Sai Vamshi…… అమావాస్య – క్షుద్ర నమ్మకాలు…. పగలు కంటే రాత్రి చాలా బాగుంటుంది. ఇదేదో సరదాగానో, శృంగారాత్మకంగానో అంటున్న మాట కాదు. రాత్రిలో ఉన్నంత ప్రశాంతత, స్వేచ్ఛ పగటి వేళ దొరకడం కష్టం. నేను రాసిన 12 కథల్లో 11 కథలు రాత్రి పూట రాసినవే! వందల FB పోస్టులు అర్ధరాత్రికాడ రాసినవే! Night Shift ఉద్యోగాలు చేసే ఎవరినైనా అడిగి చూడండి, ‘మీకు చీకటంటే భయమా?’ అని. ఒక నవ్వు నవ్వి ఊరుకుంటారు. అంతగా చీకటితో సహవాసం చేయడం వారికి అలవాటై ఉంటుంది.
ఆరు నెలల కిందట, ఒక రోజు రాత్రి రెండింటికి ఆఫీసు నుంచి వస్తూ ఉంటే మూల మలుపు దగ్గర సడెన్‌గా విస్తరాకులో నిమ్మకాయలు, కుంకుమ, పసుపు కనిపించింది. అప్పుడప్పుడూ రైలు పట్టాల దగ్గర అలాంటివి చూసి ఉన్నాను కానీ, అంత బాహాటంగా అందరూ తిరిగే రోడ్డు మీద అలా కనిపించడం చూసి ఒక్క క్షణం షాక్ తిన్నాను. అక్కడ అవి పెట్టి ఎక్కువసేపు అయి ఉండదు అనిపించింది.
భయం వేయలేదు కానీ, ఇబ్బందికరంగా అనిపించింది. నా రూంకి వెళ్లాలంటే ఇంకో ముఫ్ఫై అడుగుల దూరం వెళ్లాలి. ఆలోపు ఎవరైనా వస్తే, అవి నేనే పెట్టాను అనుకునే ఛాన్స్ ఉంది. ఆ ఊహ చాలా వరస్ట్‌గా అనిపించి, అటూఇటూ చూశాను. ఎవరూ లేరు. టకటకా నడిచి రూంకి వచ్చేశాను. డ్రెస్ మార్చుకుని నేనున్న మూడో అంతస్తు నుంచి కిందకు చూస్తే ఆ నిమ్మకాయలు, కుంకుమ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Ads
‘ఇవి క్షుద్ర పూజలు కావు’ అనేది నాకొచ్చిన ఫస్ట్ ఆలోచన. బహూశా ‘అమ్మోరు’ సినిమాలోలాగా ఆ నిమ్మకాయల పక్కన పిండితో చేసిన బొమ్మ లేకపోవడం వల్ల ఆ థాట్ వచ్చి ఉండొచ్చు. పైగా అంత నడిరోడ్డు మీద కూర్చుని పూజలు చేసేంత సీన్ ఎంత మంత్రాలొచ్చిన మాంత్రికుడికైనా సాధ్యం కాదు. ఎవరైనా చూస్తే వీపు వాయిస్తారు. నిగనిగలాడే నిమ్మకాయలు, పక్కన పసుపు, కుంకుమ చూస్తూ ఉన్నాక కొంచెంసేపటికి అది నార్మల్ అయిపోయింది. అదేదో వింతగా తోచడం మానేసి, అతి మామూలు విషయంలా కనిపించింది.
కొడుకు ఆరోగ్యం కోసమో, కూతురి దోషం పోవాలనో ఎవరో ‘చదువుకున్న’ అమాయక తల్లిదండ్రులు తీసిన దిష్టి అయ్యుంటుందని తోచింది. ఆరోజు అమావాస్య అనేది గుర్తొచ్చింది. (జిల్లా స్థాయి జర్నలిస్టులకు ముఖ్యమైన తిథులు గుర్తుంటాయి. కారణం ఆ రోజు చదివే పూజల వార్తలు). నేను వెళ్లి పడుకున్నాను. పొద్దున్నకి ఆ నిమ్మకాయలు లేవు. విస్తరాకు మాత్రం పక్కన కాలువలో ఉంది. ఊడ్చేశారో, ఏ కుక్కలైనా ఎత్తుకెళ్లాయో తెలియదు.
‘దేవుడు ఉన్నట్టే దెయ్యం ఉంటుంది’ అనే ‘అరుంధతి’ సినిమా డైలాగులు మనకు వినిపించినంత కాలం ఈ అమావాస్య పూజలు ఆగవు. టెన్త్ క్లాస్ పాసవ్వడానికి కొడుకు చేత శనిదేవుడికి తైలాభిషేకాలు చేయించే అమ్మానాన్నలు ఉన్నంత కాలం ఈ నిమ్మకాయల పూజలు ఆగవు. బోలెడంత ప్రోటీన్ ఉండే గుమ్మడికాయని ఇంటి గృహప్రవేశాలకు పగులగొట్టే కూష్మాండ బలి సంస్కృతి ఉన్నంతకాలం దిష్టి మూటలు ఆగవు. ఆరో అంతస్తులో ఉన్న ఇంటి గృహప్రవేశానికి ఆవును బలవంతంగా తోలుకెళ్లే జంతు ప్రేమికులు ఉన్నంతకాలం ఈ దారుణాలు ఆగవు. కొత్త బండి చక్రాల కింద నిమ్మకాయలు తొక్కించే ఆచారం ఉన్నంత కాలం ఇవేవీ ఆగవు.
నేను హేతువాదం మాట్లాడటం లేదు. చేజేతులా మనం నాశనం చేస్తూన్న పంట ఉత్పత్తులు, హింస పెడుతున్న జంతువుల గురించి మాట్లాడుతున్నాను. దిష్టి అనేది ఇవాళ అతి పెద్ద Commerical Market. దాని చుట్టూ కోట్ల వ్యాపారం నడుస్తోంది. హైదరాబాద్, బెంగళూరు లాంటి పట్టణాల్లో ఒక్కరోజు పొద్దున్నే నిమ్మకాయలు, గుమ్మడికాయలు దొరక్కపోతే జనం యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది. ఆవు దొరకలేదని గృహప్రవేశాలు, ముహూర్తం దొరకలేదని బండి రిజిస్ట్రేషన్లు ఆపే జనాలు మన చుట్టూ ఉన్నారు. మనలో కూడా ఉన్నారు. మనమై ఉన్నారు.
జయహో నిమ్మకాయలు!
జయహో గుమ్మడికాయలు!
జయహో ముహూర్తాలు!
PS: ‘అంతా విధి రాత! జరిగేది జరక్క మానదు’ అనే కాన్సెప్ట్‌ని ఏ నిమ్మకాయ, గుమ్మడికాయా ఆపలేకపోవడం వింత!
Share this Article