Murali Buddha వాల్ మీద కనిపించింది ఇది… అరివీర భయంకరమైన థంబ్ నెయిల్… టీవీ5 మెయిన్ స్ట్రీమ్ ఛానెలే… లోగోలో ఉన్నట్టు తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో అయిదో ప్లేసు కావచ్చు బహుశా… ‘‘రేయ్ రెడ్డీ… జగన్‌ను బొక్కలో తోస్తా’’ అని మోడీ జగన్‌ను హెచ్చరించినట్టు ఆ థంబ్ నెయిల్… అదీ అనకాపల్లి కూటమి సభలో…
అవును మరి… సోషల్ మీడియా ప్రింట్, టీవీ మీడియాను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నదే కదా… మరి యూట్యూబ్ చానెళ్లు ప్రవేశపెట్టిన దిక్కుమాలిన థంబ్ నెయిల్ జర్నలిజం జస్ట్, అలా అలా కోవిడ్ వైరస్ పాకినట్టుగా మెయిన్ స్ట్రీమ్ చానెళ్లకు కూడా పాకిపోయింది… అసలే ఇమ్యూనిటీ లెవల్స్ తక్కువ కదా, అనగా ప్రొఫెషనల్, మోరల్ లెవల్స్ అన్నమాట…
ఆ థంబ్ నెయిల్ చూడగానే… హమ్మా, మోడీ అంత మాటన్నాడా..? రేయ్ రెడ్డీ అని సంబోధించాడా..? బొక్కలో తోస్తా అన్నాడా..? పవన్ కల్యాణ్ అక్కడికక్కడ ఆవహించినట్టుగా తాట తీస్తా అని కూడా అనేసి ఉంటాడా..? తోలు తీస్తా అన్నాడా..? అరెరె, ఆయనేమైనా కేసీయారా..? రేవంతా..? బూతులు, ఇలాంటి భాష వాడటానికి… పవన్, చంద్రబాబు కూడా కాదు కదా కనీసం… మరేమిటి ఈ భాష..?
Ads
అఫ్ కోర్స్, ఈ తాటలు తీసే పని మీద పవన్ కల్యాణ్‌దే పేటెంట్… షూటింగు విరామాల్లో మస్తు మంది తాటలు తీశాడు ఇప్పటిదాకా… సరే, మోడీకి అకస్మాత్తుగా ఏమైంది..? అదే టీవీ5 సాంబశివుడు ఆవహించాడా..? అవునూ, తెలుగులో రేయ్ రెడ్డీ అని ఉంటాడా…? ఏమో, అనే ఉంటాడేమో… తను ఏ రాష్ట్రం వెళ్లినా ఆ భాషలో నాలుగు వాక్యాలు రాయించుకుని, అదే అప్పగిస్తాడు కదా… తనకు అలాగే రేయ్ రెడ్డీ, బొక్కలో తోస్తా అని ఎవరైనా రాసిచ్చి ఉంటారా..?
ఈ డౌటనుమానాలు సహజమే కదా… 27 నిమిషాల స్పీచ్, దాని అనువాదం మొత్తం విన్నా సరే, అసలు ఒక్క పరుష పదమూ లేదు… అసలు మోడీ ప్రసంగభాషలో తిట్లు, శాపనార్థాలే ఉండవు, అలాంటిది ఈ దిక్కుమాలిన పదాలు వాడటానికి తనేమైనా పవన్ కల్యాణా..? ఏదో అవసరానికి పవన్ కల్యాణ్, చంద్రబాబులతో చేతులు కలిపితే ఇక ఆ ఇద్దరి క్షుద్ర భాషే మోడీ కూడా వాడతాడా ఏం..?
యెల్లో కూటమితో జతకట్టినంత మాత్రాన జగన్ మీద ద్వేషం ఏమీ ఉండదు మోడీకి… ఫాఫం, ఇన్నేళ్లూ చెప్పినట్టుగానే ఆడాడు కదా… పైగా మొన్న కూడా ఏదో టీవీ ఇంటర్వ్యూలో మోడీతో సైద్ధాంతిక విభేదాలే తప్ప మంచి రాజకీయ నాయకుడు అని జగన్ సర్టిఫికెట్ కూడా ఇచ్చాడు… మోడీని అడ్డగోలుగా ఇష్టమొచ్చినట్టు తిట్టిపోయడానికి తను పాత చంద్రబాబు కూడా కాదు కదా…
ఆ మొత్తం మోడీ ప్రసంగంలో ఏపీలో అవినీతి గురించి, తప్పదు కాబట్టి… యెల్లో కూటమి సభ్యుడు కాబట్టి… ‘‘ఇక్కడ ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, సారా మాఫియా… అందుకే ఎన్డీయే సర్కారును తెచ్చుకోవాలి…’’ అన్నాడు క్లుప్తంగా… వార్నీ, ఈమాత్రం దానికి బొక్కలో తోస్తా, తాట తీస్తా అని మోడీ హెచ్చరించినట్టు థంబ్ నెయిల్ పెడతారా అని హాశ్చర్యపోవద్దు… ప్రస్తుతం యెల్లో కూటమి మీడియా మొత్తం ఆ బాటలోనే ఉంది…
ఏమైనా రాసుకొండి, మోడీ ఖండించడు కదా… ఫాఫం, తెలుగు చానెళ్ల థంబ్ నెయిళ్లు చదువుతూ కూర్చోడు కదా… రేయ్, ఎవర్రా అక్కడ, ఈ చానెలోడి లైసెన్స్ రద్దు చేయండర్రా అని అక్కడికక్కడ ఆదేశించడు కదా… ఏమో, అన్నీ సభలోనే చెప్పాలని ఏముంది..? జగన్‌ను బొక్కలో తోస్తాను అని మోడీ ప్రైవేటుగా టీవీ5 నాయుడికి చెప్పి ఉంటాడేమో… నాయుడూ, నువ్వు కోరుకున్నట్టు రెడ్డిని బొక్కలో తోస్తానులే అని హామీ ఇచ్చి ఉంటాడు… ఆయన తన టీంకు చెప్పి ఉంటాడు, వాళ్లు రెచ్చిపోయి అదే థంబ్ నెయిల్ పెట్టిఉంటారు అనుకుందామా..,?
అబ్బే, దానికీ చాన్స్ లేదు… ఎందుకంటే బొక్కలో తోస్తా అని మోడీ తెలుగులో చెప్పలేడు.,. తనకు తెలుగు రాదు, నాయుడికి హిందీ రాదు, గుజరాతీ అసలే రాదు… ఆ భాషల్లో బొక్కను, తోయడాన్ని ఏమంటారో మనకూ తెలియదు… ఇంగ్లిషులోనూ ఈ బొక్కకు సరైన పదం ఉన్నట్టు లేదు… అదేదో పాత సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం కామెడీ సీన్లో ‘కాలేజీకి బొక్క పడింది…’ అని వివరిస్తుంటాడు కదా… అది గుర్తొచ్చింది ఈ థంబ్ నెయిల్ చూడగానే… అవునూ, తాట తీస్తాను అనడానికి ఇంగ్లిషు, హిందీల్లో ఏమంటారు..?!
Share this Article