………………By… Gottimukkala Kamalakar ………………. ఇంకోస్సారి: కాశీనాథ్ అన్నా, విశ్వనాథ్ అన్నా శివుడే కదా..! మరి కాశీనాథుని విశ్వనాథ్ అంటే మూర్తీభవించిన పరమశివ తత్వం కామోసు..! శివ శిరోభూషణం ఐన నెలవంకకో నూలు పోగులా; మానస సరోవరం ముందు మినరల్ వాటర్ చుక్కలా వారి సినిమాలలోని పాటలూ, మాటలూ, నటులూ, పాత్రల మీద ఒక చిన్న అవలోకనా ప్రయత్నం..! అంతకాలం ఆరేసుకుంటూ, పారేసుకుంటున్న పాటలు, వారి సినిమాల్లో మనల్ని శివసమేతంగా ఆనందవృష్టి లో తడిపేసాయి. కొండకోనలు తుళ్ళిపడేట్టు చిందులేస్తున్న వానపాటలు ఆయన తలపులో ఆత్మస్నానం చేయించే స్వాతి చినుకులై, కన్నెపిల్ల మనస్సు ఆలపించిన అమృతవర్షిణులౌతాయి. నాదం ఝుమ్మంటుంది; పాదం సయ్యంటుంది. గజ్జె ఘల్లుమంటుంది; గుండె ఝల్లుమంటుంది. ఎద ఝల్లుమనిపించే మురళి ఇరుకు అపార్ట్మెంట్ ని రేపల్లె గామారుస్తుంది. నా పాటని “అవధరించి విని తరించరా..!” అంటూ సాంబశివుడికి సలహా ఇస్తుంది. వేవేలా గోపెమ్మలా; ఔరా అమ్మకచెల్లా అంటూ కృష్ణ లీలల్ని తెలియజేస్తుంది. శివతత్వాన్ని రాసులుగా అందిస్తుంది. ఒక్క ముక్కలో “సరసస్వర సుర ఝరీగమనమౌ సామ వేదసారమై” మన జీవనగీతమౌతుంది. వేటూరి సుందరరామమూర్తి; చెంబ్రోలు సీతారామశాస్త్రి గార్ల సాహిత్య గంగా ప్రవాహాన్ని మనకందించిన భగీరథులు శ్రీ విశ్వనాథ్ గారు.
జంధ్యాల మాటల విశ్వరూపం విరాట్ త్రివిక్రమ రూపంలో కేవలం విశ్వనాథ్ గారి సినిమాలలో మాత్రమే ప్రస్ఫుటంగా కనిపించి మనల్ని సహానుభూతిలో ఓలలాడిస్తాయి. అల్లు రామలింగయ్య గారు శంకరాన్ని చూసి భయపడ్డా, తిట్టినా; కమల్ పేపర్ ఆఫీస్ లో వీరంగం చేసినా దాన్ని అనుభవించాల్సిందే..! శంకరాభరణం శంకర శాస్త్రి మేధ నుండి; సాగరసంగమం పొట్టి ప్రసాద్ అమాయకత్వం వరకు; శుభసంకల్పం రాయుడి ఐశ్వర్యం నుండి సాగరసంగమం రఘు దరిద్రం వరకూ పాత్ర చిత్రణలు నభూతో ….!; అల్లు, శరత్ బాబుల లాంటి ఒక్క స్నేహితుడైనా ఉంటె బావుండని నిట్టూర్చని తెలుగువాడు ఒక్కడైనా ఉండడు. ఆ పాత్రల సృష్టిభారతంలో శ్రీ విశ్వనాథ్ గారు వ్యాసభాగవానులైతే, జంధ్యాల వినాయకుడు..! శ్రీ ఎంవీఎస్ హరనాథ రావు గారితో ఆయన రాయించిన స్వయంకృషి మాటలు కూడా అద్వితీయం. అజరామరం. శ్రీ విశ్వనాథ్ గారు గొప్ప మాటల రచయిత కూడా. ఆయన సిరిసిరిమువ్వ లో జయప్రదతో, సిరివెన్నెలలో సుహాసినితో బోల్డంత మాట్లాడించారు. సర్వదమన్ బెనర్జీకి బోల్డన్ని చూయించారు.
Ads
శ్రీ కాశీనాధుని వారి చలనచిత్రాలు బాలే లా ఉంటాయి. అవి నిస్సందేహంగా దృశ్యకావ్యాలు. సినిమాల్లో పాటలు అనవసరం అంటూనే శతధా, సహస్రధా మైమరిచిపోగల అజరామర గీతాలను వారు మనకందించారు. వారికి పాటలు “క్షార జలధులైనా మనకవి క్షీరములే కదా..!” సర్వశ్రీ కేవీ మహదేవన్; ఇళయరాజా; రమేష్ నాయుడు; విద్యాసాగర్; కీరవాణి మొదలైన లబ్దప్రతిష్టుల కీర్తి కిరీటాలలో వీరు పొదిగిన కలికితురాల్లెన్నో..! సంప్రదాయాన్ని గుండెల్లో నింపుకుని, ఛాందసాన్ని తృణీకరించే శంకర శాస్త్రి నుండి కులవృత్తికి సాటి లేదు గువ్వలచెన్నా అనుకుంటూ చెప్పులు కుట్టుకునే స్వయంకృషి సాంబయ్య దాకా; చేపల్నీ, వ్యాపారపు మెలకువల్ని ఒడిసే పట్టే దాసు దాకా, గొడ్లు కాసుకునే మాధవుడి దాకా ప్రతి కులవృత్తి సౌందర్యాన్ని చిత్రిక పట్టారు శ్రీ విశ్వనాథ్ గారు.కమల్ హాసన్‌ని సకల నాట్య సంప్రదాయాలు అవపోసన పట్టి భ్రష్టుడై వైఫల్యం చెందిన బ్రాహ్మడిగా సాగరసంగమంలో చూయించి విజయం సాధించారు. అక్షరమ్ముక్క రాకున్నా నమ్మిన వాడి వ్యాపారాన్ని విస్తరించిన బెస్త వాడిగా అదే కమల్ హాసన్‌ని శుభసంకల్పంలో చూయించి మరో విజయం సాధించారు. సూత్రధారులు సినిమాలో గంగిరెద్దులవాడితో గీతాబోధ చేయించారు; కార్మికుడి ఘర్మజలం తుడుచుకోవడానికి రుమాలు అందించారు.
Share this Article