Prasen Bellamkonda…… బౌలర్లకు నివాళి…. నిన్న SRH vs RCB మాచ్ లో రెండు జట్లు నలభై ఓవర్లలో 549 పరుగులు చేయడం కళ్ళారా చూసిన నాకు ఒకసారి రింగులు రింగుల్లో వెనక్కి వెళితే పొట్ట ‘చెక్కా’లయ్యే నవ్వొచ్చింది. ఎందుకంటే ఆఫ్ అండ్ మిడిల్ స్టిక్ మీది బాల్ ను ఆఫ్ సైడ్ మాత్రమే ఆడాలనుకునే మూఢత్వం విరివిగా ఉన్న రోజులవి. మరి ఇప్పుడేమో వైడ్ అవుటాఫ్ ది ఆఫ్ స్టంప్ బాల్ ను ఫైన్ లెగ్ మీంచి కొట్టే కాలం.
కనుక నవ్వే వస్తది.
పృడెన్శియల్ కప్ రోజుల్లో 60 ఓవర్ల మ్యాచ్ లో 240 డిఫెన్డబుల్ స్కోర్ అనుకునేవాళ్ళం. ఫైనల్ లో 60 ఓవర్లలో 183 కొట్టలేక వెస్టిండీస్ కప్పు చేజార్చుకుందని నిన్న చిన్నస్వామి స్టేడియంలో కూచున్న ఇవాల్టి కుర్రోళ్లకు చెపితే నోటితోనే నవ్వుతారనే గ్యారెంటీ లేదు.
Ads
మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 60 ఓవర్లలో 250 చేస్తే చాలు తడిగుడ్డేసుకుని పడుకుని గెలిచేసేది.
అలా అలా ఒకవైపు ఓవర్లకు కోతపెట్టుకుంటూ వటుడింతింతై అన్నట్టు పెరిగి పెరిగి ఇలా ఇరగదీస్తోంది.
అవును, ఇట్స్ బ్యాట్స్మన్స్ గేమ్ నవ్.
60 ఓవర్ల మ్యాచ్ లో అత్యధిక స్కోర్ 334 మాత్రమే. ఆ తరవాత 60 ఓవర్లు కాస్తా 50 కి తగ్గాక కూడా 250 డిఫెండబుల్ గా ఉండేది. మెలమెల్లగా అది 300 కు చేరింది. ఆస్ట్రేలియా మీద 434 ఛేజ్ చేస్తూ దక్షిణాఫ్రికా గెలుపు కొట్టినపుడు కలీస్ ‘ వాళ్ళు ఇంకో పదిహేను పరుగులు తక్కువ కొట్టారు ‘ అన్నాడంటే ఎంత మార్పో అర్ధం చేసుకోవచ్చు.
అప్పటికి 50 ఓవర్ల అత్యధిక స్కోర్ 481.
ఒక 50 ఓవర్ల మ్యాచ్ లో ఇంగ్లాండ్ 470 కొడితే హమ్మయ్య 500 కొట్టకుండా ఆపగలిగాం అనుకుందట ఆస్ట్రేలియా.
ఆ తరవాత 50 ఓవర్ల మ్యాచ్ లు కూడా బోర్ కొట్టడం మొదలయాక పొట్టి ఫార్మాట్ 20 కి మరుగుజ్జయిన మొదట్లో… 160 కొడితే చాలనుకునేవాళ్ళు. అది అలవోకగా 180 మీదుగా 200 కు చేరింది. ఇప్పుడు 225 ను కూడా సులాగ్గా ఛేజ్ చేసేస్తున్నారు. 277 ఛేజ్ చేస్తూ 241… 287 ఛేజ్ చేస్తూ 262 కొట్టడం పృడెన్శియల్ కప్ రోజుల్లో కలలో కూడా లేదు.
Ipl రికార్డ్ 287, టి ట్వంటి రికార్డ్ 314. బహుశా ముందు ముందు 50 ఓవర్లలో 400….20 ఓవర్లలో 250 సర్వ సాధారణం అయిపోతుందేమో.
అప్పుడెప్పుడో వరల్డ్ కప్ లో కీర్తి ఆజాద్, మోహిందర్ అమర్నాధ్ కలిసి 24 ఓవర్లు వేసి 55 రన్స్ ఇచ్చిన పొదుపు, గవాస్కర్ 60 ఓవర్లు ఆడి 36 పరుగులు చేసిన నత్తరికం ఇక ముందు వెర్రి కలే.
ఓవర్ కు నాలుగు ఇచ్చే ఇరుకు నుంచి ఓవర్ కు 12 ఇచ్చే ఉదారతకు బౌలర్ ఎదిగాడని మనోభావాలను దెబ్బ తీసుకుంటూనే ఈ ఊచకోతలో కూడా బ్యాటర్లను గింగిరాలు తిప్పుతున్న అశ్విన్, నరైన్, రషీద్ ల లాంటి చాలా మందికి సలాం కొడుతూనే….
ఎందరో బౌలర్లు అందరికీ రిప్పులు…
Share this Article