Taadi Prakash…. ‘విరాట్’ రచయిత గురించి: స్తెఫాన్ త్వైక్ ప్రపంచ ప్రసిద్ద రచయితల్లో ఒకరు. కథకుడుగా, వ్యాసకర్తగా, నాటక రచయితగా,
స్తెఫాన్ త్వైక్ 1915-16 ప్రాంతాల్లో భారతదేశానికి వచ్చారు. భారతీయ తత్వశాస్త్రం ఆంటే ఆయనకు చాలా ఇష్టం. మన వేదాల్ని, ఉపనిషత్తుల్ని, పురాణాల్ని, భగవద్గీతని అధ్యయనం చేశారు, స్తెఫాన్ త్వైక్ 1881 నవంబర్ 28న వియన్నా (ఆస్ట్రియా)లో జన్మించారు. ఆస్ట్రియా, ఫ్రాన్స్, జర్మనీలలో విద్యాభ్యాసం .
కీర్తికాంక్ష ఏమాత్రం లేని నిరాడంబర వ్యక్తి, గొప్ప ఆత్మాభిమాని, పదవులకు, బిరుదులకు, అధ్యక్షతలకు, సభ్యత్వాలకు, సన్మానాలకు జీవితాంతం చాలా దూరంగా ఉన్నారు. ఆయన ‘యూదు’ కావడం వల్ల నాజీల నిరంకుశత్వానికి, అణచివేతకు గురైనారు. నాజీ పోలీసులు ఈయన పుస్తకాల్ని వెతికి వెతికి తగలబెట్టారు. అక్కడ నుంచి తప్పించుకుని భార్యతో సహా మొదట ఇంగ్లండ్‌కు, తరువాత బ్రెజిల్ కు పారిపోయారు.
చివరికి 1942 ఫిబ్రవరి 22న తన 61వ ఏట భార్యతోపాటు ఆత్మహత్య చేసుకున్నారు.
త్వైక్ రచనల్లో ‘విరాట్’ అపూర్వ కళాఖండం.
….. ….. …..
విరాట్ కవర్ పేజీ ఆర్టిస్ట్ మోహన్ వేశాడు. మంచి మిత్రుడు, సీనియర్ జర్నలిస్టు పొనుగోటి కృష్ణా రెడ్డి గారు అడిగితే విరాట్ కి ముందుమాట 2010 లో రాశాను. ఈ పుస్తకం మరింతమంది చదవాలి. విరాట్ లోని తాత్విక చింతన ముందు తరాలకు అందాలి…
గోర్కీ నుంచి త్వ్వైక్ దాకా ….
………………………………….
కొన్ని సమయాల్లో ఒకళో ఎవరో తారసపడతారు. ఎక్కడో చూశాం అనిపిస్తుంది. గుర్తురారు. గింజుకుంటాం. అయినా గుర్తురాదు. విరాట్ మొదటిసారి చదవటం పూర్తి చేసినప్పుడు అలాగే అన్పించింది. తర్వాత్తర్వాత గుర్తొచ్చింది. స్తెఫాన్ త్వ్వైక్, షోలహూవ్ (ఫేట్ ఆఫ్ ఎ మాన్), హెమింగ్వే (ఓల్డ్‌మాన్ అండ్ ది సీ), 1953లో ద మాన్ హు ప్లాంటెడ్ ట్రీస్ రాసిన జీన్ జియానో ఒకే పాలపుంత మీది నుంచి నడిచి వెళ్ళారని.
దాంకోస్ బర్నింగ్ హార్ట్ అన్న ప్రాచీన బైబిల్ కథని గోర్కీ (1868-1936) తన సొంత శైలిలో రాశారు.
గడ్డి ఏపుగా పెరిగి వున్న సువిశాలమైన స్టెప్పీలో ఒక గిరిజన తెగ ఉంటుంది. వాళ్ళు బలమైన మనుషులు. సాహసికులు. భయం తెలియని వాళ్ళు. ఒక రోజు మరో తెగ వాళ్ళు హఠాత్తుగా వచ్చి దాడి చేస్తారు. దగ్గరలోనే దట్టమైన అడవిలోకి వీళ్ళు పారిపోతారు.
అది భయానకమైన కీకారణ్యం. పెను వృక్షాల కొమ్మలు పెనవేసుకుపోయి, పైన ఆకాశం కనిపించదు. చీకటి. దగ్గర్లో ఓ కొలను. కొందరు నీళ్ళు తాగుతారు. ఆ నీటిలో విషపు ఆవిర్లు. ఇద్దరో ముగ్గురో చనిపోతారు. ఆడవాళ్ళ ఏడుపులు. కటిక చీకటి. అడవి గాలి మృత్యు సంగీతం.
Ads
దిక్కు తోచదు. భయంతో బిక్క చచ్చిపోతారు. ఆ తెగలో అందమైన యువకుడు దాంకో. “ఏదో ఒకటి చెయ్ ,” అని జనం అడుగుతారు. దాంకో లేస్తాడు. పదండి అంటాడు. ముందు నడుస్తాడు. ఎంత దూరం వెళ్ళినా రాళ్ళూ, చీకటీ, గాయాలు. దారీ తెన్ను లేని ప్రయాణం. అడవిలో హఠాత్తుగా తుఫాను. భయంతో దాంకోని తిడతారు జనం.
మమ్మల్ని చంపడానికే తీసుకెళ్తున్నావు, మేమే నిన్ను చంపేస్తాం అంటారు. అంతలో దాంకో కళ్ళలో వెలిగే జ్వాలని చూసి భయపడతారు. దాంకో ఒళ్ళంతా నిప్పులా వెలుగుతుంది. దాంకో కుడి చేత్తో ఛాతీని చీలుస్తాడు. గుండెను బయటకి తీసి రెండు చేతుల్తో ఎత్తి పట్టుకుంటాడు. కటిక చీకటి మాయం అవుతుంది. మండే సూర్యునిలా గుండె కాంతులు వెదజల్లుతుంది. అలాగే నడుస్తుంటాడు దాంకో.
వెలుగు, వెనక జనం. చాలా దూరం వెళ్ళాక అడవి పెద్ద చప్పుడుతో చీలి వీళ్ళకి దారి ఇస్తుంది. దాటి పోగానే అడవి మూసుకుపోతుంది. పెద్ద మైదానం. ఏపుగా పెరిగిన గడ్డి, సూర్యాస్తమయ సమయం. సరస్సులో నీళ్ళు దాంకో గుండె లోంచి కారిన రక్తంలా ఎర్రగా మెరుస్తుంటాయి. స్వేచ్చ. జనం ఆనందంలో మునిగితేలి దాంకో సంగతే పట్టించుకోరు. ఒక చెట్టు మొదట్లో కూలిపోయి దాంకో చనిపోతాడు.
గుండె అతని పక్కనే వెలుగుతూ ఉంటుంది. ఒక మూర్ఖుడు దాన్ని కాలితో నలిపేస్తాడు. అది అన్ని వైపులకీ నీలి కాంతి పుంజాలని వెదజల్లుతుంది అని చాలా పొయిటిగ్గా, ఫిలసాఫికల్‌గా కథని ముగిస్తాడు గోర్కీ.
స్తెఫాన్ త్వ్వైక్ విరాట్ ముగింపూ, గోర్కీ దాంకో బర్నింగ్ హార్ట్ ముగింపూ మానవ జీవన సాఫల్యం గురించి మనకి స్పష్టంగా ఒక దారినే చూపిస్తాయి.
విరాట్ ఒక అరుదైన ఆత్మానుభవం. విరాట్ చదివాక ఓ చిరుగు చొక్కా రిక్షాపుల్లర్ తాత్వికుడిగా కనిపిస్తాడు. ఓ గొప్ప కోటీశ్వరుడు లేకి మనిషిగా అనిపిస్తాడు.
There is no past, no future, only the greedy present అన్నట్టుగా ఉండే ఈ senseless rat race ని చూస్తే విరాట్ లాంటి పుస్తకాలతో ఇక్కడెవరికీ అవసరం లేదని అనిపిస్తుంది. -తాడి ప్రకాష్ 9704541559
Share this Article