిటల్ మీడియాతో మాత్రం ఇవేవీ ఇప్పుడు పోటీ పడలేకపోతుండటం.. మెయిన్ స్ట్రీమ్ దిగుజారుడుతనానికి.. ఒత్తిడితో ముందరి కాళ్లకు బంధం వేసుకున్న ఇజానికి నిదర్శనం. అంతేకాదు.. స్వేచ్ఛకు ప్రతీకగా మెదలాల్సిన మీడియా ఈవిధంగా చేవగారిపోవడం విషాదం కూడాను. ది రిపోర్టర్స్ కలెక్టివ్, న్యూస్‌లాండ్రీ, స్క్రోల్, ది క్వింట్, ది న్యూస్ మినిట్ వంటి పలు వెబ్సైట్స్ ఓసారి పరిశీలిస్తే… మిగిలిన మెయిన్ స్ట్రీమ్ మీడియాతో కంపేర్ చేస్తే… వ్యత్యాసం ఉట్టిగానే స్పష్టమవుతుంది.
కమర్షియల్స్, అడ్వర్టైజ్ మెంట్స్ అవసరం ఎప్పుడైతే మీడియా సంస్థలకు వచ్చిందో.. ఉద్యోగస్థుల జీతాలు కూడా వెళ్లని పరిస్థితెప్పుడైతే ఎదురైందో.. అప్పటినుంచీ అవి దారి తప్పాయి. ముఖ్యంగా చైనా, ఉత్తర కొరియా వంటి నియంతృత్వ దేశాల్లో ప్రభుత్వ ఆధీనంలో ఉండే విధంగా.. ఒకనాడు స్వేచ్ఛకు ప్రతిబింబంగా నిల్చిన ఇండియన్ మీడియా.. ఇప్పుడు ప్రభుత్వాల నుంచి వచ్చే జాకెట్ యాడ్స్ కోసమో.. లేక, వాటి లైసెన్సుల పునరుద్ధరణ కోసమో.. ప్రభుత్వాల ముందు సాగిలపడుతున్నాయి. అలాంటి ఫ్రేమ్ వర్క్ ను ఒంటపట్టించుకోలేనివారు, జీర్ణించుకోలేనివారు, విభేదిస్తున్నవారు.. ప్యాషనేట్ ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. అలాంటివారి నేతృత్వంలో నడుస్తున్న డిజిటల్ మీడియానే.. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ పై తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోందనడానికి ఈ మధ్యకాలంలో వచ్చిన బోలెడన్ని పరిశోధనాత్మక కథనాలు సోదాహరణలు.
స్వతంత్ర జర్నలిస్టుల నేతృత్వంలో కొనసాగుతున్న ఓ మూడు వెబ్సైట్స్ ఐకమత్యంగా చేతులు కలిపి.. ఔషధ నాణ్యత పరీక్షల్లో విఫలమై మూసివేతకు సగటు దూరంలో ఉన్న ఏడు ఫార్మా కంపెనీలు.. ఎలక్ట్రోరల్ బాండ్లను ఎప్పుడు కొనుగోలు చేశాయి.. అవి అలా కొనుగోలు చేయడం వెనుక ఎవరి హస్తముంది.. ఎవరి ఒత్తిడుంది… ఏకంగా ఓ గ్రూప్ 600 కోట్ల రూపాయల బాండ్లను ఎలా కొనుగోలు చేసిందనే పలు పరిశోధనాత్మక అంశాలను పబ్లిక్ డొమైన్ లో పోస్ట్ చేశాయి.
అయితే, సామదానదండోపాయాలన్నట్టు… అధికారంలో ఉన్న పార్టీలు.. తాము అధికారంలోకొస్తే తర్వాత ఇబ్బందని సున్నితంగా బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడే పార్టీలన్నీ… విరాళాలను వ్యక్తులు, కార్పోరేట్ సంస్థలు, ఇతర పరిశ్రమలు, కంపెనీల నుంచి ఊహించని మొత్తంలో పొందుతున్నాయి. అయితే, దానికే చట్టపరిధి అనే ముసుగు వేస్తూ దందా సాగిస్తున్నాయనేదే ఇప్పుడు పలు కథనాల్లో జరుగుతున్న చర్చ. విషయాన్ని సంగ్రహించి పార్టీలకు విరాళాలివ్వాల్సిందే. లేదంటే అధికారంలో ఉన్న పార్టీల నుంచైతే.. వారి చేతుల్లో చట్టుబండలైన చట్టసంస్థలను వాడుకుంటూ రైడింగ్స్ చేయిస్తూ నానా ఇబ్బందులు తప్పవు. అలా బీజేపీతో పాటు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి పలు పార్టీలు ఎలా పెద్ద మొత్తంలో విరాళాలనందుకున్నాయనేది ఎలక్ట్రోరల్ బాండ్స్ కథనాల్లో చూసిందే. దాడులు కూడా వ్యూహాత్మకంగా ఉంటాయి. తమ విరాళాలు పెంచడం లేదనుకున్న సమయంలో కూడా అధికారపార్టీలు చట్టుబండలనెలా వినియోగిస్తాయో కూడా ఈ పరిశోధనాత్మక కథనాల్లో వెల్లడయ్యాయి.
మరోవైపు రాజకీయపార్టీల చేతుల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా బందీ అవ్వడం.. మరోవైపు సోషల్ మీడియా ఉధృతమవ్వడం.. ఇలా రెండూ సమాంతర పరిణామాలు చూస్తున్న క్రమంలో.. సోషల్ మీడియానూ తమ ఆధీనంలోకి కొన్ని ప్రముఖ పార్టీలు ఎలా తెచ్చుకునే యత్నం చేస్తున్నాయో కూడా… ఇండిపెండెంట్ జర్నలిస్టులే బయట పెడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను తమకనుకూలంగా ఉపయోగించే విధానాలపై.. డీప్ ఫేక్, వాయిస్ క్లోనింగ్, ఫేస్ స్వాప్ వంటివాటిని వాడుకునే పద్ధతులపై ఎలా తమ సాంకేతిక నిపుణులను వాడుకుని.. అందుకెంతగా ఖర్చు పెడుతున్నాయో కూడా బయటకు తెచ్చే ప్రయత్నాన్ని ఇవాళ ఇండిపెండెంట్ మీడియానే పెద్ద ఎత్తున చేస్తోందంటే అతిశయోక్తి కాదు.
ఇక కొన్ని సంస్థలైతే.. ప్రత్యేకంగా ఎస్సీ నియోజకవర్గాలపై దృష్టి సారిస్తున్నాయి. అక్కడ గత ప్రభుత్వ హయాంలో ఎన్ని నిధులు ఖర్చు చేయాల్సి ఉండె.. ఎలాంటి పథకాలు అమలు కావల్సి ఉండె.. ఏ పథకాలు అమలైనై… అక్కడ గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న పరిస్థితికి.. అక్కడ అధికారంలో ఉన్న ప్రస్తుత నాయకుడు వచ్చాక జరిగిన మార్పుకు తేడాలెలా ఉన్నాయనే అంశాలనూ తేటతెల్లం చేస్తున్నాయి.
వీటన్నింటికీ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా దూరం జరిగితే… ప్రభుత్వ వందిమాగధుల నుంచి సోషల్ మీడియా వేదికగా ఎదుర్కొనే ట్రోలింగ్, పోలీస్ చర్యలు, పరువు నష్టం దావాలు, ఆదాయపు పన్ను తనిఖీల పేరిట దాడుల వంటివాటితో.. ఇండిపెండెంట్ మీడియాను కూడా గుప్పిట్లోకి తీసుకునే యత్నాలు స్వేచ్ఛాయుత స్వాతంత్ర్యానికి కేరాఫ్ అని చెప్పుకునే ఇండియాలో కనిపించడం రాబోయే రోజుల్లో నిర్బంధం, నియంతృత్వం ఇంకే స్థాయిలో ఉండబోతున్నాయో స్పష్టం చేస్తోంది.
అందుకే 2022 వరకే పత్రికా స్వేచ్ఛ విషయంలో ప్రపంచ దేశాల్లో భారత్ స్థానం ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ప్రకారం 150కి పడిపోగా.. గత ఏడాదికి అది మరింత ఎగబాకి.. 161కి పడిపోవడం.. ఇండియన్ మీడియా ప్రభుత్వ, కార్పోరేట్ గుత్తాధిపత్యంలోకి క్రమంగా ఎలా జారుకుంటుందో కళ్లకు కడుతోంది.
అయితే, మెయిన్ స్ట్రీమ్ తన క్రెడిబిలిటీని కోల్పోయిన నేపథ్యంలో.. విశ్వసనీయతకు కేరాఫ్ గా.. సవాళ్లను స్వీకరిస్తూ ఛాలెంజింగ్ గా పనిచేస్తున్న ఇండిపెండెంట్ జర్నలిజానికి ఇప్పుడు నైతికంగా, ఆర్థికంగా కూడా ప్రజా మద్దతు అవసరం కూడా కనిపిస్తోంది. ఇది కూడా ఇప్పుడు మన దేశంలో ఓ డిబేటేబుల్ ఇష్యూ అయ్యేవరకూ మార్పునాశించడం… మండుటెండల్లో కారుమబ్బుల జోరువాన కోసం ఆశించినట్టే!
Share this Article