మొన్నొక వార్త కనిపించింది… ఆడుజీవితంలో అనితరసాధ్యంగా నటించిన పృథ్వీరాజ్ బడేమియా చోటేమియా అనే హిందీ సినిమాలో కీలక రోల్ పోషించాడు… కానీ తన ఒరిజినల్ ఇండస్ట్రీ మలయాళం కదా, అక్కడ ఆన్‌లైన్ బుకింగులో ఒక్క టికెట్టూ అమ్ముడుపోలేదనేది వార్త… మన నందమూరి చైతన్య గుర్తొచ్చాడు…
అవును, తీస్తే గిస్తే మన సౌత్ వాళ్లే పాన్ ఇండియా తీయాలి, హిందీ వాళ్లు చూడాలి, అవసరమైతే హిందీ వాళ్లను కూడా సినిమాలోకి తీసుకోవాలి, పాన్ ఇండియా కవరింగు కోసం, కలరింగు కోసం… హిందీ వాడు మనవాళ్లను కూడా అదే అవసరం కోసం తీసుకున్నా సరే, మనం చూడం, పెద్దగా పట్టించుకోం, మరీ తెలుగు ప్రేక్షకులు కాస్త నయం, కన్నడ, తమిళ, మలయాళ ప్రేక్షకులయితే అస్సలు దేకరు…
ఆమధ్య వెంకటేష్ కూడా ఏదో హిందీ సినిమాలో గెస్టుకు ఎక్కువ, కేరక్టర్‌కు తక్కువ రోల్ ఏదో చేశాడు… మన తెలుగువాళ్లే ఎవరూ పెద్దగా దేకలేదు… అందులో బతుకమ్మ పాటను, ఆటను కూడా చిల్లరగా చిత్రించారు… సరే, దాన్నలా వదిలేస్తే ఆ సినిమా ఎలా ఉంది..?
Ads
అక్షయకుమార్ ఏటా పదీపన్నెండు సినిమాలు అలవోకగా తీసి పారేయగలడు… పైగా దేశభక్తి సినిమాలైతే మరింత వేగంగా… ఇప్పుడు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ బాపతు సినిమాలు ఎక్కువ ట్రెండ్ కదా… బడేమియా చోటేమియా అని ఒకటి అర్జెంటుగా తీశాడు, అందులో పృథ్విరాజ్ కూడా ఉన్నాడు… సోనాక్షి సిన్హా ఉంది, అందగత్తె కిరీటధారిణి మానుషి చిల్లర్ ఉంది… టైగర్ ష్రాఫ్ కూడా ఉన్నాడు… టెక్నీషియన్స్ కూడా అతిరథులు… కానీ ఏం లాభం..? రథం కుంగిపోయింది…
అదేమిటో గానీ… మన సినిమాల్లో ఆర్మీ వాళ్లు గానీ, రా గూఢచారులు గానీ, లాయర్లు గానీ… తమ ప్రవర్తనతో సర్వీసు నుంచి గెంటేయబడతారు… కానీ వాళ్ల అపార ప్రతిభాపాటవాల రీత్యా ఏదైనా క్లిష్టమైన, చాలెంజింగ్ టాస్క్ వస్తే వాళ్లను పిలిపిస్తారు మళ్లీ… వీళ్లు మొక్కవోని కర్తవ్యదీక్షతో రంగంలోకి దిగి సవాళ్లు స్వీకరించి, తెలుగు హీరోల్లాగే దుమ్మురేపేసి చివరకు కాలర్లు ఎగరేస్తారు… ఈ సినిమా కూడా అంతే…
హార్ష్‌గా చెప్పాలంటే… ఈ సినిమా చూసే బదులు ఏదైనా పాత మధుబాబు షాడో నవల చదువుకోవడం ఉత్తమం… 350 కోట్ల ఈ భారీ సినిమాలో భారీ యాక్షన్ సీన్లు తప్ప ఏమున్నాయని..? ట్యాంకులు, గన్నులు, హెలికాప్టర్లు… వాట్ నాట్…? కానీ దిక్కుమాలిన కథ, అంతకన్నా తలకుమాసిన కథనం… నిజానికి మలయాళ పృథ్వీరాజ్‌ను కూడా సరిగ్గా వాడుకోలేదు… ఎలాగూ సగం సేపు ముసుగే కదా, విఠలాచార్య సినిమాల్లోలాగే మొత్తం అలాగే లాగిస్తే పృథ్వీరాజ్ పారితోషికమైనా మిగిలేది…
అర్జెంటుగా అక్షయకుమార్ తన సినిమాల్ని లోతుగా మథించుకోవడం అవసరం… లేకపోతే ఇక ఇలా వస్తాయి, అలా పోతాయి… తను చివరకు మళ్లీ కెనడా వెళ్లిపోవాలి… కాకపోతే ఒకటి చెప్పుకోవాలి… మగ, ఆడ తారల నడుమ పెద్ద కెమిస్ట్రీకి చాన్స్ లేదు గానీ, అక్షయ్, ష్రాఫ్ నడుమ కెమిస్ట్రీ బాగా కుదిరింది… వాళ్ల చెణుకులు, సరదా వ్యంగ్య బాణాలు మాత్రమే ఈ సినిమాలో కాస్త రిలీఫ్..!
Share this Article