Sampathkumar Reddy Matta….. కాపిళ్లు / పిసికిళ్లు /ఊచ బియ్యం
~~~~~~~~~~~~~~~~~~~~~~
కాపిళ్లు లేదా పిసికిళ్లు అంటే
పాలుగారే పచ్చి జొన్నల ప్యాలాలు.
వేడికి కాపబడుతవి కనుక కాపిళ్లు.
చేతితో పిసుకబడుతవి కనుక పిసికిళ్లు.
ఊచ అంటే జొన్నవెన్ను కనుక ఊచబియ్యం.
జొన్న పంట పండిన ప్రాంతాన్నిబట్టి రకరకాల పేర్లు.
మనకు పజ్జొన్నలూ తెల్ల జొన్నలూ పేరుమోసిన తీర్లు.
లోపల పాలు ఉడుగుతూ గింజ గట్టిపడుతున్నప్పుడు
జొన్న కంకులు విరిచి అప్పటికప్పుడు ప్యాలాలు చేస్తరు.
పలుగు రాళ్లు ఏరి తెచ్చి వాటిని రాజేసిన మంటల వేసి, తీసి
ఆ వేడి పలుగురాళ్లతోటి కలిపి జొన్నకంకులను బొర్లించుడు,
పిడుకలు తంపిబెట్టి మీద పచ్చనాకు పరిచి, జొన్నకంకలను
అ తంపి వేడి మీద మంచిగ ఉడికి ఉమ్మగిల్లేటట్టుగ చేసుడు,
మామూలుగ వంట పొయ్యి మీద మంగలం పెట్టి, మంగలంల
జొన్నకంకులు వేసి కాపు జూపి ఉడికిన గింజ నలుపుకునుడు
పైన చెప్పిన మూడు రకాల జొన్నప్యాలాల తయారు పద్ధతులు.
ఉడుకుడుకు కాపిళ్లు మంచి దవుడగాసం. నమిలినకొద్దీ రుచి.
ఉత్త వెన్నతో తినుడు, వెన్న కారంతో తినుడు, బెల్లంతో తినుడు
ఉప్పు చల్లి ఉప్పుప్యాలాలు చేసుకతినుడు, ఈ తిండి తీరుతీరు.
చల్లారిన పిసికిళ్లు కూడా గట్టిబారినా నములగలిగితే, రుచే వేరు.
మాపున దులిపిన ప్యాలాలు వెన్నెల వెలుగుకు పందిరి మీద పెట్టి
రేపటికి తినుడన్నది రుచిదెలిసిన వెనుకటి పెద్దలకు ఎంతన్న ప్రీతి.
ఒగప్పుడు ఇక్కడక్కడ అనికాదు, అంతటా జొన్నపంటలే పండేది.
అన్ని పంటలల్ల, వరి అనేది బురుదల పండే ఓ చిన్నపంట. అంతే.
జొన్న గటుక ప్రధానాహారంగ ఉన్నరోజులల్ల, వరికి ఏ స్థాయీ లేదు.
కాటను దొర ఆనకట్ట లేక ముందు కోనసీమల గుడ జొన్నే పెద్ద పంట.
ఐదారు తరాల కింద ఏ పంట పండిందన్నది ఎవరికి అవసరం కనుక.
ఆత్మకథలు పద్యకావ్యాలూ తిరిగేస్తే, ఆనాటి ఆనవాళ్లు దొరుకుతై.
తాతలనాడు చెరువు, జాలు కింద మాత్రమే వరి పంట వేసేవాళ్లు.
కొర్రలు సజ్జలు జొన్నలు తైదలు సామలు ఇంకెన్నో మెట్ట పంటలు.
బురుదకు పండేదొకటే, మెట్టకు పండేవి ఎన్ని తీర్లో మనకు తెలుసు.
మెట్టను అచ్చు కట్టి బురుద జేసి వరిపండించే వెర్రితనమూ తెలుసు.
ఊడగొట్టుకుంటున్న రుచుల్ల, ఊచబియ్యం ఒకటని కూడ తెలుసు.
బహుదెలిసినవాడు బట్టల్ల దొడ్డికి పోయిండని పెద్దలు చెప్పే మాట.
ఇది… మన ఆహారం – మన విహారం…. ~డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి
Share this Article