పెరుగుతున్న మాంసాహారులు… మాయమవుతాయమ్మ వంటిళ్లు!
అమ్మా! లంచ్ లోకి ఏం చేశావ్?
పప్పు, కూర, రసం.
‘బోర్ ‘
డిన్నర్ ఏంటమ్మా ?
రోటీ, మిక్స్ వెజ్ కర్రీ.
ఎప్పుడూ అదేనా? ఎలా తింటారు?
… దాదాపు ప్రతి ఇంట్లో నిత్యం జరిగే బాగోతమే ఇది. ఒకప్పుడు చద్దన్నం తప్ప టిఫిన్లు లేవు. ఇప్పుడు ఇంట్లోనే ఇడ్లి, దోస చేస్తున్నా నచ్చడం లేదు. పిల్లలైతే మరీ. ఇంట్లో వండినవి బాగోవు అనే అభిప్రాయంతో ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు కూడా ఉద్యోగాల వల్ల సమయం దొరక్క బయట తినమని డబ్బులిస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళకోసం పుట్టుకొచ్చిన బ్రహ్మాస్త్రాలు స్విగ్గీ, జొమాటో వంటి యాప్ లు. మొదట్లో పిల్లలకు ఉపయోగంగా ఉన్న ఈ యాప్ లు ఇప్పుడు అందరికీ అవసరంగా మారాయి. పైగా వీటిలో అందరి అవసరాలకు తగ్గట్టుగా ఆహారం అందుబాటులో ఉండడంతో ఇంట్లో వండటం తగ్గిందనే చెప్పాలి. కొన్నాళ్ళకు వంటిళ్ళు ఉండవేమో అని ఒక అనుమానం.
అసలు మన భారతీయ వంటలంటే మాటలా? ఎన్ని రాష్ట్రాలు? ఎన్నెన్ని రకాలు? ఫుడ్ యాప్ ల వల్ల ఈ రకాలన్నీ అందరికీ అందుతున్నాయి. ఇక ఇంట్లో వంట చేయడం, తినమని అందరినీ బతిమాలాడడం ఎందుకు? దాంతో క్రమంగా బయటి నుంచి ఆహారం తెప్పించుకోవడం పెరిగింది. గత పదేళ్ల మార్పులు ఇందుకు నిదర్శనం. సంబంధిత సర్వేలూ ఇదే చెప్తున్నాయి. ఇదివరకటికన్నా కుటుంబ ఆదాయం పెరిగింది. అందరికీ వెరైటీ ఆహారం కావాలి. డబ్బు లెక్కలేదు. అయితే ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తినడం ఆందోళనకరం. నిమిషాల్లో ఇంటి ముందుకు ఆహారం తెచ్చి ఇవ్వడంతో గత సంవత్సరం పట్టణ ప్రాంతాల్లో ఆదాయంలో 50 శాతం ఆహారం కోసమే ఖర్చు చేశారట. అంతకు ముందుకన్నా ఇది పది శాతం ఎక్కువ.
Ads
# డబ్బులున్నవాళ్ళు బియ్యం , పప్పులపై చేసే ఖర్చు తగ్గి, బయటి తిండికి పెట్టే ఖర్చు పెరిగింది.
# గతంతో పోలిస్తే ఇళ్లలో వంట చేసుకోవడం తగ్గింది. సందర్భం ఏదైనా ఆహారం బయటినుంచే.
# ఆరోగ్య స్పృహ ఉండి చేసుకోలేనివాళ్ళు ఫుడ్ లేబుల్స్ చదివి తక్కువ కెలోరీలు, ఆర్గానిక్ ఆహారం తెప్పించుకుంటున్నారు.
# మాంసాహారం, నూనెల వినియోగంలో మాత్రం మార్పు లేదు.
ముక్కలు నమిలి పారేస్తున్నారు
————————-
ఓ పక్క శాకాహారం, వీగన్ పెరుగుతున్నాయని అనుకుంటుంటే… తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మాంసాహారం ఎంత తిన్నా తనివి తీరడం లేదు. ఇటీవల జరిపిన పరిశీలనలో 96 శాతం తెలుగువాళ్లు మాంసాహారులని తేలింది . ఇది జాతీయ సగటు కన్నా 20 శాతం ఎక్కువట. దేశవ్యాప్తంగా 77 శాతం ముక్కలు నమిలి పారేస్తుంటే, తెలుగువారు ఇంకో ఇరవై శాతం అధికంగా హాం ఫట్ అనిపిస్తున్నారు. ఈ విషయంలో మగవారే ఎక్కువ. మహిళలు కొంచెం తక్కువగానే తింటున్నారు. అయితే ఇంట్లో వారికోసం వారానికోసారైనా వండుతున్నారు. బయట ఫుడ్ ఎంత ఇష్టమైనా మాంసాహారం మాత్రం ఇంట్లోదే ఇష్టపడటం విశేషం.
ఏ రంగమైనా మార్పు అనివార్యం. ఆహారం అందుకు మినహాయింపు ఏమీ కాదు. ఒకప్పుడు పచ్చి మాంసం, కాయగూరలు తినే మానవుడు నాగరికత అబ్బాక వండుకోవడం మొదలెట్టాడు. ఇప్పుడు కొనుక్కోవడం ఎక్కువైంది. అయితే ఏ మార్పు అయినా మేలు చేసేది అయితేనే ఎక్కువ కాలం ఉంటుంది. అది కరోనా నేర్పిన పాఠం. ఎన్ని పాఠాలు ఉన్నా మా రూటే వేరంటారా? నమిలి పారేయండి.
కొస మెరుపు:- మన సర్వేల్లో వంటలు చెయ్యడం తగ్గిందని వచ్చింది కదా! అంతర్జాతీయంగా చేసిన ఒక సర్వే లో భారతీయులు అత్యధికంగా వారానికి 13 గంటలు వంట కోసం కేటాయిస్తున్నారని తేలింది. అంటే ఇంటా బయటా కూడా తిండిలో రాజీ పడటం లేదన్నమాట! – కె. శోభ
Share this Article