బకింగ్ హ్యాం ప్రిస్టేజ్ ఈజ్ ఫాలింగ్ డౌన్!
——————-
బ్రిటిషు వారి ఈస్ట్ ఇండియా కంపెనీ కలకత్తాలో దుకాణం తెరిచిన నాటికి బహుశా ఇంగ్లాండ్ జనాభా యాభై లేదా అరవై లక్షలు ఉండి ఉండాలి. అదే సమయానికి భారత జనాభా హీనపక్షం ఇరవై అయిదు కోట్లు దాటి ఉండాలి. ఇప్పుడు ఇంగ్లాండ్ జనాభా అయిదు కోట్లా అరవై లక్షలు. భారత జనాభా 135 కోట్లు. పట్టుమని పది నాటు పడవల్లో గాలివాటుగా వచ్చిన పాతికమంది కంపెనీ వ్యాపారులు పాతిక కోట్ల జనాభాపై తిరుగులేని ఆధిపత్యం సాధించి, రెండు వందల ఏళ్లపాటు మన దేశాన్ని ఎలా గుప్పిట్లో పెట్టుకున్నారు? అన్నది పెద్ద రహస్యమేమీ కాదు. “విభజించు- పాలించు” అన్న ఒకే ఒక్క సిద్ధాంతంతో ఆసేతు హిమాచలం బ్రిటీషువారు పెత్తనం చెలాయించగలిగారు. మనలో ఐకమత్యం లేకపోవడం, చిన్న చిన్న రాజ్యాల రాజుల మధ్య గట్ల పంచాయితీలు, పెద్ద రాజులకు ఇంగ్లీషు వ్యామోహం…ఇలా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు మనమీద బ్రిటిషువారి అధిపత్యానికి అనేక కారణాలు. ఆ గొడవ ఇక్కడ అనవసరం.
బ్రిటీషు వారినుండి 1947 ఆగస్టు పదిహేను మనకు స్వాతంత్య్రం వచ్చింది. కానీ- భారత దేశంలో బ్రిటీషువారి భాష, వేషం, ఆచారాలు, ఆలోచనల నుండి మాత్రం చాలామందికి స్వాతంత్య్రం రాలేదు. రాదు. వస్తుందని కోరుకోవడం అత్యాశ. ఇంగ్లాండ్ గొప్పతనాన్ని ఇంకొకరు గుర్తించాల్సిన పనిలేకుండా వారికి వారే బ్రిటన్ కు ముందు గ్రేట్ అని భుజకీర్తిని ఘనంగా తగిలించుకున్నారు. వారి నగదు గ్రేట్ బ్రిటన్ పౌండ్. అమెరికాకంటే ఘనం. మారకం విలువ ఎక్కువ. వారి హ్యటు, కోటు, సూటు, బూటు గొప్పవి. వారి ఇంగ్లీషు చాలా గొప్పది. వారి ఉచ్చారణ మరింత గొప్పది. వారి నడక నడకకే నడక నేర్పినది. స్టయిల్ అంటే వారే. కంట్రీ సైడ్ అంటే బ్రిటనే. చదువంటే అక్కడే. లండన్ బ్రిడ్జ్ ఫాల్ అయితే ప్రపంచానికి అది ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్ విశ్వ గీతం- అని వారి నమ్మకం. అది నిజం కాదని మనం అనం కాబట్టి- మనం కూడా వారి నమ్మకాన్ని బలపరుస్తున్నట్లు అనుకునే వారి హక్కును కాదనడానికి వీల్లేదు.
Ads
బ్రిటన్ రాణి ముందు నిలుచోవడం మానవమాత్రులకు ఎందుకు సాధ్యపడదో అదే బ్రిటన్ నటుడు మిస్టర్ బీన్ తన మాటల్లేని గొప్ప నటనతో ప్రపంచానికి చూపించాడు. ఆ మహారాణి మన ముందుకు వచ్చినపుడు వినయంతో కూడిన భయంవల్ల వచ్చిన సిగ్గుతో మనం తల ఒంచాలి. ఒక కాలు కొంచెం మడత పెట్టి ఆమెకంటే మనం చాలా తక్కువవాళ్లమని మన బాడీ లాంగ్వేజ్-శరీరభాష ద్వారా తెలియజేయాలి. గుండె మీద కుడి చెయ్యి పెట్టి కొద్దిగా ముందుకు వంగి నమస్కరిస్తున్నట్లుగా నిలుచోవాలి. ఆమె షేక్ హ్యాండ్ ఇవ్వబోతే మన ముని వేళ్లు ముందుకు చాచాలి. ఆమె నడిచి వెళ్లిపోతుంటే మనం అభాగ్యుల్లా, అనాథల్లా, చకోర పక్షుల్లా, అక్కు పక్షుల్లా ఎదురు చూడాలి. ఉష్ట్ర పక్షుల్లా తల నేల వైపు చూడాలి. ఇవన్నీ గ్రేట్ బ్రిటన్ లో ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడ్డ ప్రభుత్వంలో బ్రిటన్ ప్రజలు ఇష్టపడి కష్టంగా పాటిస్తున్న రాణివాసపు మర్యాదలు. వారి గ్రేట్ బ్రిటన్. వారి గ్రేట్ రాణి. వారి గ్రేట్ మర్యాదలు. ఇందులో మన అభ్యంతరాలకు, ఆశ్చర్యాలకు విలువ ఉండదు. ఈ రాణివాసపు ఉక్కపోత భరించలేకే డయానా పొరుగుదేశం పారిస్ వీధుల్లో చల్లగాలి పీల్చుకోబోయి తుది శ్వాస వదిలింది.
——————–
తాజాగా- రాజకుటుంబంలో హ్యారీ దంపతులు ఎముకలు కొరికే లండన్ చలిలో అదే రాణివాసపు ఉక్కపోత భరించలేక సాధారణ పౌరుల్లా బయట వేరు కుంపటి పెట్టుకుని చల్లగా బతుకుతున్నారు. బయట ఒక సంవత్సరానికి పైగా ఉంటే- ఇక శాశ్వతంగా అంతః పుర విధులకు దూరం కావాల్సి ఉంటుందని అంతఃపురం అంతర్గత సందేశం పంపింది. మహారాజుగా…అలాగే కానివ్వండి- అని వారు సమాధానం ఇచ్చారు. అంతః పుర విధులు, మర్యాదలు కాలదన్ని వారు సాధారణ జీవితం గడపడం అంతర్జాతీయంగా పెద్ద వార్త.
బాహుబలిలో తల్లి విధించిన శిక్షకు యువరాజు రాజ్యం వదిలి- గుడిసెల్లో బతికితే-
“పడమర కొండల్లో వాలిన సూరీడా!
పగిలిన కోటలనే
వదిలిన మారేడా!
దండాలయ్యా!
మాతోనే నువ్ ఉండాలయ్యా!”
అని పేద జనం బృందగానం చేశారు. ఇది సినిమా. అది లండన్. అక్కడ అలా పాడడం లేదు. బహుశా హ్యారీ అంతః పురంలోనే ఉండి ఉంటే బాగుండేది అని లండన్ అనుకుంటున్నట్లుంది. పేరు ప్రజాస్వామ్యం. పెత్తనం రాచరికం. లండన్ ప్రిస్టేజ్ ఈజ్ ఫాలింగ్ డౌన్… ఫాలింగ్ డౌన్!……... By…. -పమిడికాల్వ మధుసూదన్
Share this Article