దేవయాని ఖోబ్రగడె… పేరు గుర్తుందా..? చాన్నాళ్లయింది కదా ఆమె వార్తల తెర మీదకు రాక… ఎస్, మళ్లీ వచ్చేసింది… ఈసారి డిఫరెంటుగా… ఆమె ప్రస్తుతం కాంబోడియా ఇండియన్ ఎంబసీలో రాయబారిగా పనిచేస్తోంది కదా… అక్కడి నూతన సంవత్సరం రోజున ఆ దేశప్రజల ఖ్మేర్ సంస్కృతికి సంబంధించిన అప్సర వేషధారణ చేసి, ఆ దేశప్రజలకు శుభాకాంక్షలు చెప్పింది…
ఆ ఫోటో షూట్‌ను ఇండియన్ ఎంబసీయే అధికారికంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది… స్థూలంగా చూస్తే వోకే… బాగుంది… ఆమె ఫోటో షూట్‌లో తప్పులేదు.., తను వ్యక్తిగతంగా ఈ పనిచేస్తే తప్పులేదు, ఎవరూ తప్పుపట్టరు… కానీ అధికారికంగా షేర్ చేయడం బాగాలేదు… (పలుసార్లు వివాదాల్లో నిలిచిన తెలంగాణ మాజీ సీఎంవో అధికారిణి స్మితా సభర్వాల్ కూడా సోషల్ మీడియాలో బోలెడు ఫోటో షూట్లు పెడుతుంది, అది కూడా ఆమె వ్యక్తిగతం…)
ఒక ప్రాంత సంస్కృతిని గౌరవిస్తూ, వాళ్లు మెచ్చేలా, వాళ్లకు నచ్చేలా ఇలాంటి ఫోటో షూట్లు పర్లేదు, కానీ వీలైనంతవరకూ విదేశాంగశాఖ ఉన్నతాధికారులు, ప్రత్యేకించి ఇతర దేశాల్లో ఇండియాను రిప్రజెంట్ చేసే అంబాసిడర్ల వేషధారణ, భాష, వ్యవహార శైలి ఓ పద్ధతిలో ఇమిడి ఉంటుంది… మరీ సోషల్ మీడియాలో అలా పదే పదే కనిపించరు… మీడియాకు కూడా దూరం…
Ads
టీఎంసీ ఎంపీ ఒకాయన ఈ ఫోటో షూట్ వార్తను యాడ్ చేస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టాడు… ఒకవైపు అదే కాంబోడియాలో 5 వేల మంది భారతీయులు హ్యూమన్ ట్రాఫికింగులో చిక్కి అవస్థలు పడుతుంటే మరోవైపు ఇలాంటి ఫోటో షూట్లు ఏమిటంటూ..! వెంటనే దానికీ కౌంటర్లు పడ్డయ్… ‘‘ఏం, ప్రధాని మోడీ ఏ దేశానికి వెళ్లినా ఆ దేశ సంస్కృతిని ప్రతిబింబించే వస్త్రధారణతో ఫోటోలు దిగడం లేదా..? దేశమంతా షేర్ చేయడం లేదా..? తప్పేముంది..? ఆయా దేశాల సంస్కృతులను అవమానించడం లేదు కదా…’’ ఇలా…
నిజమే కదా… ప్రధానిగా మోడీ కనబర్చిన ధోరణినే ఒక రాయబారి కనబర్చింది… అయితే సదరు ఎంపీ గారు బీజేపీ ప్రభుత్వాన్ని తిడుతున్నాను అనుకుని ఈ పోస్టు పెట్టాడు… ‘ఏమయ్యా, జైశంకరూ (విదేశాంగ మంత్రి) ఇదేం ధోరణి, ఏవేవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు, ఇలాంటి ఫోటో షూట్లను సమర్థిస్తావా’ అనడిగాడు…
వేరే రాయబారి ఎవరూ ఇలా ఫోటో షూట్లను బహిరంగంగా షేర్ చేయకపోవచ్చు… కానీ ఈమె గతం కొంత వివాదాస్పదం కాబట్టి వెంటనే రియాక్షన్… గతంలో అమెరికాలో వీసా వివరాలు తప్పుగా ఇచ్చినందుకు ఆ దేశం చర్యలకు పూనుకుంది… అలాగే ఓ పనిమనిషికి ఇచ్చే జీతంపైనా ఓ కేసు… విదేశాంగ శాఖ సిబ్బందికి ఈ కేసుల నుంచి, అరెస్టుల నుంచి రక్షణ ఉంటుంది, కాబట్టి ఆమెను అక్కడి నుంచి తప్పించి, నాన్ ఫోకల్ పాయింట్‌లోకి తరలించింది, కొన్నాళ్లు వెయిటింగులో కూడా ఉంచింది… తరువాత 2020లో పెద్దగా విదేశాంగ దౌత్య సంబంధాల ప్రాధాన్యం లేని కాంబోడియాకు పంపించేసింది ప్రభుత్వం…
ఐనా సరే, కొన్నాళ్లు అమెరికా, ఇండియా నడుమ దౌత్యపరమైన చికాకులు చోటుచేసుకున్నాయి… ఆదర్శ్ హౌజింగ్ సొసైటీ స్కాంలో సీబీఐ ఆమెను ప్రశ్నించబోతున్నట్టు వార్తలు చదివినట్టు కూడా గుర్తు… ఆమెది మహారాష్ట్రంలోని గడ్చిరోలి ఏరియా… బౌద్ధ కుటుంబం… తండ్రి ఉత్తమ్ కూడా గతంలో ఇండియన్ సివిల్ సర్వీసులో పనిచేసి రిటైరయ్యాడు… (తను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కూడా వార్తలొచ్చినయ్, తన మీద ఆదర్శ్ స్కాం వంటి పలు అవినీతి ఆరోపణలున్నయ్)… దేవయాని పోస్టింగుల మీద ఏదో కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్లినట్టుంది…
ముంబైలో చదువుకున్న ఈమె 1999లో ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ఫారిన్ సర్వీసులో చేరింది… ఇటలీలోని రోమ్‌లో లూయీస్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ ఆకాశ్ సింగ్ రాథోడ్‌ను పెళ్లి చేసుకుంది, కానీ తను అమెరికన్ పౌరుడు… అందుకని ఇండియన్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాడు దేవయానిని పెళ్లి చేసుకున్న తరువాత… ఇద్దరు పిల్లల ద్వంద్వ పౌరసత్వం కూడా వివాదాల్లో చిక్కుకున్నదే ఓ దశలో… మొత్తానికి ఇంట్రస్టింగు పర్సన్..!!
Share this Article