Raj Madiraju…. (ఇర్ఫాన్ ఖాన్ వెళ్ళిపోయి నాలుగేళ్ళంట.. ఫేసుబుక్కు ఈ పోస్టు గుర్తుచేసింది..) కొన్ని డీకోడ్ చేయలేని డైసెక్ట్ చేయలేని డిబేట్ చేయలేని ఇష్టాలుంటాయి..
లైఫ్ ఇన్ ఏ మెట్రో సినిమాలో ‘కిసీకా నేచర్ ఠీక్ నహీ హై తో కిసీకా ఫిగర్ ఠీక్ నహీ హై.. ఆప్‌కా నేచర్ ఓర్ ఫిగర్ దోనో అఛ్ఛే లగే..’ అని తను చూసిన ఇరవైతొమ్మిదో అమ్మాయితో మ్యాటరాఫ్ ఫ్యాక్ట్‌గా చెబ్తాడు..
ఇదీ.. కరెక్ట్ వర్డ్.. మ్యాటరాఫ్ ఫాక్ట్.. ఒక చేదు నిజం..
Ads
ఇదీ ఇర్ఫాన్ ఖాన్ నటన.. ఇంత రియలిస్టిగ్గా ఉంటుంది.. ఎన్నో పాత్రల్లో ఇతను కనిపిస్తూనే పాత్రను మనకు ఎంతో ఇష్టంగా పొదివి పట్టుకునేట్టు, మనసుకు హత్తుకునేట్టు చేస్తాడు..
అంతకుముందు హాసిల్, మక్బూలు లాంటి సినిమాలలో చూసి కళ్లెగరేసినా పాన్ సింగ్ తోమర్, దాదాపుగా వెంటనే లంచ్ బాక్స్ సినిమాలు ఇతనంటే ఇష్టాన్ని కలిగించాయి..
కేవలం హాలీవుడ్ సినిమాలు కాబట్టి లైఫ్ ఆఫ్ పై, స్లండాగ్ లాంటి సినిమాలలో ఇతన్ని చూసి హాలీవుడ్డుని ఏలేస్తున్న భారతీయుడు అంటూ మనసు పారేసుకునే టైపు కాదు నేను.. ఎందుకంటే భాషేదైనా ఇతను పక్కా ఇండియన్నే..
హాలీవుడ్ సినిమాలలో ఇతని ఇంగ్లీషు యాక్సెంటు మారదు.. రంగురంగుల రాజస్థానీ తలపాగా పెట్టుకుని బాన్సురీ వాయిస్తున్న సాహబ్‌జాదా మాట్లాడినట్టే ఉంటుంది..
ముసుగులుండావ్.. మేకప్పులుండవ్.. ప్రయత్నాలుండవ్.. భేషజాలుండవ్..
ఎప్పుడు తెరమీంచి చెయ్యి బైటికొచ్చి నీ మొహం మీది ముసుగును లాగేస్తుందో అన్నట్టు ఒకవిధమైన కాన్షస్‌గా, అదే సమయంలో నిన్ను నువ్వు సమర్పించుకోగల స్నేహితుడితో ప్రయాణిస్తున్నట్టు గొప్ప సెక్యూర్డ్‌గానూ ఉంటుంది..
ఇర్ఫాన్.. నువ్వు జీవితంలాంటివాడివి.. ఎన్నోసార్లు సినిమా చూస్తూ ఇదుగో ఇలా చెయ్యెత్తి కొడతాడు, ఇలా జోకేసి నవ్విస్తాడు, ఇలా ఒక హీరోలా వంకరగా చూస్తాడు అని ఆశించినప్పుడల్లా విరుధ్ధమైన ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి డిజప్పాయింట్ చేస్తూ వొచ్చావు..
కానీ వెదకడం మొదలుపెడితే అందులోనే ఎన్నో అందాలు, ఆనందాలు.. వొదిలి వెళ్లిపోయిన క్షణాలను గుర్తుచేసుకుంటే జ్ఞాపకాలిచ్చే అద్భుతమైన ఉత్తేజాలు, ఉద్వేగాలు..
అచ్చు జీవితంలాగే..
ఇర్ఫాన్.. నీ పేరులోని రెండో ‘R’ రియలిస్టిక్ అని అర్ధమై నీకు పెద్ద అభిమానిగా మారుతున్న సమయంలో నువ్వు మళ్లీ షాకిచ్చావు.. నీ నటనలాగే డిజప్పాయింట్ చేసి వెళ్లిపోయావు..
ఇప్పుడు తోడుకుంటా.. నీ చిన్ని కెరీర్‌లో నువ్విచ్చిన ఒక్కో ప్రదర్శననీ శోధిస్తా.. జ్ఞాపకాలన్నీ దాచుకుంటా..
నువ్వు లేని లోటుని నువ్వు సినిమాకీ సినిమాకీ మధ్య ఇచ్చే గ్యాపులా ఫీలవుతా.. కాకపోతే ఈసారి కొద్దిగా ఎక్కువ గ్యాపు.. ఎప్పటికీ తిరిగిరాను గ్యాపు..
నీమీద చివరి కంప్లెయింటు.. ఇది అడక్కుండా ఉండలేకపోతున్నా.. చచ్చిపోవాల్సిన అవసరమేంటని.. 53 is not an age to die Man.. నీ రియలిస్టిక్ ప్రమాణాలతో చూసినా సరే..
ఎన్నోసార్లు నీ స్క్రిప్టుని ఎదిరించి యాక్ట్ చేశావు కదా.. ఈ ఒక్కసారి చేయలేకపోయావా…
Share this Article