అధికారులకే పూర్తి పెత్తనం ఇస్తే పేనుకు పెత్తనం ఇచ్చినట్టే అనేవాడు మా మిత్రుడు… ఎన్నికల అధికారులను నిశితంగా గమనించండి, ఆ వ్యాఖ్య నిజమేనని అంగీకరిస్తారు ఎవరైనా… 4650 కోట్లు పట్టుకున్నారట దేశవ్యాప్తంగా… అంటే రోజుకు 100 కోట్లు… సిగ్గులేని మీడియా ప్రశంసిస్తూ రాసుకొచ్చింది… అసలు ఎన్నికల కోడ్ అమలు తీరు మీద ఈ భజన వార్తలేమిటో అర్థం కాదు…
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో చూశాం కదా, రికార్డుల అంకెల కోసం పోలీసులు, ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్న డబ్బు, బంగారం ఉదాహరణలు… వాటిల్లో రెండుమూడు శాతం కూడా ఎన్నికలకు సంబంధం ఉండదు… వేలాది మంది జనం అవస్థలు, అధికారుల చుట్టూ తిరగడం, ఓ ప్రయాస, చివరకు చేతికి వచ్చేదెంతో తెలియదు… పేరు గొప్ప.., ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా అదే బాటలో పయనిస్తున్నట్టుంది…
హేట్ స్పీచులు ఆపలేరు, అలవికాని హామీలకు నిధులెట్లా అని అడగలేరు, నిజమైన ప్రలోభ హామీలను నిగ్గదీయరు, ఎన్నికల కోసమే ఉద్దేశించిన ప్రభుత్వ పథకాలను ఆపరు, వోటర్లకు డబ్బు పంపిణీని పట్టుకోలేరు… మద్యం, విందులు గట్రా పట్టవు… నేతల ఆస్తుల అఫిడవిట్లు ఓ ఫేక్, డొల్ల… కానీ భద్రాచలం రాములవారి కల్యాణ ప్రత్యక్ష ప్రసారం ఆపేస్తున్నారు…
Ads
ఒకవైపు అయోధ్యలో శ్రీరామనవమి రోజున బాలరాముడి నొసటన సూర్యతిలకం వీక్షణం కోసం లక్షలాది మంది తరలివెళ్తున్నారు… ప్రత్యక్ష ప్రసారం కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు… భక్తగణం నరనరాన జీర్ణించుకుపోయిన భక్తిభావన అది… మరి భద్రాచలంలో కూడా రాములవారే కదా ఉన్నది…
ఇప్పుడేమైనా కొత్తగా రాములవారి కల్యాణం చేస్తున్నారా..? అదేమైనా భక్తులను ప్రలోభపెట్టే కొత్త పథకమా..? ప్రత్యక్ష ప్రసారాలు, ప్రత్యక్ష వ్యాఖ్యానాలు ఈసారేమైనా కొత్తగా చేస్తున్నారా..? ఏటా ఉండేదే కదా… మరి అది ఎన్నికల ప్రలోభం ఎలా అయ్యింది..? ఎందుకు ఆపినట్టు..? ఆ ఉత్తర్వులు ఇచ్చిన వాళ్లకు కామన్ సెన్స్ అనేది ఉందా అనే సందేహం జనానికి వస్తుందంటే అందులో తప్పేముంది..?
అయ్యా, బాబూ, రాములవారి కల్యాణం ఎప్పుడూ జరిగేదే, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి, ప్రత్యక్ష ప్రసారాలకు అనుమతించండి అని సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాల్సి వచ్చింది… ఫాఫం భద్రాచలం రాముడికి అసలే ఆదాయం తక్కువ, రాములవారి కల్యాణం వేళ బాగా కళకళలాడుతుంది గుడి… చివరకు ఈసారి దాన్నీ మింగేసిందా ఎన్నికల సంఘం…
బీఆర్ఎస్ పాలనలో ఈ కల్యాణాన్ని పట్టించుకోలేదు… (అయోధ్య, బీజేపీల ఇష్యూ వచ్చినప్పుడే సోకాల్డ్ బీఆర్ఎస్ మేధావులకు భద్రాచలం గుర్తొస్తుంది…) కేసీయార్ చివరకు స్వయంగా తలంబ్రాలు తీసుకువెళ్లే ఆనవాయితీకి కూడా మంగళం పాడాడు… ఓసారి మనమడు తీసుకుపోయాడని వార్తలూ వచ్చాయి… చూడబోతే ఇంకా ఆ బీఆర్ఎస్ పరిపాలనే కొనసాగుతున్నట్టుంది రాష్ట్రంలో..!
అన్నట్టు, భద్రాచలం వద్ద గోదావరిపై కట్టిన రెండో వంతెనను అక్కడి కలెక్టర్ ప్రారంభించింది… ఇంకా నయం, దాన్నీ ఆపేయలేదు… మరీ ప్రత్యేకంగా రాములవారి కల్యాణమే ఈసారి జరిపించవద్దని ఆదేశించలేదు… మరీ సంతోషం ఏమిటంటే… ఎన్నికలయ్యేదాకా గుడిలో దర్శనాలు ఆపేయమనలేదు… చాలా సంతోషం మహాశయులారా..! శ్రీరామకటాక్ష సిద్ధిరస్తు..!!
Share this Article