దశాబ్దాలుగా అరుణగ్రహంపై జీవం ఉనికిని తెలుసుకోవాలని, ఆ గ్రహం స్థితిగతులేవో అంచనాలు వేయాలని మన వైజ్ఞానిక ప్రపంచం కలలు కంటోంది… ఖగోళ శాస్త్రజ్ఞులకు ఎన్నేళ్లుగానో దానిపై కన్ను… నాసా ప్రయోగించిన ఓ రోవర్, పేరు పర్సెవరెన్స్ నిన్న పదిలంగా మార్స్ ఉపరితలంపై అడుగుపెట్టింది… అది ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష శాస్త్రవేత్తలకే కాదు, సైన్స్‌ను ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఉద్విగ్నతను కలిగించిన క్షణం… ప్రత్యేకించి రోవర్ మెల్లిమెల్లిగా అక్కడ దిగే ఆ చివరి ఏడు నిమిషాలూ నాసా సైంటిస్టులకు తీవ్రమైన ఉత్కంఠ, నరాలు తెగిపోయేంత టెన్షన్… ఆ టీంను లీడ్ చేస్తున్న స్వాతి మోహన్ కళ్లల్లో ఆదుర్దా… భృకుటి కాస్త ముడిచి, కళ్లను కంప్యూటర్ మానిటర్‌కు అతికించేసింది… ఆ క్షణం ఆ కళ్లల్లోని నాయకత్వ లక్షణాలు, ఇన్నేళ్ల శ్రమ ఫలించబోతున్నదనే ఆనందం, రోవర్ క్షేమంగా దిగుతుందా అనే ఉత్కంఠ, మెల్లిమెల్లిగా మార్స్‌పై దిగుతున్న రోవర్… ఇవి కాదు, చాలామందికి స్వాతి మోహన్ నొసటన బొట్టు వెలిగిపోతూ కనిపించింది… నిన్న ట్విట్టర్లో ఆమె బొట్టు మీద కూడా ఒకటే చర్చ… అంతే, సోషల్ మీడియా ఎప్పుడెలా రియాక్టవుతుందో ఎవడూ అంచనా వేయలేడు… మరీ Beauty with Brain and Bindi అనే స్లోగన్ అర్జెంటుగా పాపులర్ చేసేశారు…
ఇక్కడ రెండుమూడు అంశాలు నిజానికి బాగా జనంలోకి వెళ్లాలి… 1) నాసా ఎన్నో ఏళ్లుగా రోవర్‌ను మార్స్ మీద దింపడానికి సాగిస్తున్న కృషి… అది ఫలించడం… అది ఏం కనిపెడుతుంది అనేది పక్కన పెట్టండి, మానవలోక ప్రతినిధిగా ఓ సాంకేతిక పరికరం అరుణగ్రహాన్ని చేరింది… అదే ప్రస్తుతం… 2) స్వాతి మోహన్ ఎనిమిదేళ్లుగా ఇదే ప్రాజెక్టు మీద వర్క్ చేస్తోంది… ఏడెనిమిది నెలలుగా ఆ టీంకు ఆమే హెడ్… ఆమె జన్మతః భారతీయురాలు… 3) ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఏడాది వయస్సున్నప్పుడు అమెరికాకు వెళ్లారు… ఆమె ఉత్తర వర్జీనియా, వాషింగ్టన్ డీసీ ప్రాంతాల్లోనే తన ఉన్నత విద్యను పూర్తి చేసి, నాసాలో చేరింది… ప్రస్తుతం Mars 2020 Guidance, Navigation, & Control Operations Lead… సో, ఈ విజయాన్ని అత్యధికంగా ఆనందిస్తున్నది ఆమే…
Ads
ఇవన్నీ గాకుండా కొందరి ఇంట్రస్టు, చర్చ ఆమె బొట్టుపై కేంద్రీకృతమైంది… ఆమె హిందువు, చిన్నప్పటి నుంచీ బొట్టు పెట్టుకోవడం అలవాటు… అంతమంది అమెరికన్లతో, వివిధ దేశాల సైంటిస్టులతో కలిసి పనిచేస్తున్నా, ఆధునిక అమెరికన్ వస్త్రధారణే అయినా… నుదుటన తిలకం మాత్రం తప్పనిసరిగా పెట్టుకుంటుంది… ఈ బొట్టు మీద చర్చ ఎక్కడెక్కడికో వెళ్లిపోయింది..,. అమెరికాలోని భారతీయులు కూడా ట్వీట్లు చేస్తూ ఆమెను బొట్టు విషయంలో అభినందిస్తున్నారు… ‘‘నేను అమెరికా వచ్చిన కొత్తలో బొట్టు పెట్టుకునేదాన్నే, కానీ అందరూ అడుగుతుండటంతో మానేశాను. ఇప్పుడు స్వాతిని చూశాక మళ్లీ పెట్టుకోవాలనిపిస్తోంది’’ అని ఆనందపడుతున్నవాళ్లు కొందరయితే… ‘‘ఆ చిన్న బొట్టు ఆమె భారతీయతను, ఆమె మూలాల్ని ప్రస్ఫుటంగా ప్రదర్శిస్తోంది’’ అని కొందరి విశ్లేషణ… మన దేశంలోని ఇతర ప్రాంతాల వాళ్లకు బొట్టు పరిమాణం మీద వేరే అభ్యంతరాలు ఏమీ ఉండవు గానీ బెంగాలీ మహిళల బొట్టు మాత్రం పెద్దగా, కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది… వాళ్ల బొట్టుకు మతం లేదు, అది వాళ్లు తమ సంస్కృతిలో భాగంగా పరిగణిస్తారు… మరి వాళ్లు అమెరికాలో, ఇతర దేశాల్లో బొట్టు ఎలా పెట్టుకుంటున్నారు..? వదిలేశారా..? దీనికి జవాబు..?! సరే, సరే… ఈ చర్చ సంగతి సరే గానీ… స్వాతికి అభినందనలు చెబుదాం, మనస్పూర్తిగా..!
Share this Article