కొత్త పండగ
అక్షయ త్రితియ!
అక్షయ తృతీయరోజు విష్ణువును, ప్రత్యేకించి లక్ష్మీదేవిని పూజిస్తే అక్షయమయిన సిరిసంపదలు వచ్చి మన నట్టింట్లో పడతాయని ఒక నమ్మకం. మంచిదే.
లలితా నున్నటి గుండాయన డబ్బులెవరికీ ఊరికే రావు అని అంటాడు కానీ- అక్షయ తృతీయ రోజు పూజ చేస్తే కనకధార ఊరికే కురుస్తుందంటే కాదనాల్సిన పనిలేదు. అక్షయ తృతీయ రోజు ఏ దేవుడిని పూజించినా తరగని సంపద వస్తుందనేది ఇంకొంచెం బ్రాడర్ భక్తి సూత్రం. ఇదీ మంచిదే. అక్షయ తృతీయ వైశిష్ట్యం గురించి అసలు పురాణాల్లో ఎక్కడా లేదని మనం బాధపడాల్సిన పని లేదు. నగల దుకాణాల వారు రాసిన ఆధునిక పురాణాల నిండా అన్ని పర్వాల్లో లక్షణమయిన తృతీయ ఎప్పటికీ క్షయం కాకుండా అక్షయంగా ఉంది.
Ads
అక్షయ తృతీయ రోజు హీన పక్షం గుమ్మడికాయంత బంగారం కొంటే- ఇక వచ్చే అక్షయ తృతీయవరకు మన గుమ్మాల్లో బంగారం గుమ్ములు గుమ్మెత్తిపోయేలా విరగకాస్తుంటే మనం వాటిని దాచుకోవడానికి లాకర్లు చాలక పిచ్చెక్కిపోవాలి. అందునా అక్షయ తృతీయ రోజు ఉదయమే బ్రహ్మీ ముహూర్తంలో మూడున్నరకు లేచి చన్నీళ్ళ స్నానం చేసి ఆ తడి బట్టలతోనే బంగారం షాపుకెళ్లి కూరగాయల్లా సంచిలో బంగారం వేసుకుని సూర్యుడి తూరుపు కిరణాలు మన ముంగిట్లో పడేవేళకు సంచిలో బంగారాన్ని గుమ్మం మీద కుమ్మరిస్తే- ఇక లక్ష్మీ దేవి అవస్థ చూడాలి. ఇంట్లో నుండి వెళ్ళమన్నా వెళ్లలేక మనింట్లోనే ఉండిపోతానని మన కాళ్ళా వేళ్ళా పడుతూ ఉంటుంది. గుమ్మం అవతల ఆమె భర్త శ్రీ మహా విష్ణువు ప్లీజ్ ప్లీజ్ …మా ఆవిడను మా వైకుంఠానికి పంపండి అని మన గుమ్మం పట్టుకుని వేలాడుతూ ఉంటాడు.
ఏ శాస్త్రంలో, ఏ పురాణంలో ఎక్కడా ఎవరూ చెప్పకపోయినా- అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం ఒక అంటువ్యాధిలా ప్రబలింది. నిజానికి అక్షయ తృతీయ అంతో ఇంతో ఉత్తర భారతీయులు జరుపుకునే పండుగ.
టీ వీ సీరియళ్లు వచ్చాక పిండిపట్టే జల్లెడపెట్టి భర్తను- చంద్రుడిని మార్చి మార్చి చూసే కర్వా చౌత్ ను మనం అర్థం చేసుకుంటున్నాం. ఆనందిస్తున్నాం. వీలయితే మనం కూడా భర్త మొహాన జల్లెడ కొడుతున్నాం. అలాగే అక్షయ తృతీయ కూడా. ఒకప్పుడు కేవలం బంగారం వ్యాపారం చేసుకునే వారికి పరిమితమయిన ఈ పండగ ఇప్పుడు సార్వ జనీనమై- అప్పు చేసి అయినా బంగారం కొనాలన్నంత మాస్ హిస్టీరియాగా మారింది. ఇందులో నగల దుకాణాల మార్కెటింగ్ టెక్నిక్కులు కూడా ఫలించాయి.
బంగారం మీద మన మోజు ఈనాటిది కాదు. యుగాలది. బంగారం లాంటి మనిషి. బంగారు కొండ. బంగారు కుటుంబం. నీ ఇల్లు బంగారం కాను. సువర్ణాక్షరాలతో లిఖించడం. ఒళ్ళంతా బంగారం. బంగారు పంజరం. స్వర్ణాభరణాలు. బంగారు తూగుటుయ్యాల. బంగారు గోపురం. పలుకే బంగారం. స్వర్ణ సింహాసనం. స్వర్ణ వర్ణం. బంగారానికి తావి అబ్బినట్లు. మెరిసేదంతా బంగారం కాదు. బంగారం పండే భూమి. బంగారంలాటి పంట. ఇలా మన బతుకంతా బంగారు మాయం. భాషంతా బంగారుమయం. మన బంగారం మంచిదయితే కదా … ఇతరులను అనడానికి?
ఆ వీక్ నెస్ మీద బంగారం షాపుల వాళ్లు అక్షయ తృతీయ సెంటిమెంటును ఆయింట్ మెంటుగా పూసి బంగారు వల విసిరారు. మనం ఆ బంగారు వలలో చిక్కున్నాం.
అక్షయ తృతీయకు ముందే ప్రకటనల కోయిలలు కొమ్మెక్కి కూయడం కూడా మార్కెట్ సూత్రమే. గుండాయన షరా మాములుగా గుళ్లోకి వెళ్లి…పూజ చేస్తూ అక్షయ తృతీయకు బంగారం కొనలేదా? అని పవిత్ర హృదయంతో, ప్రశాంత వదనంతో, నిర్మల వాక్కుతో అడుగుతున్నాడు. పెద్ద పెద్ద బంగారం దుకాణాలు ఇంగ్లిష్ లో అలోచించి…తెలుగులో లేని “త్రితియా” విభక్తులు సృష్టించి బంగారు వలలు వేస్తున్నాయి.
ఈ అక్షయ “త్రితియకు”
అగ్గువకు బంగారు అమ్ముతారట. “కొనండి ఎక్కువ- ఆదా ఎక్కువ”. ఎంత ఎక్కువ కొంటే అంత ఎక్కువ ఆదా. పది కేజీలు కొని స్టోర్ రూమ్ లో వేసేయండి. పడి ఉంటుంది.
బంగారంలాంటి తెలుగు వర్ణమాలలో ఎన్నెన్నో వర్ణాలు మనం వాడక వర్ణరహితమై…కాలగర్భంలో కలసిపోయాయి. ఇప్పుడు రాయడం రాని బంగారం దుకాణాలవారి వల్ల “తృ”తీయలో వట్రసుడి ఊపిరిపోయి “త్రితి”య అయ్యింది. కొన్నిరోజులకు బంగారంలాంటి క్రావడి గొంతుకూడా నులిమేసేలా ఉన్నారు. అప్పుడు “తితియ” అన్నా తీయ తీయగానే ఉంటుందేమో!
భాషదేముంది? చావగొట్టి చెవులు మూస్తే…ఒక మూలన పడి ఉంటుంది. ఇంతకూ మీరు త్రితియ శుభవేళ బంగారు కొనడానికి బ్యాగులు సిద్ధం చేసుకున్నారా? బ్యాగులనిండా నోట్ల కట్టలు కుక్కారా? చేతిలో చిల్లి గవ్వ లేకపోతే బ్యాంకులకెళ్లి అప్పు చేసైనా త్రితియ రోజు కిలోల లెక్కన బంగారు కొనండి. అప్పు ఎగ్గొట్టేవారికి బ్యాంకులు పిలిచి మరీ వేల కోట్లు ఇస్తూ ఉంటాయి! మంచి తరుణం మించిన దొరకదు.
మన బంగారం మంచిదైతే కదా! ఎదుటివారిని అనడానికి? -పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article