ఆంధ్రజ్యోతిలో ఓ వార్త… 29 మంది నక్సలైట్లు మరణించిన చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ వార్త… దండకారణ్యం మీద నక్సలైట్ల పట్టు సడలడానికి కారణాలు సహా, దాదాపు 80 వేల బలగాలతో సాగుతున్న యాంటీ నక్సల్స్ ఆపరేషన్ వివరాల్ని ఏకరువు పెట్టింది ఆ వార్త… బాగానే ఉంది…
సరే, ఆ కథనం జోలికి మనం పోవడం లేదు ఇక్కడ… కానీ ఆ వార్తకు 29 మంది మృతుల ఫోటోలు చిన్న చిన్నగా యాడ్ చేశారు… బ్లాక్ అండ్ వైట్ అయినా సరే భీతావహంగా ఉంది… ఛిద్రమైన మొహాలు సరిగ్గా గుర్తుపట్టడానికి కూడా వీల్లేకుండా ఉన్నాయి… అందులో 15 మంది మహిళలే…
Ads
ఆ పేజీ తెరవగానే ఇది ప్రముఖంగా కనిపించి ఒక్కసారిగా మనస్సును కకావికలం చేసేలా ఉంది… వాళ్లు నక్సలైట్లా..? పోలీసులా అనేది వేరే సంగతి… వోకే, ఆ ఫోటోలు ముద్రిస్తే సంబంధిత వ్యక్తులు తమ వారిని గుర్తుపడతారనే మంచి భావన ఏమైనా ఉందేమో ఇన్ని ఫోటోలను పబ్లిష్ చేయడం వెనుక… అలా అనుకునే పక్షంలో వెబ్ ఎడిషన్‌లో కాస్త పెద్దగా, తెలిసినవారు గుర్తుపట్టేలా పెట్టేస్తే సరిపోయేది…
ఎంతటి ప్రమాదమైనా, భారీ విపత్తు అయినా, ఇలాంటి పెద్ద సంఘటనలైనా సరే, వీలైనంతవరకూ బీభత్సంగా కనిపించే ఫోటోల్ని పబ్లిష్ చేయకపోవడం నవీన పాత్రికేయ స్పూర్తి… రక్తం, తెగిపడిన అవయవాలు, భయానకంగా ఉండే చిత్రాలను అవాయిడ్ చేయాలి…
ఇవి సంబంధిత కుటుంబాలకు కూడా నచ్చదు… చిన్న చిన్న క్రైమ్ వార్తల్లో కూడా మనం ఫైల్ ఫోటోలను వాడుతున్నాం… ఇలాంటి ఫోటోలను వద్దనుకుంటున్నాం… కానీ ఆంధ్రజ్యోతి వంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇలాంటి ధోరణిని చూపించడం ఏమిటనే ఆశ్చర్యం కలిగింది ఆ ఫోటోల వరుస చూడగానే…
రిపబ్లిక్, రాష్ట్ర అవతరణ, పంద్రాగస్టు వేడుకల సందర్భంగా పురస్కారాలు, మెరిట్ అవార్డులు గట్రా తీసుకుంటున్నవారి ఫోటోలను వరుసగా, చిన్నగా ఓ మాలలా కుట్టేసి వందల ఫోటోల్ని పబ్లిష్ చేయడం చూస్తున్నాం… అవార్డులు తీసుకునేవారెవరో గుర్తుపట్టే వీలు కూడా ఉండదు… బట్ వోకే, దాంతో నష్టం ఏమీలేదు, పాఠకుడిని భీతావహుడిని చేయదు… కానీ మరీ ఇలా ఛిద్రమైన మొహాలు పబ్లిష్ చేయడం ఏమిటో.,.
ఆంధ్రజ్యోతిలో క్వాలిటీ సెల్ వంటి వ్యవస్థ ఉందో తెలియదు… ఇలాంటి ఫోటోలు, పాత్రికేయ ప్రమాణాలకు సంబంధించి ఎడిటోరియల్ ముఖ్యుల నడుమ హెల్తీ డిబేట్ జరుగుతుందో లేదో కూడా తెలియదు… స్వతహాగా జర్నలిస్టయిన రాధాకృష్ణ సారథ్యంలోని పత్రిక ఇలా ఉండకూడదు అనేదే ఇక్కడ చెప్పాలనుకున్న పాయింట్… ఐనాసరే, మేం చేసేదే కరెక్టు అనుకునే పక్షంలో ఇక ఎవరేమీ చెప్పలేరు కూడా…!!
Share this Article