ఏప్రిల్ 17… అది శ్రీరామనవమి పర్వదినం… సమయం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలు… ఆ తరుణం కోసం నిరీక్షణ ఇప్పుడు… మరో సంపూర్ణ సూర్యగ్రహణమా..? కాదు, సూర్యకిరణం… ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సూర్యతిలకం… అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడి నొసటన సూర్యుడే స్వయంగా ఓ తిలకం దిద్దే ముహూర్తం అది…
రఘుకుల తిలకుడు కదా… ఆ సూర్యకిరణాలు తిలకంగా భాసిల్లే ఆ 4 నిమిషాల దృశ్యం కోసం హిందూ సమాజం నిరీక్షిస్తున్నది అందుకే… ఐతే ఇదేమీ అబ్బురమో, ఖగోళ వింతో కాదు… దీనికి ప్రత్యేకంగా ఆధ్యాత్మికంగా ఏ పవిత్రతా లేదు… పర్వదినాల్లో దేవుళ్లకు ప్రత్యేక అలంకరణలు, ఆకర్షణలు ఉంటాయి కదా చాలా గుళ్లల్లో… ఇదీ అలాంటిదే… కాకపోతే ఈ విశిష్ఠ అలంకరణకు సైన్స్ సాయం తీసుకున్నారు ఆలయ నిర్మాతలు…
భారతీయ ఆలయ నిర్మాణం తాలూకు వాస్తు నైపుణ్యం ఎన్నో అబ్బురాల్ని, కాలపరీక్షకు నిలబడిన భారీ కట్టడాల్ని అందించిన సంగతి తెలిసిందే కదా… పైగా గర్భగుడిలోకి సూర్యకిరణ ప్రసారం అనేది కొన్ని జైన ఆలయాల్లో, కోణార్స్ గుడిలో ఉన్నదే… కానీ వాటి నిర్మాణాలు వేరు… మరి అయోధ్య మూడో అంతస్థుపైన ఉన్న శిఖరం నుంచి గర్భగుడిలోకి సూర్యకిరణాల ప్రసారం, పరివర్తనం ఎలా అనేదే ముఖ్యం…
Ads
అయోధ్య గుడి నిర్మాణ ప్రణాళిక సమయంలోనే ఇది ఆలోచించారు… రూర్కీలో సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఉంది… ఆ నిపుణులను సంప్రదించారు… వాళ్లు ఒక ఏర్పాటును సూచించారు… గుడికి సిమెంటు, స్టీల్ వాడలేదు కదా, అలాగే ఈ సూర్యతిలకం కోసం బ్యాటరీలు గానీ, విద్యుత్తు గానీ వాడకూడదని భావించారు…
శిఖరం నుంచి గర్భగుడి దాకా రెండు అద్దాలు, కొన్ని కటకాలు, ఇత్తడి మార్గాల నుంచి సూర్యకిరణ పరావర్తనం చెందుతాయి… సరిగ్గా ఆ సమయానికి బాలరాముడి నొసటన 45 మి.మీ అడ్డం, 75 మి.మీ నిలువుతో సూర్యకిరణాలు తిలకంగా వెలగాలి… అదే సంకల్పం… దానికోసమే భక్తగణం ప్రస్తుత నిరీక్షణ… ఇప్పటికే అక్కడ నవరాత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి… రామనవమికి ఈ విశేషం ఆవిష్కరింపబడాలనేది గుడి నిర్మాతల ఉద్దేశం…
ఇందులో డివైనిటీ ఏమీ లేదు, కేవలం సైన్స్‌తో దేవుడికి పండుగ సందర్భంగా చేసే ఓ అలంకరణ అంటున్నారు కదా, మరి రాబోయే రోజుల్లో ఇదీ పవిత్రతను సంతరించుకోదా అంటారా..? జరగొచ్చు… శబరిమలలో మకరజ్యోతి మనిషి చేసిన ఏర్పాటే అనిఅందరికీ తెలిసిందే కదా… ఐనా కోట్ల మంది నమ్మడం లేదా..? ఆ వేళకు జ్యోతిదర్శనం కోసం వెళ్లడం లేదా..? పవిత్రంగా భావించడం లేదా..? అదంతే, నమ్మకం… అసలు దేవుడంటేనే నమ్మకం కదా… రేప్పొద్దున సూర్యతిలక సందర్శనను కూడా భక్తజనం ఓ పవిత్రసందర్భంగా భావించే కాలమూ రావచ్చు… అదీ ఓ విశేష వీక్షణంగా పరిణమించవచ్చు..!!
వందల ఏళ్ల తరువాత… రాముడి జన్మస్థలి అన్ని బంధనాలనూ తెంచుకుని ప్రాణప్రతిష్ఠను పొందింది కదా… ఈసారి ఎన్నికల్లో రాముడి గుడి కూడా ఓ ప్రభావిత అంశమే కదా… మరి దేశమంతా ఇప్పటికే కాళ్లకు చక్రాలు కట్టుకుని ప్రచారపర్వంలో తిరుగుతున్న ప్రధాని సూర్యతిలక దర్శనం కోసం రానున్నాడా..? ప్రాణప్రతిష్ఠ జరిపిందీ ఆయనే కదా… పోనీ, ఉత్తరప్రదేశం ముఖ్యమంత్రి యోగి ఆ సమయానికి అక్కడ ప్రత్యక్షమై, సూర్యతిలకానికి మరింత ప్రచారం తీసుకురానున్నాడా..?
Share this Article