సాక్షి సైటులో ఎడ్యుకేషన్ విభాగంలో… సక్సెస్ స్టోరీల కింద ఈ కథనం కనిపిస్తే ముందుగా నవ్వొచ్చింది… ఆలోచిస్తే, చిస్తే నిజమే కదానిపించింది… ఎడ్యుకేషన్‌కు సంబంధం లేకపోవచ్చు, రోజూ మనం చదువుకునే రొటీన్ సక్సెస్ స్టోరీల జాబితాలోకి కూడా రాకపోవచ్చు… కానీ నిజానికి అదెలా సక్సెస్ అంటే..?
ముందుగా సంక్షిప్తంగా ఆ వార్త చదువుదాం… గుజరాతీ కుటుంబం… సబర్‌కాంత్ జిల్లాలోని హిమ్మత్‌నగర్‌కు చెందిన వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యం… బోలెడంత పలుకుబడి, డబ్బు తాలూకు వైభవం, సుఖాలు, సర్కిల్… కన్‌స్ట్రక్షన్ బిజినెస్‌లో ఉన్న భావేష్ భండారి మొదట్లో చిన్న పెట్టుబడితోనే వ్యాపారం ప్రారంభించాడు…
సంపద సమకూరింది, ఆదాయం పెరిగింది… జైన కుటుంబం… 19 ఏళ్ల బిడ్డ, 16 ఏళ్ల కొడుకు 2022లోనే అన్నీ విడిచిపెట్టి మతం చెప్పిన సన్యాస దీక్ష తీసుకుని, అన్ని బంధాలనూ తెంచుకున్నారు… పిల్లలు చూపిన బాటలోనే, ఆ ప్రేరణతోనే భావేష్ దంపతులు కూడా నడవాలని నిర్ణయించుకున్నారు… మొత్తం 200 కోట్ల ఆస్తులను దానం చేసేశారు…
Ads
ఏప్రిల్ 22న మరో 35 మందితో ఓ ఆధ్యాత్మిక యాత్ర నాలుగు కిలోమీటర్ల మేర సాగుతుంది… ఆ తరువాత తెల్లటి వస్త్రాలు ధరించి, అన్ని భౌతిక అనుబంధాల్ని తెంచుకుని, ఓ భిక్ష పాత్ర తీసుకుని ప్రపంచ యాత్ర సాగిస్తారు, అదీ చెప్పులు కూడా లేని పాదయాత్ర ద్వారా… లభించిన భిక్షే జీవనాధారం… ఇదీ వార్త…
ఈ మతం ఎప్పుడూ భిన్నంగా కనిపిస్తుంది… హింసను ఏమాత్రం బోధించదు… వైరాగ్యపథాన్ని సూచిస్తుంది… మోక్షపథం అన్వేషణలో సాగిపొమ్మంటుంది… అత్యంత నిరాడంబరంగా బతకడాన్ని ప్రేరేపిస్తుంది… ఆల్‌రెడీ సంసారిక జీవితంలో ఉన్నవాళ్లు కూడా కొన్ని నిష్ఠతో కూడిన ఆహార నియమాల్ని పాటిస్తారు… అవి చాలా కఠినం… ఎస్, ఆ బాటలో నడవాలంటే అంత సులభం కాదు… సాహసం కావాలి… ఆస్తులు, వ్యామోహాలు, సుఖాలు, వైభోగాల మీద ఆసక్తిని తెంచుకోవాలి… పూర్తిగా ఓ సన్యాసిలాగా, ఓ భిక్షక పాత్రలోకి మారిపోవాలి…
ఇది అనుకున్నంత సులువు కాదు… ఒక నియమబద్ధ, నియంత్రిత, నిర్వికార దశలోకి వెళ్లడం ఓ సక్సెసే… అవును, ఇవి సక్సెస్ స్టోరీలే… అవి రొటీన్ విజయగాథలు కాకపోవచ్చు… అంతకుమించి…! వర్తమాన సమాజం పోకడ ఎలా ఉంది..? ఎలా సంపాదించావు అనేది కాదు, ఎంత సంపాదించావు..? ఇదే ప్రధానం… అనైతికంగా, అక్రమంగా వెళ్తున్నా సరే, డబ్బు బాగా సంపాదిస్తే చాలు, సమాజం నుంచి గౌరవం… మీడియా కూడా వాళ్లను గొప్పగా ప్రొజెక్ట్ చేస్తుంటుంది…, సినిమాలు, సాహిత్యం, టీవీలు అన్నీ… ప్రత్యేకించి కంట్రాక్టర్లు, బ్రోకర్లు, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు అయితే వేల కోట్లు సంపాదించినా సరే ఇంకా ఇంకా కావాలి… ఏం తినమన్నా తింటారు…
తద్వారా బోలెడు సుఖాలు, అట్టహాసాలు, ఆడంబరాలు… సంపద ప్రదర్శనకు నానా మార్గాలు… పిల్లల పెళ్లిళ్లు కూడా ఓ మార్గం… వాటిని తెంచుకోవడం, వైరాగ్యపథంలోకి పూర్తిగా అడుగుపెట్టడం నిజంగా ఓ సాహసం… ఆ కుటుంబంలోని పిల్లలే సన్యాసంలోకి మళ్లాక ఇక ఆ జంటకు కూడా అదే సరైన పంథా అనిపించింది… ఓ దివ్యమైన క్షణంలో వాళ్లూ అదే నిర్ణయించుకున్నారు… అంత ఆస్తిని అలా వదిలేశారు… ఓ భిక్ష పాత్రను చేతపట్టారు… గ్రేట్… పక్కా మెటీరియలిస్టిక్ మనుషులకు ఇది పిచ్చితనంగా కనిపించవచ్చుగాక… వెక్కిరించవచ్చుగాక… కానీ వాళ్లు ఆ చూపులనూ నిర్వికారంగా స్వీకరించి, తమ బాటలో తాము నడిచిపోతుంటారు… ఏదో మనకు అర్థం కాని నిజాన్వేషణలో…!!
Share this Article