ఆంధ్రప్రదేశ్… యు.కొత్తపల్లి మండలం… మూలపేట గ్రామం… ఆచెల్ల సూర్యనారాయణమూర్తి శర్మ అనే పురోహితుడు ఒక పెళ్లి జరిపించడానికి వెళ్లాడు… అక్కడ కొందరు ఆకతాయిలు తనను అవమానిస్తూ, రకరకాల గేలి చేస్తూ… తలపై ఓ సంచీ బోర్లించారు… పసుపు, కుంకుమలు నెత్తి మీద పోశారు… వాటర్ పాకెట్లు చల్లారు… చేతికందినవి ఆయన మీదకు విసిరేశారు… ఇదీ సంఘటన…
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది… సహజంగా బ్రాహ్మణ వ్యతిరేకత బాగా జీర్ణించుకున్న వ్యక్తులు ఆనందంతో కామెంట్లు పెడితే, మిగతావాళ్లు ఆగ్రహం పోస్టులు పెట్టారు… పోలీసులేమో మాకు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు… బీజేపీ నాయకురాలు సాదినేని యామిని శర్మ ట్విట్టర్‌లో దీన్ని ఖండిస్తూ ఓ ట్వీట్ కొట్టింది… దిగువన చూడండి…
https://twitter.com/YaminiSharma_AP/status/1781327334311915771?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1781327334311915771%7Ctwgr%5Ed69b94e40b747b78c791c84033d25ac70dd21bb8%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-21791798353622208634.ampproject.net%2F2404021934000%2Fframe.html
Ads
నిజంగానే ఇది దుశ్చర్య… ఒక వృత్తిని అవమానించడం… ఒక వ్యక్తిని అవమానించడం… ఇదంతా జరుగుతుంటే అక్కడున్న ఎవరూ సంబంధిత ఆకతాయిలను మందలించకపోవడం ఆశ్చర్యం కలిగించింది… పెళ్లి జరిపించడానికి పిలిపించుకున్న సంబంధిత వధూవరుల తల్లిదండ్రులు, బంధువులే కాదు, అక్కడికి వచ్చిన ఆహుతుల్లో కూడా ఎవరూ కల్పించుకోలేదు… అంటే ఈ దాడిని ఆమోదిస్తున్నట్టా..? మరెందుకు ఆ పెళ్లికి పురోహితుడు కావాలి..? హిందూ మత పద్ధతి ప్రకారం వివాహతంతు ఎందుకు కావాలి..?
ఇదే వేరే వృత్తులను గానీ, వేరే వ్యక్తులను గానీ ఇలా అవమానిస్తే ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో రచ్చ రచ్చ రేగేది… ఆ వృత్తికి అవమానం జరిగితే విశ్వహిందూపరిషత్, అక్కడక్కడా ఒకరిద్దరు బీజేపీవాళ్లు తప్ప మరెవరూ స్పందించినట్టు కనిపించలేదు… వైసీపీ స్పందిస్తుందని అనుకోలేం, టీడీపీ కూటమి కూడా లైట్ తీసుకుంది… సో, ఆ వృత్తికి, ఆ కులానికి ఏ అవమానం జరిగినా పర్లేదా..?
నిజమే, పోలీసులకు ఫిర్యాదు చేయలేదు… చేసినా ఒరిగేదేముంది..? కేసులు పెట్టినా ఏం సెక్షన్లు పెట్టగలరు..? పోనీ, ఆ వృత్తికి సంబంధించిన సంఘాలో, సదరు బ్రాహ్మణ కులమో, కులసంఘాలో దీన్ని ఏమైనా సీరియస్‌గా తీసుకున్నాయా..? అదీ పెద్దగా కనిపించలేదు…
బ్రాహ్మణులే కాదు, ప్రతి హిందువూ దీన్ని ఖండించాలి అని సాదినేని యామినీ శర్మ అంటోంది… హిందువులే కాదు, ఇతర మతాల వాళ్లూ ఖండించాల్సిన దురాగతమే… ప్రతి మతంలోనూ ప్రార్థనలు ఉంటాయి… మతక్రియల్ని జరిపించడానికి మతపెద్దలు ఉంటారు… ఎవరికి ఇలాంటి అవమానం జరిగినా ఖండించాలి… ఏ మతంలోనైనా సరే ఆమోదించకూడని దుశ్చర్యలు ఇవి…!
Share this Article