Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మనసున్నోడు… సాఫ్ట్‌వేర్ వదిలాడు… సొసైటీ కోసం కదిలాడు…

April 21, 2024 by M S R

ఒక దృశ్యం ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను కలిచివేసింది… ఒక ఉత్పాతం తన ఉద్యోగాన్నే వదిలేసేలా చేసింది… వ్యవసాయాన్ని నమ్మిన వేలాది మంది గ్రామాల నుంచి ఇతర పట్టణాలకు వలస బాట పట్టడం అతడి దృక్పథాన్నే మార్చేసింది. అందుకు కారణమైంది 2018 నవంబర్ లో తమిళనాడులో వచ్చిన గజ తుపానైతే… అత్యధిక వేతనంతో దుబాయ్ లో సాఫ్ట్ వేర్ డెవలపర్ ఉద్యోగాన్ని వదులుకున్న ఆ వ్యక్తే నిమల్ రాఘవన్.

తమిళనాడు తంజావురు జిల్లా నదియంలో జన్మించిన నిమల్ రాఘవన్ మానవీయ హృదయాలకు ఓ ఇన్స్పైరింగ్ స్టోరీ.

గజ తుపాన్ అనంతరం నిమల్ రాఘవన్ తన ఊరిని సందర్శించాక.. అతడి మనస్సు చలించింది. కావేరీ డెల్టా ప్రాంతమంతా అతలాకుతలమైన ఆ బీభత్సమైన దృశ్యాలు అతడిలో మానవత్వాన్ని తట్టిలేపాయి. ఆ తుపాన్ ధాటికి ఆ ప్రాంతంలో 45 మంది మృత్యువాత పడగా.. లక్షకు పైన ఇళ్లన్నీ ఛిన్నాభిన్నమైన ఒక ప్రాకృతిక ధ్వంసరచనే జరిగింది.

Ads

తుపాన్ ధాటికి అల్లకల్లోలమైన 90 గ్రామాల్లో తన స్వగ్రామం నదియం కూడా ఉండటంతో… తట్టుకోలేని రాఘవన్ ఒకింత షాక్ కు గురయ్యాడు. 2018లో తమిళనాడులో గజ తుపాన్ మిగిల్చిన భీతావహ దృశ్యాలు వైరల్ గా మారాయి. దాంతో.. నిమల్ రాఘవన్ స్నేహితులు కూడా స్పందించారు. దుబాయ్ వదిలి వారు కూడా నదియం గ్రామానికి వచ్చేందుకు సిద్ధపడ్డారు. కళ్లల్లో మెదులుతున్న తమిళనాడు సైక్లోన్ టెర్రర్ విజువల్స్.. లక్షణంగా ఉద్యోగాలు చేస్తూ లక్షలు సంపాదిస్తున్న వారి దోస్తుల మనసులే మార్చేశాయంటాడు రాఘవన్. పిటీ ఏంటంటే… వ్యవసాయంపైనే ఆధారపడే గ్రామాలకే ఎక్కువ నష్టం వాటిల్లింది. రైతులు కూలీలుగా మారాల్సిన దైన్య స్థితి ఏర్పడింది. పనులు దొరక్క పట్టణాల బాట పట్టాల్సి వచ్చింది.

ఆ దృశ్యం ఇక నిమల్ రాఘవన్ ను దుబాయ్ కోసం ముందడుగు వేయనీయలేదు సరికదా… తన గ్రామంతో పాటు, చుట్టపక్కల గ్రామాల వారికీ ఏదైనా చేయాలనుకున్నాడు. రాజులా బతికిన రైతును మళ్లీ తమ కాళ్లపై తమను నిలబెట్టాలనుకుని సంకల్పించాడు. ఇంకేం.. లక్షల రూపాయల జీతాన్నీ తోసిరాజని దుబాయ్ లో సాఫ్ట్ వేర్ డెవలపర్ ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు నిమల్ రాఘవన్.

మరి తర్వాత కింకర్తవ్యం..?

మొట్టమొదట చెరువుల పునరుద్ధరణపై దృష్టి సారించాడు నిమల్ రాఘవన్. 208-19 మధ్య వారి ఊరితో పాటు.. చుట్టుపక్కల ఊళ్లకు సాగునీటికి అనుకూలంగా ఉండే పెరావూరాణి సరస్సును పునరుద్ధరించాడు. ఆ చెరువు వల్ల చుట్టపక్కల 6 వేల ఎకరాలకు పైగా వ్యవసాయ భూమికి నీరందేలా చేశాడు. తనలాంటి భావసారుప్యత కల్గిన వాలంటీర్లను తనతో పాటు జత చేసుకున్నాడు. అలా కావేరీ డెల్టా ప్రాంతం మొత్తం 25 వేల మొక్కలను నాటి.. పర్యావరణ పరిరక్షకుడిగా రూపాంతరం చెందాడు సాఫ్ట్ వేర్ డెవలపరైన రాఘవన్.

సరస్సులను పునరుద్ధరించడం.. రైతుల జీవితాలను బాగుచేయడమంటే మాటలు చెప్పినంత వీజీ కాదు. లోతైన ప్రణాళిక ఎంత ముఖ్యమో.. ఏ పని చేసినా అందుకు డబ్బు అవసరం. స్వతహాగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావడంతో.. తనకున్న సాంకేతిక విజ్ఞానాన్నీ జోడించి… తన ప్రయత్నం తొలి దశలో #BounceBackDelta హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియా ప్రచారం మొదలుపెట్టాడు. తుపాన్ వల్ల నష్టపోయినవారికి బట్టలు, ఇతర గృహావసరాలు, కావల్సిన డబ్బు వంటివి సాయం చేయడానికి ఈ ప్రచారం రాఘవన్ ప్రాజెక్టుకు తోడ్పడింది.

అయితే, రాఘవన్ అనే ఓ యువకుడు తన విదేశంలో తన సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని పూచికపుల్లలా పక్కనపెట్టేసి… తన గ్రామం కోసం, చుట్టుపక్కల ఊళ్ల కోసం తిరిగి వచ్చిన స్ఫూర్తి మామూలు ప్రేరణగా మిగిలిపోలేదు. మరింతమంది యువకులు రాఘవన్ లా తయారయ్యారు. నదియం గ్రామం నుంచే ఆ ముందడుగూ ప్రారంభమైంది. దాంతో వారంతా కలిసి రాఘవన్ తరహాలోనే.. #DeltaSaplingChallenge అనే హ్యాష్ ట్యాగ్ తో మరో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అలా ఆ ప్రాంతంలో తుపాన్ ధాటికి ధ్వంసమైన వృక్షసంపదను తిరిగి పొందేందుకు నడుం బిగించారు.

అయితే, తన నదియం గ్రామం వరకే ఈ పనులన్నీ చేసినా నిమల్ రాఘవన్ కు గుర్తింపు దక్కేది. కానీ, రాఘవన్ చేస్తున్నది గుర్తింపు కోసం కాదు కదా..? అందుకే చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగాడు రాఘవన్. రైతులతో మాట్లాడాడు. వారి సమస్యలన్నింటినీ సామరస్యంగా విన్నాడు. ప్రతీచోటా నీటి లభ్యత ప్రధాన సమస్యగా మారిందని అర్థం చేసుకున్నాడు. అప్పటివరకూ ప్రభుత్వం స్పందించకపోవడంతో తానే నడుం బిగించాడు. తన మిత్రబృందంతో పాటు… గ్రామస్థులు, ఇతర శ్రేయోభిలాషులు అందించిన ఆర్థిక సహకారంతో 32 లక్షలు సమకూరితే.. వాటితో సరస్సును పునరుద్ధరించాడు. ఆ లెక్క అక్కడికి సరిపోయింది. కానీ, మిగిలిన చుట్టుపక్కల గ్రామాలకు సాగునీరందాలంటే ఏంచేయాలి..?

సవాళ్లను స్వీకరించి.. మున్ముందుకు

తన ముందున్న ఛాలెంజ్ ను స్వీకరించిన నిమల్ రాఘవన్.. మిగిలిన గ్రామాల్లోనూ సాగునీటి సమస్య లేకుండా.. రైతులు వలస వెళ్లకుండా ఏంచేయాలనే ఆలోచనతో అడుగులు ముందుకేశాడు. రైతుల విషయాల్లో ఏ ఏ సంస్థలు పనిచేస్తున్నాయి. ఎక్కడ తనకు సాయం దొరుకుతుందో ఆరా తీశాడు. అలా కైఫాగా షార్ట్ కట్ లో పిల్చుకునే కడైమడై ఏరియా ఇంటిగ్రేటెడ్ ఫార్మర్స్ అసోసియేషన్, బయోటాసాయిల్ ఫౌండేషన్, ఎక్స్ నోరా ఇంటర్నేషనల్, ఊర్ కుడి ఊరని కాప్పోమ్, నామ్ తమిరబరాణితో పాటు.. మెగా ఫౌండేషన్ వంటి అనేక సంస్థల్లో భాగస్వామయ్యాడు.

ఈ సంస్థలన్నీ తమిళనాడుతో పాటు.. మహారాష్ట్రకు చెందినవి. ఈ సంస్థల ప్రధాన కార్యకలాపాల్లో నీటి వనరుల పునరుద్ధరణ, మియావాకీ తోటల పెంపకం, మడ అడవులు, తోటల పెంపకం, సంరక్షణ, వర్షపు నీటి సేకరణ, నీటి శుద్ధి వంటివెన్నో కార్యక్రమాలుండగా.. ఇవన్నీ ఇప్పుడు ఒకనాటి సాఫ్ట్ వేర్ డెవలపరైన నిమల్ రాఘవన్ కనుసన్నల్లో గ్రామాలు, పర్యావరణ ప్రగతికై పనిచేస్తున్నాయి. ఇన్ని సంస్థలతో భాగస్వామైన రాఘవన్ నేతృత్వంలో ఇప్పుడు రైతులు, మత్స్యకారులు అభ్యున్నతి వైపు పయనిస్తుండగా.. తాగు, సాగునీటి సమస్య తీరింది. పశువులకూ నీరు అందుబాటులోకొచ్చింది. మొత్తంగా జీవజాతుల వైవిధ్యం వైపు నిమల్ రాఘవన్ బృందం పయనిస్తోంది.

రాఘవన్ సారథ్యంలో బాగుపడ్డ గ్రామాల్లో పునురుద్ధరింపబడ్డ నీటి వనరులతో సుమారు 40 లక్షల మంది ప్రజలకు మేలు చేకూరింది. ఇలా తమిళనాట మొత్తం 118 నీటి వనరులకు ఒక రూపిచ్చి… ఎందరి పాలిటో అపర భగీరధుడయ్యాడు. తాను కళ్లతో చూసి చలించిన బంజర్ భూములు ఇప్పుడు వ్యవసాయయోగ్య భూములై పంటల నెలవవ్వడం కన్నా సంతోషం.. తనకు ఎయిర్ కండిషన్డ్ కార్యాలయాల్లోని సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ లో కనిపించలేదంటున్నాడు రాఘవన్.

అయితే, రాఘవన్ తన కావేరీ డెల్టా వరకే తన పని అయిపోందని భావించడం లేదు. అవసరముంటే తననెక్కడైనా వినియోగించుకోవచ్చనీ.. తన కార్యాచరణను దేశంలోని మరిన్ని గ్రామాలకు విస్తరించాలన్నదే తన తపన అంటాడు. నీటి కష్టాల వల్ల రైతెప్పుడూ నష్టపోకూడదన్నదే రాఘవన్ మెయిన్ మోటో.

నీటి సంరక్షణ, హార్వెస్టింగ్, పునరుజ్జీవనం, నీటి వనరుల పునరుద్ధరణ, నీటి సంక్షోభ నిర్వహణ, నీటి ప్రణాళిక, మురుగునీటి శుద్ధి, మడ అడవుల పెంపకం, రక్షణ వంటి పర్యావరణ, ఫార్మర్ యుటిలిటీ పనులెన్నింటికో… ఇప్పుడో మార్గదర్శై నిలుస్తున్న ప్రజాసేవకుడు నిమల్ రాఘవన్…….. (Article By రమణ కొంటికర్ల…) 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions