పేరున్న పత్రికే… పేరు ఎకనమిక్ టైమ్స్… మరి ఎందుకలా రాసింది..? తేదీ చూస్తే మొన్నటిదే… మరో నాలుగైదుసార్లు డౌట్‌తో పట్టిపట్టి చూసినా సరే ఏప్రిల్ 9 అనే కనిపిస్తోంది… శీర్షిక… These people will have to stay in 14 days quarantine if visiting Ayodhya Ram Temple during Ram Navami… ‘‘ఈ వ్యక్తులు రామ నవమి సందర్భంగా అయోధ్య రామ మందిరాన్ని సందర్శించడానికి వస్తే 14 రోజుల క్వారంటైన్‌లో ఉండవలసి ఉంటుంది…’’ ఇదీ అర్థం…
విదేశాల నుంచి వచ్చే యాత్రికులు 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందట… దానికి అన్ని ప్రత్యేక కోవిడ్ క్వారంటైన్లు సహా మిగతా ఏర్పాట్లు చేశారట లోకల్ వైద్యారోగ్య శాఖ అధికారులు… అదేమిటి..? ప్రపంచంలోని పలు దేశాల్లో మళ్లీ కరోనా ప్రబలుతోందా..? అదేమీ లేదే… మెడికల్ మాఫియా, వేక్సిన్ మాఫియా, మీడియా మాఫియా ఎంత ప్రయత్నించినా ఒమిక్రాన్ తరువాత కరోనా ఓ సాధారణ జలుబుగా మారిపోయిందిగా… మరీ తీవ్ర వ్యాధులున్నవారిని తప్ప కోవిడ్ ఎవరినీ ఏమీ చేయలేకపోతోంది కదా… మళ్లీ ఈ క్వారంటైన్ బాగోతం ఏమిటి..?
కోవిడ్ వరల్డోమీటర్ చూస్తే దాదాపు 90 శాతం దేశాల్లో జీరో కేసులు… వోకే, అన్ని దేశాల్లోనూ కోవిడ్ టెస్టులు ఆపేశారనే అనుకుందాం… అమెరికాలో ఈరోజుకూ ఫ్రీ టెస్టింగ్ కిట్స్ పంపిణీ చేస్తున్నారు… కొన్ని డెవలప్డ్ కేసుల్లో టెస్టులు, కేసులు, మరణాలు అన్నీ పక్కాగా నమోదు చేస్తారు కాబట్టి ఆ కొన్ని కేసులు కనిపిస్తున్నాయి… మన దేశం ఎప్పుడో వదిలేసింది ఆ వైరస్‌ను…
Ads
అయోధ్య జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్ ప్రకాష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, “సంభావ్య కోవిడ్-19 కేసుల కోసం సన్నాహకంగా, మేము జిల్లా ఆసుపత్రిలో నాలుగు ప్రత్యేక క్వారంటైన్ వార్డులను ఏర్పాటు చేసాము… ఏప్రిల్ 17 నాటి రామనవమి పర్వదినం కోసం ప్రత్యేకంగా విదేశాల నుంచి వచ్చే యాత్రికుల కోవిడ్ లక్షణాల పట్ల ఏమాత్రం అనుమానాలొచ్చినా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది…’’ అన్నాడు…
అసలు దేశంలో ఎక్కడా విదేశీ పర్యాటకుల మీద ఎలాంటి కోవిడ్ ఆంక్షలు లేవు ఇప్పుడు… గతంలో కోవిడ్ వేక్సినేషన్ ప్రూఫ్ అడిగేవాళ్లు టికెట్ల ఖరారుకు… ఇప్పుడు అవీ అడగడం లేదు… ఒకవేళ నిజంగానే విదేశాల్లో అక్కడక్కడా కోవిడ్ కేసులు మళ్లీ కనిపిస్తూ ఉంటే, ఒక్క అయోధ్య ఏమిటి..? మిగతా పర్యాటక ప్రాంతాల్లోనూ ఈ ఆంక్షలు స్టార్ట్ కావాలి కదా… ఎస్, రామనవమి (సూర్యతిలకం) పండక్కి అయోధ్యకు భక్తులు పోటెత్తుతారు నిజమే… కానీ తిరుమల, వారణాసి, పూరి వంటి పెద్ద ఆలయాలకూ భక్తులు రోజూ పోటెత్తుతూనే ఉన్నారు కదా… యోగీ సాబ్, ఏ క్యా హై జీ..!!
Share this Article