ఎందరో ప్రధానులు దేశాన్ని పాలించినప్పటికీ… ఇప్పటివరకూ భారత్ ను ఎవ్వరూ పాలించని విధంగా.. ఇప్పటివరకూ ఒకే ఒక్క మహిళా ప్రధానిగా అభినవ దుర్గ అనిపించుకున్న పేరు ఇందిరాగాంధీ. అయితే, ఇందిరాగాంధీ పాలనా చతురత.. ఎమర్జెన్సీ వంటి చీకటి కోణాలను కొత్తగా చెప్పుకోవడం చర్వితచరణమే. కానీ, ఇందిర వెంట నడిచిన ఓ ఇద్దరు కీలక సివిల్ సర్వెంట్స్… ఓ నాన్ సివిల్ సర్వెంట్.. వారి మధ్య నెలకొన్న ప్రొఫెషనల్ పోటీ.. కచ్చితంగా కాస్తా ఆసక్తికరం.. చెప్పుకోవాల్సి విషయం.
ఒకరు లక్ష్మీకాంత్ ఝా. మరొకరు పరమేశ్వర్ నారాయణ్ హక్సర్. ఇంకొకరు పృథ్వీనాథ్ ధర్.. ముగ్గురూ ముగ్గురే. ఈ ముగ్గురూ ఇందిరను వెనుకుండి నడిపిన చోదకశక్తులే.
మొదట ఎల్. కే. ఝాగా ముద్దుగా.. షార్ట్ గా పిల్చుకునే లక్ష్మీకాంత్ ఝా గురించి కాస్త చెప్పుకోవాలి. ఝా.. బీహార్ రాష్ట్ర దర్బంగావాసి. 1936 ఇండియన్ సివిల్ సర్వీసెస్ బ్యాచ్ అధికారి. ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన అధికారి. ఇక ఇంట్రడక్షన్ కాస్తా కట్ చేస్తే.. 1966 జనవరి మాసంలో లాల్ బహదూర్ శాస్త్రి మరణం తర్వాత.. ఇందిరాగాంధీ దేశ మూడో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో అసలు దేశం మొత్తాన్నీ నడిపించే కీలక విషయాల్లో ఇందిర వెంట ఉండి నడిచింది లక్ష్మీకాంత్ ఝా. ఆయన ఇందిరాగాంధీ కార్యదర్శిగా.. కాదు కాదు శక్తివంతమైన సెక్రటరీగా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఇందిర విదేశీ పర్యటనల నుంచి మొదలుకుంటే.. కీలక సమావేశాలు, చర్చలు.. దేశ భద్రతకు సంబంధించిన అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాలు, విదేశాలతో దౌత్యపరమైన బాధ్యత నిర్వహణ.. ఇలా ఏ పనైనా.. ఎల్. కే. ఝా ఉండాల్సిందే.
Ads
అయితే, దౌత్యపరమైన విషయాల్లో అప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ తో పొసగకపోవడం.. విదేశాలతో దౌత్య సంబంధాల విషయంలో కొంత నిరుత్సాహ పరిణామాలు వెరసి… ఎల్. కే. ఝాను ఆ బాధ్యతల్లో కొనసాగించడంపై ఇందిరే కొద్దిగా పెదవి విరిచారు. ఝూ కూడా కాస్త అసౌకర్యంగా ఫీలైన సమయమది.
అప్పటికే రాజభవనంలో ఎల్. కే. ఝూ వ్యవహారశైలిపై ఓ చర్చతో పాటు.. కొంత తిరుగుబాటు కూడా ప్రారంభమైంది. 1966 ప్రాంతంలో ఇందిరాగాధీ వాషింగ్టన్ పర్యటనకు బయల్దేరింది. ఆ పర్యటనలో ఆమె వెంట ఎల్. కే. ఝూతో పాటు.. పీతాంబర్ పంత్, హెచ్.ఎమ్. పటేల్ గా పిల్చుకునే హీరూభాయ్ ఎమ్. పటేల్, ఇందిరాగాంధీ వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు. లండన్ లో అప్పటికే యూఎస్ భారత్ అంబాసిడరైన బ్రజ్ కుమార్ నెహ్రూ ఇందిర కోసం వేచి చూస్తున్నారు. లండన్ లో ఫ్లైట్ మార్చారు. ఆ క్రమంలో ఇందిరాగాంధీతో పాటు.. రాజీవ్, సంజయ్ గాంధీతో పాటు.. మరి కొందరు ముఖ్యులు.. అలాగే ఓ రహస్యమైన అప్పటివరకూ అక్కడెవ్వరికీ పరిచయం లేని ఓ వ్యక్తి ఆ ఫ్లైట్ ఎక్కారు. ఆయనే.. పరమేశ్వర్ నారాయణ్ హక్సర్. ఈ విషయాన్ని ఆర్బీఐ మాజీ గవర్నర్ ఇంద్రప్రసాద్ గోర్ధన్ భాయ్ పటేల్ తన జ్ఞాపకాల్లో భాగంగా గ్లింప్సెస్ ఆఫ్ ఎకానమిక్ పాలసీలో ప్రస్తావించారు. ఎల్. కే. ఝూ ఆర్బీఐ గవర్నర్ గా వెళ్లిపోతాడని… ఆ తర్వాత ఆయన స్థానే పరమేశ్వర్ నారాయణ్ హక్సర్ ఆ పదవి బాధ్యతలు స్వీకరిస్తాడనే విషయం మాత్రం అక్కడెవ్వరికీ తెలియని రహస్యం.
ఇక పరమేశ్వర్ నారాయణ్ హక్సర్ గురించి కాస్త చెప్పుకోవాలంటే… ఆయనో ఐఎఫ్ఎస్ అధికారి. నేటి పాకిస్థాన్ లోని గుజ్రాన్ వాలాలో.. కశ్మీరీ పండిట్స్ కుటుంబంలో పుట్టిన కమ్యూనిస్ట్ భావజాలమున్న వ్యక్తి. సైద్దాంతికంగా అంతంత మాత్రమే పొసిగినా.. ఇందిరాగాంధీతో సన్నిహితుడిగా మెదిలినవాడు. సంస్కృతం తెలిసిన పండితుడు. అలహాబాద్ నుంచి ఎమ్మెస్సీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి పొలిటికల్ ఎకనామీలో పట్టా పొందినవాడు. ఐఎఫ్ఎస్ కు సెలక్ట్ అయ్యేకంటే ముందే హక్సర్ కుటుంబానికి.. నెహ్రూతో మంచి సంబంధాలుండేవి. హక్సర్ పైన కొంత యారోగెంట్ అనే ముద్రతోపాటు.. సోవియట్ యూనియన్ థింకింగ్ తో ఓ మాస్కో టూల్ లా పనిచేసేవాడనే అపవాదూ ఉండేది. 1960ల్లో ఆస్ట్రియా, నైజీరియా అంబాసిడర్ గా, లండన్ లో భారత డిప్యూటీ హై కమిషనర్ హోదాలోనూ పనిచేశాడు. 1930ల కాలం నుంచే ఇందిరాగాంధీతో.. హక్సర్ కు పరిచయముండేది. అయితే, ఎప్పుడైతే.. ఎల్. కే. ఝాను ఆర్బీఐ గవర్నర్ గా పంపించాలనుకున్నారో.. అదిగో అప్పుడు ఇందిర హక్సర్ ను ప్రధాన మంత్రి సెక్రటేరియట్ కార్యదర్శిగా నియమించుకుంది.
1967లో హక్సర్ బుర్రలో ఉదయించిన టెన్ పాయింట్స్ అజెండానే.. కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది. ఫ్రీడమ్, పేదలకు గూడు, కూడు, గుడ్డ, జాతివివక్షనంతమొందించడం, క్రైమ్ రేట్ తగ్గించడం, యుద్ధవాతావరణానికి స్వస్తి పలకడం వంటి పది పాయింట్స్ తో రూపొందించుకున్న ఎజెండా హక్సర్ ను మరింత నమ్మకస్తుడిగా మార్చింది. అలాగే, బ్యాంకులపై సామాజిక నియంత్రణ, బీమా జాతీయీకరణ, ఎగుమతులు, దిగుమతుల నియంత్రణ, వినియోగదారులకు సహకార సంస్థల ఏర్పాటు, కార్పోరేట్ గుత్తాధిపత్యంపై నియంత్రణ, ప్రజల కనీస అవసరాలపై దృష్టి పెట్టడం, పట్టణ భూపరిమితి, గ్రామీణ ప్రాంతాల్లో భూసంస్కరణలు, మాజీ పాలకులకు ప్రత్యేక హక్కులు, అవార్డ్స్ ఇవ్వడం వంటి ఎన్నో అంశాలకు తెరతీసిన వ్యక్తి హక్సర్. అప్పటివరకూ మూగబొమ్మ అని జనంలో ముద్రపడ్డ ఇందిరాగాంధీ.. ఐరన్ లేడీగా అవతరించడం వెనుకైనా.. గరీబీ హఠావో నినాదాన్ని భుజానికెత్తుకుని ఉద్యమించడంలోనైనా హక్సర్ దే కీలకపాత్ర. అలా ఇందిరకు ఓ తత్వవేత్త, వ్యూహకర్త, మార్గదర్శి, సలహాదారుగా వ్యవహరించడంతో పాటు.. ఎఫెక్టివ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా పేరు తెచ్చుకున్నాడు హక్సర్.
అయితే, పేరుకే ఇందిర ప్రధాని కానీ… హక్సర్ ఒక సమాంతర ప్రభుత్వాన్నే నడిపాడు. దాంతో కేంద్ర మంత్రుల మాటలకూ పెద్దగా విలువ దక్కేది కాదు. కొన్ని ప్రభుత్వ శాఖల స్వయం ప్రతిపత్తి కూడా దెబ్బతింది. మొత్తంగా ప్రధానమంత్రి సెక్రటేరియట్ అనేది.. హక్సర్ నేతృత్వంలో ఓ సమాంతర ప్రభుత్వంలా వ్యవహరించింది. 1971లో బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో మాత్రం ఆ హక్సర్ కమాండింగే…. సమన్వయం కోసం, సంక్షోభ నిర్వహణ కోసం అద్భుతంగా పనిచేసింది. మొత్తంగా ప్రధానమంత్రి సెక్రటరీగానే పరిమితమవ్వకుండా.. హక్సర్ ఓ థింక్ ట్యాంక్ గా మారాడు. అప్పటివరకూ సెక్రటరీగా మాత్రమే ఉన్న హక్సర్.. ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రమోషన్ కూడా పొందాడు.
ఇదిగో ఇప్పుడే మూడోవాడు పృథ్వీనాథ్ ధర్ ఎంటరయ్యాడు. పీ.ఎన్. ధర్ కూడా కశ్మీరీ పండిట్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినవాడే. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ ఫౌండర్. భారత ప్రభుత్వంచే పద్మవిభూషణ్ అవార్డ్ అందుకున్న ఆఫీసర్.
విదేశాంగ, రక్షణ, వ్యూహాత్మక వ్యవహారాల్లో హక్సర్ కు ఉండే బలమైన నమ్మకాలనేవి… ఎకనామికల్ మేనేజ్ మెంట్ పాలసీకి విఘాతం కల్గించేలా మారుతుండేవి. ఆ గ్యాపే హక్సర్ కు… తనలాగే మరో కశ్మీరీ పండిటైన పృథ్వీనాథ్ ధర్ రూపంలో ఎదురుదెబ్బైంది. ఓవైపు హక్సర్ ప్రధానమంత్రి సెక్రటేరియట్ లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండగానే.. అప్పటివరకూ ఇందిరాగాంధీ ఆర్థిక సలహాదారుగా ఉన్న ధర్ మరోవైపు సెక్రటరీగా వచ్చి చేరాడు.
బంగ్లాదేశ్ విముక్తి తర్వాత జరిగిన నాటి సిమ్లా చర్చల్లో.. హక్సర్ కూ, ధర్ కూ మధ్య విభేదాలు పొడచూపాయి. కాల్పుల విరమణ రేఖ అనేది అంతర్జాతీయ నిబంధనలకనుగుణంగా సరిహద్దుగా ఉండాలని ధర్ పట్టుబట్టగా.. దాన్ని హక్సర్ విభేదించాడు. హక్సర్ కు ప్రాక్టికల్ గా ఫీల్డ్ లెవల్ లో కాకుండా.. కొంత సైద్ధాంతిక ధోరణిలో ఆలోచించే తత్వం ఆయనకు మైనస్ గా మారింది. దానికి తోడు ఆయన్ను వ్యతిరేకించేవారి సంఖ్య పెరగడం.. అలాగే, సంజయ్ గాంధీకి కూడా హక్సర్ నచ్చకపోవడంతో.. ఇందిరాగాంధీ హక్సర్ ను ఏకంగా ప్రణాళికా సంఘానికి పంపించేసి.. ఆయన స్థానే ధర్ ను నియమించింది.
బంగ్లాదేశ్ రూపంలో ఎదురైన సంక్షోభాన్ని హ్యాండిల్ చేయడంలో.. ఇందిర తెగువ, పాలనా చతురతను.. ధర్ ఎంతో మెచ్చుకునేవారు. ఇందిరాగాంధీ ది ఎమర్జెన్సీ, అండ్ ఇండియన్ డెమోక్రసీ పేరిట.. తన జ్ఞాపకాలను పుస్తక రూపంలో పూసగుచ్చిన ధర్… సిమ్లా చర్చల విషయంలోనూ తనను ఒంటరిగా వదిలేసి.. తాను లేకుండా జరిపిన చర్చల వల్ల జరిగిన నష్టానికీ బాధపడ్డట్టు పేర్కొన్నారు. బంగ్లాదేశ్ తో పాటు.. అనేక ద్వైపాక్షిక ఒప్పందాలపై పాక్ తో జరిగిన చర్చలపై ధర్ పూర్తిగా సంతృప్తిని వ్యక్తపర్చలేకపోయాడు. ఇక ఎమెర్జెన్సీని కూడా ధర్ విభేదించాడు. దాని వల్ల గవర్నమెంట్ ఇనిస్టిట్యూషన్స్ మరింత బలహీనపడతాయని.. జయప్రకాష్ నారాయణ్ వంటివారి ఉద్యమాలు.. అప్పటివరకూ ఉన్న చట్టసభల గౌరవాన్ని తగ్గించేందుకు కారణమవుతాయనీ బాధపడ్డారు. ఒకానొక సమయంలో ధర్… చట్టసభలనుద్ధేశించి బీ.ఆర్. అంబేద్కర్ చెప్పిన ఓ కీలక మాటలను ప్రస్తావించారు. రాజ్యాంగ నైతికత అనేది సహజంగా వచ్చేది కాదని.. దాన్ని ఎంత సాగు చేస్తే అంత బాగా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతుందని.. భారత్ లో రాజ్యాంగం కేవలం పైన వేసిన డ్రెస్ లాంటిదేనని.. లోపలంతా అప్రజాస్వామికమైన చర్యలే నడుస్తున్నాయంటూ చురకలంటించారట ధర్.
మొత్తంగా ఇద్దరు సివిల్ సర్వెంట్స్.. ఒక నాన్ సివిల్ సర్వెంట్.. ముగ్గురూ కలిసి ఇందిర వెనుక ఎలా కీలకంగా వ్యవహరించారు.. ముగ్గురికి ముగ్గురు ఒకరినుంచి మరొకరు ప్రొఫెషనల్ కాంప్టీషన్ లో ఎలా పదవులందుకుని పీఎం సెక్రటేరియట్ కార్యదర్శులుగా తమ ఉనికిని చాటుకున్నారు.. మొత్తంగా ఇందిర సమయంలో కశ్మీరీ పండిట్ల మాఫియాగా కూడా ఎలా ముద్రపడ్డారో.. గత రోజులను మెమరైజ్ చేసేందుకే ఈ కథనం…. (Article By రమణ కొంటికర్ల) ( ది ప్రింట్ సౌజన్యంతో)
Share this Article