మైదాన్ సినిమా నచ్చింది… ఎందుకు నచ్చింది..? మన హైదరాబాదీ అన్‌సంగ్ ఫుట్‌బాల్ ప్లేయర్ కమ్ కోచ్ రహీం బయోపిక్ కాబట్టా..? కాదు..! మనకు క్రికెట్ తప్ప మరే ఆటా పట్టదు, అదొక పిచ్చి… కొద్దిగా టెన్నిస్, అంతే… అప్పుడప్పుడూ జావెలిన్ హీరోలు, బాక్సర్లు, అథ్లెట్లు, వెయిట్ లిఫ్టర్లు మెరుస్తున్నా సరే… మగ క్రికెట్ తప్ప మనకు మరేమీ పట్టదు…
పైగా ఆయన ఫుట్ బాల్ కోచ్… కాస్తోకూస్తో మనలో హాకీ ఉంది తప్ప ఫుట్ బాల్ తక్కువ… పైగా ఒకప్పటి కథానేపథ్యం… అక్కడక్కడా బెంగాల్, కేరళల్లో కొద్దిగా ఉంది తప్ప… క్రికెట్‌తో పోలిస్తే చాలా డ్రై సబ్జెక్టు ఇండియాలో… అలాంటిది సినిమా చివరి అరగంటపాటు ఆట తెలియని మనమే ఫీల్డ్‌లో దిగి ఆడుతున్నామేమో, ఓ పెద్ద స్టేడియంలో కిక్కిరిసన జనసందోహంలో ఆట చూస్తున్నామేమో అన్నట్టుగా ప్రజెంట్ చేశాడు దర్శకుడు అమిత్ శర్మ… అందుకని నచ్చింది…
ఏదో స్పోర్ట్స్‌మన్ బయోపిక్ అనగానే ఒక ధోనీ, ఒక సచిన్ బయోపిక్కుల్లా నిస్సారంగా తీసి జనం మీదకు వదిలేయలేదు, తొక్కలో తెలుగు సినిమా ఇమేజీ బిల్డప్ సినిమాల్లా..! మైదాన్‌లో అవమానాలున్నయ్, పరాజయాలున్నయ్, అంతులేని డిప్రెషన్ ఉంది, కబళిస్తున్న కేన్సర్ ఉంది, బతుకంతా కన్నీళ్లున్నయ్… ఐనాసరే, అండగా నిలబడి మోటివేట్ చేసిన అర్థాంగి ఉంది… రిస్క్ ఉంది, తనలో సాధించాలన్న కసి ఉంది, టీమ్ వర్క్ దిశలో టీమ్ ప్రిపేర్ చేసిన నైపుణ్యముంది… వాట్ నాట్… అందుకే ఈ బయోపిక్ నచ్చింది…
Ads
దర్శకుడు పెద్ద పేరున్నవాడేమీ కాదు… కానీ తన ముద్ర వేయగలిగాడు… మంచి సాధన ఉంటే తప్ప ఇలాంటి ప్రజెంటేషన్ సాధ్యం కాదు… అందులోనూ అజయ్ దేవగణ్, ప్రియమణి వంటి వెటరన్స్‌తో..! అజయ్ పెద్ద హీరోయే గానీ… నచ్చితే చిన్న చిన్న పాత్రలకూ సై అంటాడు… ఆర్ఆర్ఆర్ కావచ్చు, గంగూభాయ్ కావచ్చు… దృశ్యం, సింగం సహా బోలెడు సీక్వెల్స్… భుజ్ వంటి నిజకథలు కూడా… మిగతా సినిమాల్లో నటన మాటేమిటో గానీ ఈ మైదాన్‌లో రహీం పాత్రలోకి అచ్చంగా ఒదిగిపోయాడు… అందుకే సినిమా నచ్చింది…
ప్రియమణి… ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చింది, స్టార్ హీరోయిన్ ఒకప్పుడు… తరువాత పెళ్లయింది… కొన్నాళ్లు గ్రహణం… నలభై ఏళ్లొచ్చినయ్ ఇక అంతే సంగతులు అనుకున్నారంతా… కానీ ఈమధ్య సెకండ్ ఇన్నింగ్స్ జోరుగా నడుస్తోంది… ప్రియమణి ఇప్పుడు ఏవో బతుకుతెరువు కోసం జడ్జిగా టీవీషోల్లో కనిపించేది సెలబ్రిటీ కాదు… మంచి మంచి సినిమాలు వస్తున్నయ్… వెబ్ సీరీస్ సరేసరి… బహుశా ఇప్పుడే తన ప్రొఫెషన్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుంది… రహీం భార్య సైరా పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది… అందుకే నచ్చింది సినిమా…
టెక్నికల్ స్టాండర్డ్స్, మేకింగ్ స్టాండర్డ్స్, సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ గట్రా అన్నీ సమపాళ్లలో నప్పాయి…
Share this Article