బీఆర్ఎస్ పాలన మొత్తం అవినీతి మయమే… ఈ మాట అనడానికి శషభిషలు అక్కర్లేదు… రేవంత్ ప్రభుత్వం తవ్వేకొద్దీ బయటపడుతున్న అక్రమాలు మొత్తం తెలంగాణ సమాజాన్ని విస్తుపరుస్తున్నాయి… ఇలాంటి నాయకులనా పదేళ్లు మోసింది అనే ఓ విస్మయం… ఆబగా ఒక్కొక్క నాయకుడూ, ఒక్కొక్క అధికారీ జనాన్నే కాదు… వనాల్ని కూడా దోచుకున్నారు… ఇది అదే… మొన్న చెప్పుకున్నట్టు రేవంత్ ఐదేళ్లపాటు తవ్వినా సరే బీఆర్ఎస్ తాలూకు బాగోతాలు ఇంకా బయటపడుతూనే ఉంటాయి…
ఈ తాజా వార్త ఏమిటంటే..? ‘‘బీఆర్ఎస్ హయాంలో జరిగిన రూ. వందల కోట్ల విలువైన అటవీ భూముల దురాక్రమణ భాగోతం వెలుగులోకి వచ్చింది. ఒకవైపు అడవులు పెంచుతామంటూ హరితహారం చేపడుతూనే మరోవైపు రియల్ వ్యాపారులకు వత్తాసు పలుకుతూ ప్రభుత్వం అటవీ భూములకు ఎసరుపెట్టింది. ఇటీవల కొంపెల్లి అటవీ భూములకు సంబంధించి సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పుతో భూదందాలో కొత్త కోణం బయట పడింది… (సంతోష్ సహా ఒకరిద్దరు సెలబ్రిటీలు అడవుల్ని దత్తత తీసుకున్నారు కదా, దాని వెనుక ఏం కథలున్నాయో…)
భూపాలపల్లి జిల్లా కొంపెల్లిలో ఏకంగా 106 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసేందుకు అప్పటి బీఆర్ఎస్ లీడర్లు, అధికారులు కలిసి ఆడిన నాటకం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది.
Ads
దాదాపు రూ.380 కోట్ల విలువైన అటవీ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేలా గత ప్రభుత్వం పథకం ప్రకారం పావులు కదిపింది. అటవీ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ.. ఏకంగా కబ్జాదారులకు అనుకూలంగా సుప్రీంకోర్టుకు అప్పుడు నివేదికలు ఇచ్చింది.
ప్రభుత్వ భూములను కాపాడాల్సిన హోదాలో ఉన్న భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కబ్జాదారులతో చేతులు కలుపటం, వారికి లబ్ధి చేసేందుకు ఏకంగా సుప్రీం కోర్టులో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయటం ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అత్యంత విలువైన అటవీ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేలా తప్పుడు నివేదికలిచ్చిన బాధ్యులపై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సుప్రీం తీర్పునకు అనుగుణంగా బాధ్యులైన అధికారులపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈ వ్యవహారం ఎవరి మెడకు చుట్టుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది.
భూపాలపల్లి జిల్లా కొంపల్లి గ్రామ పరిధిలో రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న 106 ఎకరాల భూమిపై హక్కులు తనవేనని ఇరవై ఏళ్ల కిందటే ప్రైవేటు వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. 1994లోనే వరంగల్ ఉమ్మడి జిల్లా కోర్టు అటవీ శాఖకు అనుకూలమైన తీర్పునిచ్చింది. తర్వాత ఆక్రమణదారుడు హైకోర్టును ఆశ్రయించినప్పటికీ అదే తీర్పు వెలువడింది. 2021లో బీఆర్ఎస్ హయంలో ఈ కేసుపై హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలైంది. దీని ప్రకారం అప్పుడు ప్రైవేటు వ్యక్తికి చెందిందని తీర్పునిచ్చింది. అటవీ శాఖ పట్టించుకోకపోవటంతో ఆక్రమణదారుడు తిరిగి కంటెప్ట్ ఆఫ్ కోర్టు కూడా దాఖలు చేశారు.
ఈ వ్యవహారంపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ అటవీ శాఖ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దానికి భిన్నంగా అక్కడి జిల్లా కలెక్టర్ ప్రభుత్వ అనుమతి లేకుండానే సుప్రీంకోర్టులో రిజాయిండర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ భూమి సదరు ప్రైవేటు వ్యక్తికి చెందుతుందని, హైకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుకూలంగా ఈ అఫిడవిట్ తయారు చేసి సమర్పించారు. (ఈ ఐఏఎస్ విషయంలో రేవంత్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి…)
రెండు ప్రభుత్వ విభాగాలు పొంతన లేకుండా భిన్నమైన అఫిడవిట్లు సమర్పించటంపై అభ్యంతరం తెలిపిన సుప్రీంకోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి వివరణ కోరింది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తన దృష్టికి వచ్చిన ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వెంటనే సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయించి.. కేసు గెలిచేంత వరకు న్యాయపోరాటం చేయాలని అధికారులను ఆదేశించారు.
సీఎం జోక్యంతో సుప్రీంకోర్టులో జిల్లా కలెక్టర్ సమర్పించిన అఫిడవిట్ ఉపసంహరింపజేశారు. ఈ భూమి రిజర్వు ఫారెస్ట్ కు చెందినదేనని ఫిబ్రవరి 8 వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు రెండు రోజుల కిందట ఈ కేసులో తీర్పు వెలువరించింది. ఈ భూమి అటవీ శాఖకు చెందుతుందని స్పష్టం చేసింది.
ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా అఫిడవిట్లు దాఖలు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత ప్రభుత్వం చర్యలను ఖండించిన సుప్రీంకోర్టు ఆక్రమణదారుకు, ప్రభుత్వానికి రూ.5 లక్షల జరిమానా విధించింది.
ఆక్రమణదారులతో చేతులు కలిపిన అధికారులపై విచారణ జరిపి, వారి నుంచి జరిమానాను రికవరీ చేసుకోవడానికి కూడా ఎలాంటి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
ఈ వ్యవహారంలో ఒక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఒత్తిడితోనే జిల్లా కలెక్టర్, రెవిన్యూ అధికారులు ఆక్రమణదారులతో చేతులు కలిపి తప్పుడు నివేదికలు తయారు చేసినట్లు చర్చ జరుగుతోంది. తమకు అడ్డు లేకుండా, కోరినట్లు నివేదికలు తయారు చేయించేందుకు అప్పట్లోనే ఇద్దరు డీఎఫ్వోలను కూడా రాజకీయ జోక్యంతో బదిలీ చేయించినట్లు సమాచారం..’’
Share this Article