కొన్నిసార్లు నోరు జారతాడు అనే అపప్రథ ఉంది రేవంత్ రెడ్డి మీద… ఆమధ్య దావోస్‌లో ఇంటర్వ్యూ సమయంలో తన మాటతీరు మీద కూడా కొన్ని విమర్శలు వచ్చాయి… కానీ తనకు ఓ క్రెడిట్ ఉంది… అలవోకగా, తడుముకోకుండా, తను చెప్పదలుచుకున్నది తన భాషలో, తన స్టయిల్‌లో సూటిగా చెప్పేస్తాడు… ఎదుటివాడు ఎవరైనా సరే,..
రాజకీయ ప్రత్యర్థిత్వం కావచ్చు, తనను జైలుపాలు చేశాడనే కోపం కావచ్చు, కడుపులో రగులుతున్న కసి కావచ్చు… రాజకీయంగా అవసరం కావచ్చు.., తనను భిన్నంగా, ప్రత్యర్థిపై పైచేయి అన్నట్టు ప్రదర్శించుకోవడం కోసం కావచ్చు… కేసీయార్ మీద రేవంత్ విసిరినన్ని చెణుకులు, విమర్శలు, ఆరోపణలు, తిట్లు గట్రా మరే ఇతర రాజకీయ నాయకుడికీ చేతకాలేదు… ఇదే కాంగ్రెస్ లో ఇంత పదునుగా కేసీయార్ మీద పరుషంగా దాడి చేసే మరో లీడర్ లేడు… కేసీయార్ భాషలోనే, కాస్త అంతకుమించి కూడా…
అంతెందుకు..? బీజేపీని ఇంత బదనాం చేస్తూ, బూతులు తిడుతూ, పార్టీ జాతీయ నాయకులను కూడా బజారుకు లాగుతూ, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వివరాల్ని అన్ని రాష్ట్రాల సీఎంలకు, పార్టీల నేతలకు, కోర్టులకు పంపించిన తెంపరితనం చూపించినా సరే… కేసీయార్ మీద ధాటిగా ఎదురుదాడి చేసే బీజేపీ నాయకుడంటూ లేకుండా పోయాడు… అలా ఘాటుగా, పదునుగా, కర్కశంగా… ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే అన్నట్గుగా ఉండే రేవంత్ మాటల ధోరణి రజత్ శర్మ ఇండియాటీవీలో నిర్వహించే ఆప్ కీ అదాలత్‌లో మాత్రం పూర్తి భిన్నంగా సాగింది…
Ads
ఇదేదో జాతీయ పాపులర్ టీవీ షో అన్నట్టుగా గాకుండా… బిగుసుకుపోయి, ఆచితూచి, పదాల్ని లెక్కపెట్టుకునే తరహా కాదు… హాయిగా స్నేహితులతో మాట్లాడుతున్నట్టు, కులాసాగా మాట్లాడుతూ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాడు… పలుసార్లు తన మాటల తీరుకు చప్పట్లు పడ్డాయి… అఫ్ కోర్స్, బోనులో కూర్చున్న సెలబ్రిటీలు హాయిగా, రిలాక్స్‌డ్‌గా స్పందించేట్టుగా రజత్ శర్మ ప్రశ్నలడిగే విధానం ఉంటుంది…
రేవంత్ రెడ్డి కేసీయార్, రాజకీయాలకు సంబంధించి చేసిన కొన్ని వ్యాఖ్యలు…
- కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకోవడమెక్కడిది. అసలు ప్రారంభించనే లేదు.
- సింహం రావాలనే చూస్తున్నా. తుపాకీ సిద్ధంగా ఉంది. ఒక్క తూటా చాలు. పిల్లులు, కుక్కలను నేను కొట్టను. కొడితే సింహాన్నే కొడుతాను. ఎన్నికల్లో ఓడగొట్టి చూపించాను కదా.
- తప్పేముంది. పప్పు. దాల్.. అందులో ప్రోటీన్ ఉంటుంది. పోషకాహారం. మేం హెరాయిన్, గాంజా లాంటి మాదక ద్రవ్యాలు కాదు కదా.
- గత ప్రభుత్వానికి ఖాసీం రజ్వీగా పని చేసిన ఎస్ఐబీ చీఫ్ విదేశాలకు పారిపోయారు… అనుమతి తీసుకొని చట్ట బద్ధంగానే వాటిని ట్యాప్ చేసే వీలుంది. కానీ రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బంధువులు, భార్యాభర్తల ఫోన్లను కూడా వదల్లేదు.
- మోదీ నేతృత్వంలోని బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు రావాలంటే ఒక్క భారతదేశంలో పోటీ చేస్తే సరిపోదు. పాకిస్తాన్‌లో కూడా ఆ పార్టీ పోటీ చేయాలి…
ఇవేకాదు, మరికొన్ని ఆఫ్ బీట్ ప్రశ్నలకూ అంతే సరదాగా జవాబులు చెప్పుకొచ్చాడు… దర్శకుడు, రచయిత, నిర్మాత Prabhakar Jaini పోస్టులో కనిపించిన మరికొన్ని ఉదాహరణలు…
హిందీ వచ్చినవాళ్లు ఈ షోను బాగా ఆస్వాదించగలరు…
Share this Article