• ఎంతకాలమయినా సంతానం కలుగక దశరథుడు ఎంతగానో నిరీక్షించాడు.
• సకల గుణ సంపన్నుడు ఎవరయినా ఉంటే – అతడి చరితను కావ్యంగా రాసి చరితార్థం కావాలని వాల్మీకి నిరీక్షించాడు.
• అవతారపురుషుడి కావ్యం ఎవరిచేత రాయించాలా అని నారదుడు ఎంతగా నిరీక్షించాడో!
• అవతారపురుషుడికి నామకరణం చేయడానికి వసిష్ఠుడు నిరీక్షించాడు.
• రాముడి చేత రాక్షస సంహారం చేయించడానికి, తన తపో బలాన్ని మొత్తం రామ లక్ష్మణులకు ధారపోయడానికి విశ్వామిత్రుడు నిరీక్షించాడు.
• బండరాయిగా పడి ఉన్న అహల్య రామపాదం కోసం నిరీక్షించింది .
• త్రిభువన వీరులెవ్వరూ కదిలించడానికి కూడా సాధ్యపడని శివుడి విల్లు రాముడి చేతిలో విరిగిపోవడం కోసం నిరీక్షించింది.
• జనని జానకి వరమాల నిరీక్షించింది
• కారణ జన్ముడిని ఎలా కారడవులకు పంపాలా అని మంథర నిరీక్షించింది .
• రాముడిని గంగ దాటించడానికి శృంగిబేరిపురం అడవిరాజు గుహుడు నిరీక్షించాడు.
• రాముడి రాక కోసం గంగ నిరీక్షించింది.
• రాముడికోసం భరద్వాజుడు, శరభంగుడు తపస్సుగా నిరీక్షిస్తున్నారు.
• రోజూ పళ్ళు పట్టుకుని శబరి నిరీక్షించింది.
• అన్న రాక కోసం భరతుడు 14 ఏళ్లు నిరీక్షించాడు.
• అన్న సేవలకు లక్ష్మణుడు జీవితమంతా నిరీక్షించాడు.
• రెక్క తెగిన జటాయువు, సమాచారం చెప్పి కనుమూయడానికి నిరీక్షించింది.
• రాతి గుహల్లో సుగ్రీవుడు, హనుమంతుడు రాముడికోసం నిరీక్షిస్తున్నారు.
• వాలిని చంపినతరువాత కూడా వర్షాకాలం కదా! వర్షాలు తగ్గేవరకు నిరీక్షిద్దామన్నాడు రాముడు లక్ష్మణుడితో.
• రామకార్యం చేసి మోక్షం పొందడానికి సంపాతి నిరీక్షించింది.
• హనుమ కోసం సగరుడు , మైనాకుడు నిరీక్షించారు.
• హనుమ లంక దాటుతుండగా పుష్ప వర్షం కురిపించడానికి దేవతలు నిరీక్షించారు.
• రాముడి వార్త కోసం లంకలో సీతమ్మ 10 నెలలు నిరీక్షించింది.
• హనుమ వెళ్ళాక రాముడిరాకకోసం సీతమ్మ మళ్ళీ నిరీక్షించింది.
• వెళ్లిన హనుమ కోసం – వానరులు , సుగ్రీవుడు , రామలక్ష్మణులు నిరీక్షించారు.
• సీతారాముల కోసం అయోధ్య నిరీక్షించింది.
• ఇలాంటి కావ్యం కోసం లోకం నిరీక్షించింది.
• సీతమ్మ రాకకోసం వాల్మీకి ఎదురుచూశాడు.
• ఇలాంటి కావ్యం గానం చేసే లవకుశులకోసం వాల్మీకి నిరీక్షించాడు.
• సీతమ్మను అక్కున చేర్చుకోవడానికి భూదేవి ఎదురు చూసింది.
• తాటకి , మారీచ సుబాహుల నుండి లంకలో రావణుడితోపాటు లక్షలమంది రాక్షసుల నిరీక్షణ ఎన్నెన్ని జన్మలదో ?
• రాక్షస సంహారం కోసం లోకాలన్నీ ఎంతగా నిరీక్షించాయో?
కారణజన్ములకే
నిరీక్షణ తప్పలేదు.
మనకు నిరీక్షణ తప్పుకాదు.
వేసిన విత్తనం చినుకు కోసం నిరీక్షిస్తుంది.
కడుపు నిండిన మేఘం కురవడానికి నిరీక్షిస్తుంది.
నేల కురిసిన నీరు ఆవిరి కావడానికి సూర్యుడికోసం నిరీక్షిస్తుంది.
పుష్కరంకోసం నది నిరీక్షిస్తుంది.
నదిని కలిపేసుకోవడానికి సముద్రం నిరీక్షిస్తుంది.
Ads
నిరీక్షణ –
ఒక తపస్సు.
ఒక తప్పనిసరి.
ఒక అవసరం.
ఒక కళ.
ఒక ఋతువు గుమ్మంలో మరో ఋతువు నిరీక్షిస్తూ ఉంటుంది.
మధుమాసం కోసం కోయిల నిరీక్షిస్తుంది.
వసంతం కోసం వనమంతా నిరీక్షిస్తుంది.
పగటి గడపలో రాత్రి; రాత్రి చీకటి కొమ్మ మీద వేకువ నిరీక్షిస్తుంటాయి.
నిరీక్షణలోనే ఉంది ప్రపంచం.
నిరీక్షణ శిక్ష కాదు;
ఓపికకు పరీక్ష –
జగతి గతికి శ్రీరామ రక్ష…. -పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article