Sai Vamshi…. … భారతీయ కార్టూనిస్టు రచిత తనేజాకు 2024 సంవత్సరానికి గాను ‘Kofi Annan Courage in Cartooning Award’ అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయురాలు రచిత. ఆమెతోపాటు హాంగ్‌కాంగ్‌కు చెందిన కార్టూనిస్టు జున్‌జీకీ ఈ అవార్డు ఇచ్చారు. ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ పేరిట 2012 నుంచి జెనీవాలోని ‘Freedom Cartoonists Foundation’ రెండేళ్లకోసారి ఈ అవార్డులు అందిస్తోంది. పురస్కారం కింద రు.13.82 లక్షలను అవార్డు గ్రహీతలకు సమానంగా పంచుతారు. కార్టూనిస్టులు తగ్గిపోతున్న ఈ కాలంలో రచిత మొదలుపెట్టిన ప్రయాణం స్ఫూర్తిదాయకమైనది.
… రచిత తనేజా పుట్టి పెరిగింది ఢిల్లీ. అన్యాయాన్ని ప్రశ్నించే మనస్తత్వం చిన్ననాటి నుంచే తనలో ఉంది. ఆమె చిత్రకళ నేర్చుకోలేదు. 2014లో 22 ఏళ్ల వయసులో మానవ హక్కులు, పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేస్తున్న క్రమంలో కార్టూనిస్టుగా మారారు. బొమ్మల ద్వారా దేశంలోని పరిస్థితులను వివరిస్తే ఎక్కువమందికి చేరతాయని భావించారు. భారతదేశంలో సెన్సార్‌షిప్ అనేది ఆమె గీసిన తొలి కార్టూన్.
అది తన స్నేహితులకు నచ్చడంతో ఫేస్‌బుక్ పేజీ మొదలుపెట్టి అందులో వాటిని పోస్ట్ చేయడం ప్రారంభించారు. అప్పటినుంచి రకరకాల అంశాలపై కార్టూన్లు గీస్తూ ఉన్నారు. దేశంలో అస్థిరమైన అంశాలు, ఇబ్బందులు, నేతల నిజస్వరూపాలే ఆమె కార్టూన్లకు ముడిసరుకు. ‘Sanitary Panels’ అని ఆమె మొదలుపెట్టిన ఫేస్‌బుక్ పేజీకి ప్రస్తుతం 2.60 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు…
దీంతోపాటు ‘The News Minute’ వెబ్‌సైటు కోసం వారానికోసారి కార్టూన్లు గీస్తుంటారు. 2020లో తొలిసారి రచితకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేసిన కార్టూన్లు కోర్టు ధిక్కారానికి ప్రతీకగా ఉన్నాయని బీజేపీకి చెందిన విద్యార్థి నాయకుడు కేసు వేశాడు… (ఆ కార్టూన్ వ్యవహారం కోర్టు కేసులో ఉన్నందున ఇక్కడ పబ్లిష్ చేయడం లేదు)…
తన కార్టూన్లు నాయకులను ప్రశ్నిస్తాయని, తాను భయంకరమైన ట్రోలింగ్‌కు గురవుతానని ఆమెకు తెలుసు. కానీ కేసు వేయడమనేది ఆమె ఊహించని విషయం. అయినా ఏమాత్రం భయపడకుండా కోర్టులో తన వాదన వినిపించింది. నేటికీ ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. కేసులో ఆమె గనుక దోషి అని తేలితే ఆరునెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
అయితే ఆమెకు మద్దతుగా లాయర్లు, అనేక ఎన్జీవోలు ముందుకొచ్చి ఆమె తరఫున పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెను ఈ అవార్డు వరించడం మంచి సంకేతం. కళాకారులు, మేధావులు నిర్భయంగా తమ గొంతు వినిపించేందుకు దక్కిన ప్రోత్సాహం ఇది. “జర్నలిస్టులు వారి పని వారు ప్రభావవంతంగా చేయలేనప్పుడు, కార్టూనిస్టులు ముందుకొచ్చి దేశంలో జరుగుతున్న పరిణామాలను తమ గీతల్లో చూపాలి” అంటారు రచిత… – విశీ (వి.సాయివంశీ)
Share this Article