ఆసక్తికరమైన ప్రశ్నే… కవితను ఈడీ, సీబీఐలు అరెస్టు చేసి, ఏకంగా తీహార్ జైలుపాలు చేసినా సరే… ఈరోజుకూ ఆమెను కేసీయార్ పరామర్శించలేదు… అరెస్టు దగ్గర్నుంచి ఈరోజు వరకూ కేటీయార్, హరీష్, ఆమె భర్త, లాయర్ తదితరులు తప్ప కేసీయార్ మాత్రం తెర మీద కనిపించడం లేదు… ప్రచార సభల్లో కూడా కవిత అరెస్టు, కేసుల గురించి ప్రస్తావించడం లేదు…
ఆమె బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురవుతున్నాయి… అసలే ఈడీ కేసు సీరియస్… పైగా సీబీఐ ఎంటరైంది… రెండు కేసుల్లోనూ బెయిల్ వస్తే తప్ప బయటికి రాలేదు కవిత… ఢిల్లీ మద్యం కేసును కేంద్రం గట్టిగా బిగించి ఉంది… సీఎం కేజ్రీవాల్, తన ఇద్దరు మంత్రులు, నాయకులు సహా చాలామందిని గట్టిగా బుక్ చేసింది…
బిడ్డ కదా, ఈ స్థితిలో ఏ తండ్రి అయినా సరే, బిడ్డకు ధైర్యం చెబుతాడు కదా, మరెందుకు కేసీయార్ ఇంతగా దూరంగా ఉంటున్నాడు..? ఇదీ ప్రశ్న..! దీనిపైనా రకరకాల వెర్షన్లు వినిపిస్తుంటాయి, నిజానిజాలు తెలియవు… ఆమెకు పొలిటికల్ యాస్పిరేషన్స్ ఎక్కువట… జాగృతి యాక్టివిటీ కూడా కేసీయార్‌కు ఇష్టం లేదంటారు… తన రాజకీయ వారసుడు కేటీయార్ మాత్రమే అని ఒకటికిపదిసార్లు స్పష్టంగా చెప్పాడు కేసీయార్…
Ads
పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంటును చేశాడు… ఒక్క ముక్కలో చెప్పాలంటే చాన్నాళ్లుగా కేటీయార్ యాక్టింగ్ సీఎం… (మొన్న అధికారం పోయేవరకు…) మద్యం కేసు ఎటుపోయి ఎటు దారితీస్తుందోనని కేసీయార్‌కు మొదటి నుంచీ ఆందోళన, సందేహం ఉన్నయ్… కానీ చాలా గుండె ధైర్యమున్నోడు… బీజేపీకి తన అవసరం కలిగేలా పరిస్థితులు క్రియేట్ చేసి, ఎలాగోలా బిడ్డను తప్పించాలని ప్రయత్నించాడు… ఎమ్మెల్యేల కొనుగోలు ప్రహసనం, దేశమంతా ఆ కేసు వీడియోలు పంపించి గాయిగత్తర చేయడానికి ప్రయత్నించడం, కేసు నమోదు, బీజేపీ జాతీయ కార్యదర్శినీ బుక్ చేయడంతో పాటు సీబీఐకి తెలంగాణలో నో ఎంట్రీ అని ఉత్తర్వులు జారీ చేశాడు కూడా…
అఫ్ కోర్స్, బీజేపీ తనను కూడా టార్గెట్ చేస్తుందనే సందేహం కూడా దానికి ఓ కారణం కావచ్చు… బీఆర్ఎస్‌గా పార్టీ పేరు మార్పు, పలు రాష్ట్రాల్లోకి విస్తరించే ప్రణాళికలు, ఖర్చులు కూడా… తన బలాన్ని పెంచుకుని, తన అవసరం బీజేపీకి లేదా కాంగ్రెస్‌కు తప్పనిసరి అయ్యేలా ఆలోచన… అవన్నీ ఎదురు తన్నడమే కాదు, ఏకంగా తెలంగాణలో పునాదులే కదిలిపోయాయి, బీజేపీ కూడా మసకబారిన కేసీయార్ ఆదరణను చూసి, ఇన్నాళ్లూ కవిత అరెస్టు పట్ల మీనమేసాలు లెక్కించి, తీరా అసెంబ్లీ ఫలితాల తరువాత సీరియస్ యాక్షన్‌లోకి దిగిపోయింది…
రాజకీయ వారసత్వం విషయానికి వస్తే… రెండోసారి అధికారంలోకి వచ్చాక హరీష్‌రావును చాన్నాళ్లు దూరం పెట్టాడు కేసీయార్… ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నుంచి తప్పుకోమన్నాడు… అదేసమయంలో జాగృతి కమిటీలన్నీ రద్దయ్యాయి… సింగరేణి బొగ్గు కార్మిక సంఘం బాధ్యతల నుంచీ తప్పుకోమన్నాడు కవితను… రీసెంటుగా మళ్లీ జాగృతి కమిటీలన్నీ రద్దు చేశారు… అలా కవిత యాక్టివిటీస్‌ను ఎక్కడికక్కడ నియంత్రించడానికి కేసీయార్ ప్రయత్నించాడట…
చివరకు తన ఫోన్ ట్యాపింగులో కవిత భర్త అనిత్, ఎల్లప్పుడూ తన వెంటనే ఉండే సంతోష్ భార్య రోహిణిల ఫోన్లనూ ట్యాప్ చేయించాడట కేసీయార్… ఆమే స్వయంగా కొందరు మీడియా మిత్రులతో దీన్ని షేర్ చేసుకున్నట్టు సమాచారం… ఐనా సరే, బిడ్డ బిడ్డే కదా… కనీసం పరామర్శించి, నేనున్నానులే అనే భరోసా ఇవ్వాలి కదా అంటారా..? బయటికి తను కనిపించకపోయినా బెయిల్ ప్రయత్నాలు, లాయర్లతో మాట్లాడటం వంటివి కేసీయారే చూస్తున్నాడంటారు…
ఒక దశలో బీజేపీనే వంగదీసే ప్రయత్నాలు చేసి, భంగపడి, తరువాత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పూర్దిగా డీలాపడిపోయి, తప్పనిసరై బీజేపీతో సయోధ్య కోసం నానా ప్రయత్నాలూ చేసి, అవీ ఫలించక, బిడ్డ కూడా అరెస్టయిన దశలో బాగా డిమోరల్ అయ్యాడు… కానీ పోరాటం అలవాటైపోయింది కదా… ఇటు రేవంత్‌తో, అటు మోడీతో అనివార్యంగా పోరాటం తప్పడం లేదు… ఇటు పార్టీ నుంచి వలసల్ని ఆపుకోవాలి, మరోవైపు కేడర్ కాపాడుకోవాలి… తన అసలు యాక్షన్ స్టార్ట్ కాలేదంటున్నాడు రేవంత్… ఫోన్ ట్యాపింగ్‌లో నేరుగా కేసీయార్‌ను పకడ్బందీగా బుక్ చేయాలని చూస్తున్నట్టుంది… నిజంగానే కేసీయార్‌కు పరీక్షాకాలం..!!
Share this Article