CM రేవంత్ రెడ్డికి తెలంగాణ కమ్మ కుల సమాజం బహిరంగ లేఖ! అని ఓ వాట్సప్ పోస్ట్ బాగా సర్క్యులేటవుతోంది… సరే, బోలెడన్ని చాన్సులు రావాలని ప్రతి కులానికీ ఉంటుంది… కొందరికి టికెట్లు ఇస్తే కులం ఉద్దరింపబడుతుందనేది ఓ పెద్ద భ్రమ… కొన్ని కుటుంబాలు మాత్రం సంపాదించుకుంటాయి… అంతే…
కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ, తెలుగుదేశం అంటే కమ్మ పార్టీ, బీఆర్ఎస్ అంటే వెలమ పార్టీ, జనసేన అంటే కాపు పార్టీ… ఇలా బోలెడు ముద్రలున్నాయి కదా… వోకే, ఆయా పార్టీల్లో పదవులు, అవకాశాల విషయంలో ఆయా కులాల వ్యక్తులకు ప్రాధాన్యం ఉంటే ఉండవచ్చు… కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని పట్టుకుని నువ్వు కమ్మ ద్రోహివి అని తూలనాడటం ఏమిటో, ఆక్షేపించడం ఏమిటో అర్థం కాదు, పైగా తనను తెలుగుదేశం ప్రతినిధిగా భావించడం ఏమిటో అస్సలు అర్థం కాదు…
సరే, ఆ లేఖ ఇలా సాగింది…
Ads
తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కింది విషయాల పై సమాధానం ఇవ్వవలసిందిగా తెలంగాణ కమ్మ కులం డిమాండ్ చేస్తుంది.
👉 తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా సామాజికంగా కమ్మలు అత్యంత ప్రభావితమైనటువంటి వర్గమని మీరు భావించట్లేదా?
👉 మీ రాజకీయ ఉన్నత స్థితికి పునాది వేసింది కమ్మ కులస్తులు కాదా?
👉 శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతి చలవతో మీరు కమ్మలను వాడుకొని ఈ స్థితికి వచ్చారని మరిచిపోయారా?
👉 బీసీ బిడ్డల త్యాగాలకు బలోపేతమైన తెలుగుదేశం పార్టీకి నిన్ను అధ్యక్షుడిగా చేసింది ఎవరు?
👉 ఈనాడు అధినేత చెరుకూరి రామోజీరావు, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఇతర కమ్మ మీడియా సంస్థల దన్నుతో మీరు తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన నాయకుడిగా ఎదిగింది వాస్తవం కాదా?
👉 నువ్వు పీసీసీ అధ్యక్షుడైతే మొట్టమొదట అక్కున చేర్చుకుంది మా నాయకురాలు, ఎంపీ రేణుక చౌదరి కాదా?
👉 అమాయక తెలంగాణ కమ్మవారు మీలో చంద్రబాబు నాయుడుని చూసుకున్నది వాస్తవం కాదా?
👉 తెలంగాణలోని 119 నియోజకవర్గాలలో 37 అసెంబ్లీ నియోజకవర్గాలను కమ్మ కులం ప్రభావితం చేస్తుందనే విషయం మీకు తెలియదా లేదా తెలిసి నటిస్తున్నారా?
👉 గత అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో ఉన్న కమ్మలు గుండు గుత్తాగా మీకు ఓట్లు వేసిన విషయం మరచిపోయారా? ఆ దన్నుతోనే మీరు ముఖ్యమంత్రి అయ్యారు అనేటువంటి వాస్తవాన్ని అటకెక్కించారా?
👉 ఎన్నికలు కాగానే నీ కులానికి మూడు మంత్రి పదవులు, 14 కార్పొరేషన్లు, 17 మంది అధికారులకు అత్యంత కీలకమైన పోస్టులు ఇచ్చింది వాస్తవం కాదా?
👉 అన్ని కులాలకు కార్పొరేషన్లు ప్రకటించి కమ్మలను పక్కన పెడితే మా మా సామాజిక వర్గంలో పెళ్ళుబికిన అసంతృప్తిని చూసి కమ్మలకు మరల కార్పొరేషన్ ముష్టిగా వేసినటువంటి చరిత్ర మీది కాదా?
👉 తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాలలో ఖమ్మం జిల్లా కమ్మలకు అత్యంత బలమైనటువంటి జిల్లా అనేటువంటి విషయం మీకు తెలియదా?
👉 పార్లమెంట్ ఎన్నికలలో నీ రెడ్డి కులానికి ఉన్న 17 సీట్లలో ఏడు సీట్లను కేటాయించి నీ కుల పక్షపాతాన్ని నిరూపించుకున్నది వాస్తవం కాదా?
👉 రాష్ట్రంలో ఉన్నటువంటి బలమైన కమ్మ కులం ఒక్క పార్లమెంటు సీటుకు కూడా అర్హులు కాదా?
👉 ఖమ్మం, చేవెళ్ల, మల్కాజిగిరి లాంటి ఒక్క సీట్లో కూడా పోటీకి మా కులం నుండి అభ్యర్థులు దొరకలేదా? లేదా నీ కుల పెత్తనాన్ని మా మీద రుద్దాలని నిర్ణయం తీసుకున్నావా?
👉 నీ కులానికి చెందిన నీ శత్రువు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడే కాకుండా నటుడు దగ్గుబాటి వెంకటేష్ వియ్యంకుడు అయిన రఘురాం రెడ్డి కి ఖమ్మం ఎంపీ సీటు ఇవ్వడానికి ఇష్టపడ్డావు కానీ నీకు రాజకీయంగా, వ్యక్తిగతంగా ఔన్నత్యాన్ని ఇచ్చిన కమ్మ కులాన్ని పక్కన పెట్టడాన్ని మా కులం జీర్ణించుకోలేక పోతుంది.
👉 రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకు, ఆర్థిక పునాదులు కలిగిన మా కమ్మ కులం రాబోయే ఎన్నికలలో నీవు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో ఒక్కసారి పబ్లిక్ గా చెప్పే దమ్ము నీకు ఉందా?.
మాకు ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని రాబోయే ఎన్నికల్లో నీవు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఘోరి కట్టడం మా ఆశయం అని తెలుసుకో రేవంత్ రెడ్డి.
జై కమ్మ …. జై ఎన్టీఆర్
ఖమ్మం, మల్కాజిగిరి, చేవెళ్ల సీట్లలోనే ఎందుకు కావాలి అవకాశాలు..? ఎందుకంటే..? కాస్తోకూస్తో అక్కడ కమ్మల వోట్లు ఎక్కువ కాబట్టి… మరి నిజంగానే 37 అసెంబ్లీ నియోజకవర్గాల గెలుపోటముల్ని ప్రభావితం చేసేంత సీనే ఉంటే… మరి ఫాఫం తెలుగుదేశం చంద్రబాబునాయుడు మొత్తం దుకాణాన్ని మూసేసి ఎందుకు ఆంధ్రాకు పారిపోయినట్టు..? కాంగ్రెస్‌ను ఎందుకు దేబిరించాలి..?
ఐనా, ఈ బహిరంగలేఖ మీద రేణుకాచౌదరి ఏమైనా స్పందిస్తే బాగుండు… పైసా ఖర్చు లేకుండా, ఏ ప్రయాస లేకుండా నేరుగా రాజ్యసభకు వెళ్లిపోయిందిగా… అది ఆ కులానికి అవకాశం ఇచ్చినట్టు కాదా..? ఆమె కమ్మల లెక్కల్లోకి రాదా..? తుమ్మల నాగేశ్వరరావును కేబినెట్‌లోకి తీసుకున్నారు కదా, ఆయన కమ్మ కాదా..? కొత్తగూడెం ఎమ్మెల్యేగా సీపీఐ టికెట్టు మీద కూనంనేని సాంబశివరావుకు అవకాశం ఇచ్చింది ఎవరు..? ఆయన కులమేమిటి మరి..?
రాయల నాగేశ్వరరావుకు ఏదో కార్పొరేషన్ పదవి, మువ్వా విజయబాబుకు మరొకటి… కోనేరు కోణప్ప కూడా చేరినట్టున్నాడు కదా కాంగ్రెస్‌లో..! మరీ విడ్డూరం ఏమిటంటే..? అమాయకులైన కమ్మలు రేవంత్‌రెడ్డిలో చంద్రబాబునాయుడిని చూసుకున్నారట…
సరే, రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీలకు రెడ్లంటే అమితమైన ప్రీతి, ప్రాధాన్యం, అందుకే పదవులన్నింట్లో వాళ్లకే ప్రాధాన్యం అంటున్నారు కదా… ఖమ్మం సీటు ఒక్కటి ఇచ్చి ఉంటే… కమ్మలకు సముచిత గౌరవం ఇచ్చినట్టు అవుతుందా..? ఇక రెడ్ల పక్షపాతం లెక్కలోకి రాదా..? హేమిటో… సరేగానీ, ఈ బహిరంగలేఖ వాస్తవమేనా..? రాసింది ఎవరు..? ఏం ఆశిస్తున్నారు..? ఇది కేవలం సోషల్ మీడియాలో బీఆర్ఎస్ క్యాంపు నామా నాగేశ్వరరావు కోసం సృష్టించిన మాయా ప్రచారమా..?!
Share this Article