మంచు కుటుంబం మాటలే కాదు, చేతలు కూడా పలుసార్లు ఆశ్చర్యంగా ఉంటాయి… మన అంచనాలకు, విశ్లేషణలకు కూడా అందవు… ఆమధ్య మోహన్‌బాబు తీసిన సన్నాఫ్ ఇండియాలో నటీనటుల్ని వాడుకున్న తీరు ఈరోజుకూ అబ్బురమే… అందుకే కొడుకు హీరోగా తీస్తున్న 100 కోట్ల కన్నప్ప సినిమా వార్తలు కూడా ఒకింత విస్మయకరంగానే ఉంటున్నాయి…
కృష్ణంరాజు కథానాయకుడిగా బాపు అప్పట్లో తీసిన భక్తకన్నప్ప ఓ క్లాసిక్… ప్రత్యేకించి అందులో పాటలు, మరీ ప్రత్యేకించి వేటూరి రాసిన కిరాతార్జునీయం ఎప్పుడూ మరిచిపోలేనిది… ఆకాశం దించాలా, కండ గెలిచింది, శివశివ అననేలరా, ఎన్నీయల్లో ఎన్నీయల్లో… ఈరోజుకూ హిట్… ఓ ఆదివాసీ యువకుడు శివుడికి అత్యంత వీరభక్తుడిగా మారి, తన కళ్లను కూడా శివలింగానికి అమర్చి, తన భక్తిని నిరూపించుకుని, తరువాత శివుడిలో ఐక్యం కావడం అనేది కథ…
కానీ దాన్నే స్ట్రెయిట్‌గా చెబితే ఎవరు చూస్తారని అనుకున్నారేమో… మొదట్లో నాస్తికుడిగా చూపి, ఓ నకిలీ బాబాను కథలోకి లాక్కొచ్చి, గూడెంలో కథానాయకుడి హీరోయిజాన్ని ప్రొజెక్ట్ చేసి, భార్యతో రొమాన్స్, పాటలు గట్రా పెట్టి… చాలా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్టున్నారు… కానీ వాణిశ్రీ, కృష్ణంరాజు, రావుగోపాలరావు తదితరుల నటన, పాటలు, బాపు దర్శకత్వం సినిమాను నిలబెట్టాయి… ఇది పాత కథ…
Ads
ఇప్పుడు కన్నప్ప తీస్తున్నది మంచు విష్ణు… 1976 నాటిది ఆ పాత సినిమా… ఇప్పుడేమో మంచువారు 100 కోట్లతో పాన్ ఇండియా సినిమా తీస్తున్నారాయె… కథ మాత్రం తిన్నడిదే కదా… మార్చలేరు… పాన్ ఇండియా సినిమా అంటే ఇతర భాషల ప్రముఖులను కూడా సినిమాలోకి తీసుకుంటే గానీ ఆ కలరింగ్ రాదు, బిజినెస్ జరగదు, ఆయా భాషల ప్రేక్షకులను ఆకర్షించలేం అనే ఓ భ్రమ మన ఇండస్ట్రీలో ఉన్నదే కదా… పైగా ఇది ప్రిస్టేజియస్ ప్రాజెక్టాయె.,. విష్ణుకు చాన్నాళ్లుగా ఓ హిట్ లేదాయె…
సో, ఇతర భాషల నుంచి ప్రముఖ నటీనటులను చేరుస్తున్నారు… ఆ పాత కన్నప్ప వారసుడు ప్రభాస్ ఏకంగా శివుడి పాత్రకు రావడం ఓ విశేషమే… లుక్కు కూడా బాగుంది… ప్రభాస్ పాపులారిటీ సినిమాకు యూజ్‌ఫుల్లే… ఇక కేరళ ప్రేక్షకుల కోసం అక్కడి సూపర్ స్టార్ మోహన్‌లాల్, తమిళ ప్రేక్షకుల కోసం శరత్ కుమార్, హిందీ ప్రేక్షకుల కోసం అక్షయ్ కుమార్, కన్నడ ప్రేక్షకుల కోసం శివరాజకుమార్ కనిపిస్తారట… మోహన్‌బాబుకు రజినీకాంత్ ఇష్టుడైన స్నేహితుడే కదా, తననూ తీసుకొస్తే మరింత స్టార్ అట్రాక్షన్ ఉండేది…
ఇప్పుడైతే ఏకంగా నయనతారు పేరు, అనుష్క పేరు, వెటరన్ తార మధుబాల పేరు కూడా వినిపిస్తున్నాయి… సరే, చివరాఖరికి ఎందరు తెరపై కనిపిస్తారనేది పక్కన పెడితే… నయనతార, అనుష్కలు కనిపించే సినిమాలో హీరోయిన్‌గా ప్రీతి ముకుందన్ వంటి ఓ సాదాసీదా నటి ఎంపిక ఏమిటనే ఆశ్చర్యం ఒకటి… (రీసెంట్ ఓం భీమ్ భుష్‌లో ఉంది కదా…) అన్నింటికీ మించి ఇంతమంది స్టార్లకు పాత్రలేవీ ఆ కథలో..?
అంటే… అప్పట్లో బాపు తీసుకున్న క్రియేటివ్ లిబర్టీకన్నా ఇంకా చాలా స్వేచ్ఛ తీసుకుని ఆ కథను జనరంజకమైన తెలుగు సినిమా కథగా మారుస్తున్నారన్నమాట… పాత సినిమాలో కృష్ణంరాజు, వాణిశ్రీ, రావుగోపాలరావు పాత్రలే మెయిన్… మరి ఈ కొత్త కన్నప్పలో ఇన్ని స్టార్లను ఏ పాత్రలకు అడ్జస్ట్ చేయనున్నారు..? ఓ కొత్త కథ రాస్తున్నారు, అందుకేగా పరుచూరి వంటి కథకుల్ని ఇన్వాల్వ్ చేసింది…
నిజానికి పాన్ ఇండియా సినిమా అంటే, ఇతర భాషల ప్రేక్షకుల్ని ఆకర్షించాలంటే ఆయా భాషల్లోని ప్రముఖులు అవసరం లేదు… అవి పలుసార్లు వర్కవుట్ కావు… కేజీఎఫ్, కాంతార సినిమాల్లో ప్యూర్ లోకల్ ఆర్టిస్టులే అందరూ, కానీ బాక్సాఫీసు దుమ్ము ఎలా దులిపాయి అవి… పుష్ప, కార్తికేయ, జైహనుమాన్ కూడా…!
మన దేశంలోనే బోలెడు షూటింగ్ స్పాట్స్, అడవులు ఉన్నాయి… మరి న్యూజిలాండ్ దాకా దేనికి వెళ్లారో అదీ అనూహ్యమే… సినిమాటోగ్రాఫర్‌గా షెల్డాన్, మ్యూజిక్ కోసం స్టీఫెన్‌ను ఎంచుకున్నారు… మన తెలుగు కథకు వాళ్లెలా న్యాయం చేస్తారో తెలియదు గానీ పాటలకు మణిశర్మ ఎంపిక కరెక్టే… చివరగా… ఇంతమంది స్టార్లకు నిజంగానే సరిపోయే పాత్రలు ఉంటాయా కథలో… లేక సన్నాఫ్ ఇండియాలో చాలామంది ఇలా కనిపించి అలా పోతారా..?!
.
Update :: ప్రభాస్ శివుడి పాత్ర కాదట, నంది రోల్… ఈమేరకు కథలో మార్పులు చేశారట… సినిమా కథ కదా, ఏమైనా చేసుకోవచ్చు…
Share this Article