Prasen Bellamkonda……. లార్జర్ దాన్ లైఫ్ ప్రదర్శన అనేది ఒక కళారూపం అయితే కావచ్చు గానీ అన్నింటినీ కొండంతలు చూపెట్టి మభ్యపెట్టి నెట్టుకొచ్చేయడం అనే ట్రిక్ అన్ని సందర్భాలలో పనిచేయదు. ఈ సంగతి సంజయ్ లీలా బన్సాలి కి కూడా తెలిసే ఉంటుంది కానీ పాపం ఏం చేయగలడు తన దగ్గరున్న ఉప్పుతో తాను వండగలిగిన బిర్యాని మాత్రమే వండగలడు కదా. హీరా మండీ కూడా అదే. ఎలాస్టిక్ ఎమోషన్లు, చూయింగ్ గమ్ చతురోక్తులు, కాపీ బుక్ కక్షలు,
భారత స్వాతంత్ర పోరాటంలో వేశ్యల పాత్ర కీలకం, అయితే ఈ పురుషాధిక్య సమాజం దాన్ని గుర్తించదు అని హీరామండీ యూఎస్పీ గా చెప్పదలుచుకున్నట్టు బన్సాలీ మనల్ని మాయ చేయబోయాడు. అదే నిజమైతే హీరామండీ వ్యవహారాలతో పాటు సమాంతరంగా స్వాతంత్ర పోరాట ఘట్టాలు కూడా నడిచి ఉంటే బావుండేది.
స్వేచ్చా పోరాట సన్నివేశాలను అంటీముట్టనట్టు పరిచి చివర్లో మాత్రం అదే సినిమాలో ముఖ్యాంశం అన్నట్టు కృత్రిమంగా స్వాతంత్ర పోరాటాన్ని వేదికెక్కించాడు దర్శకుడు. . క్లయిమాక్స్ ర్యాలీ కొచ్చేసరికి అందరి ఆహార్యం పూర్తిగా మారిపోతుంది. అప్పటివరకూ నగల దుఖాణాల్లా వున్న సోనాక్షి సిన్హా లాంటి పాత్రలు కూడా మట్టి ముఖాలేసుకుని ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినాదాలిస్తుంటాయ్.
Ads
Share this Article