విశాల్… ఈ పేరు వింటే ఎక్కడో ఏదో మూల, మనవాడే కదా అనే ఓ సాఫ్ట్ కార్నర్ ఉండేది ఇన్నాళ్లూ… రత్నం సినిమాతో అదంతా కొట్టుకుపోగా, ఈడెవడ్రా భయ్, ఇంత హింస పెడుతున్నాడు అనిపిస్తుంది… తనను చూస్తే జాలేస్తుంది… తిక్క సినిమాలను పదే పదే జనం మొహాన కొడుతున్నందుకు కోపమొస్తుంది… ప్రేక్షకులంటే ఎర్రి ఎదవల్లాగా ట్రీట్ చేస్తున్నందుకు అసహ్యమేస్తుంది… ఐనా సరే తనకు నిర్మాతలు పదే పదే అవకాశాలిస్తున్నందుకు నవ్వొస్తుంది… ఇకపై విశాల్ సినిమా చూస్తే మనల్ని మనమే కొట్టుకోవాలనే సంకల్పం వస్తుంది…
ఈ వ్యాఖ్య హార్ష్‌గా ఉందా..? ఆ తిక్క సినిమా చూస్తే మీకూ అలాగే ఉంటుంది… ఒక్కసారి ఒక ఫ్యామిలీ థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటే ఎంత వ్యయం, ఎంత ప్రయాస..? అలాంటిది ప్రేక్షకుల మనోభావాలతో, పర్సులతో ఇంత ఆటలాడుకుంటుంటే కోపం రాదా మరి… పైగా ప్రతి ప్రమోషన్ మీట్‌లో సినిమా ప్రముఖులందరూ ‘మా సినిమా థియేటర్‌లోనే చూడండి’ అని చిలక పలుకులు… అసలు ఓటీటీకి, టీవీకి కూడా పనికిరాని దిక్కుమాలిన సినిమాలు…
మనకు గోపీచంద్ అనబడే ఓ హీరో ఉండేవాడు, సారీ, ఉన్నట్టున్నాడు ఇంకా… సేమ్, తనూ అంతే… రొటీన్ రొట్టకొట్టుడు దంచుడు సినిమాలు… ప్రేక్షకులు మారుతున్నారు, మనమూ కాస్త మారుదాం, నాణ్యతతో సినిమా తీద్దాం అనే సోయి ఏమాత్రం ఉండదు వీళ్లకు… పైగా థియేటర్లు ఖాళీగా ఉన్నాయని ఏడుపులు… సిల్లీ కథలు, అంతకన్నా సిల్లీ ప్రజెంటేషన్లు…
Ads
రత్నం సినిమానే తీసుకొండి… ఏదో ఓ పిచ్చి కథ… పైగా అరవ అతి… సినిమా ఆరంభం నుంచీ చివరి దాకా దంచుడే దంచుడు… మాస్ అంటే ఫైట్లు మాత్రమే అనుకునే ఈ తిక్క నిర్మాత, ఈ మెంటల్ దర్శకుడు ఎవరో గానీ మీకో దండంరా బాబూ… పాటలు, సంగీతం తూతూమంత్రం… దేవిశ్రీప్రసాద్ తన అసిస్టెంటు ఎవరికో అప్పగించి, చెక్కు తీసుకుని చెక్కేసినట్టున్నాడు ఎక్కడికో…
ఒకసారి ఈ ఫైట్ల తీరు చూస్తే, ఈ సినిమా తీరేమిటో మీకే అర్థమవుతుంది…
- హీరోయిన్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది, ఓ గ్యాంగ్ అటాక్… హీరో ఎంట్రీ, ఫైట్…
- హీరోయిన్ బస్సులో ఊరెళ్తూ ఉంటుంది… గ్యాంగ్ అటాక్… మళ్లీ హీరో ఫైట్…
- హీరోయిన్ ఇంటిపై దాడి… హీరో అరివీర భీకరంగా ఓ 20, 30 శవాల్ని లేపేస్తాడు…
- ఈసారి రొటీన్‌గా గాకుండా కొత్త వేషాలతో రౌడీల దాడి… మళ్లీ హీరోచిత ఫైట్…
- హీరోయిన్ అడ్మిషన్ తీసుకుంటుంటే అటాక్… ఈసారి వీరోచిత వీరంగం…
చదువుతుంటేనే పిచ్చి లేస్తున్నట్టుందా..? మరి థియేటర్‌లో కూర్చున్నవాడికి ఎలా ఉండాలి..? అబ్బే, ఇంకా అయిపోలేదండీ… మరీ బాగోదు అనుకుని ప్రతి ఫైటుకూ హీరో చేతిలో ఆయుధం మారుస్తాడు దర్శకుడు… అంతేతప్ప దంచుడులో ఫరక్ ఉండదు… వెరసి థియేటర్ నుంచి బయటికి వచ్చే టైమ్‌కు విశాల్ కొట్టిన దెబ్బలకు ప్రేక్షకుడికీ కనిపించని గాయాలే…
మరోవైపు హీరోయిన్‌తో హీరో ప్రేమ అనేది మన సినిమాల్లో కామన్ ఫ్యాక్టర్ కదా… విశాలూ ప్రేమిస్తాడు… కానీ ఆమెలో అమ్మను చూసుకుంటూ ఆరాధిస్తాడు… దాని మీద ఎమోషన్ రన్ చేయడం… ఇదోరకం టార్చర్… అమ్మ అమ్మే, అమ్మాయి అమ్మాయేరా బాబూ అని ప్రేక్షకుడు అరవాల్సిందే…
ఇన్ని తిక్కల నడుమ మరో తిక్క… మురళీ శర్మ అనే విలనుడు… ఒళ్లంతా పౌడర్ పూసుకుని అదోరకం పైత్యం… ఓవరాక్షన్… నిజానికి ప్రేక్షకులకు అనేక రకాలుగా చుక్కలు చూపించడంలో సదరు దర్శకుడు పీహెచ్డీ చేసినట్టున్నాడు… చివరగా… మన గుండు బాస్ చెప్పినట్టు… డబ్బులు ఊరకే రావు… ఇలాంటి సినిమాల జోలికి అస్సలు ఖర్చు చేయొద్దు… దూరంగా ఉంటే మానసిక ఆరోగ్యానికి, పర్స్ ఆరోగ్యానికి మంచిది…
Share this Article