Subramanyam Dogiparthi…… 1971 సంవత్సరం అక్కినేనిది . దసరా బుల్లోడు జైత్రయాత్ర కొనసాగుతూ ఉండగానే వర్షాల్లో వచ్చింది ప్రేమనగర్ . సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ . కమర్షియల్ కళాఖండం . Classic . కోడూరి కౌసల్యాదేవి వ్రాసిన నవల ఆధారంగా కె యస్ ప్రకాశరావు , ఆచార్య ఆత్రేయ ద్వయం మలిచిన ప్రేమ సినీ శిల్పం . అక్కినేని , వాణిశ్రీ పోటాపోటీగా నటించి తమను తాము నట హిమాలయాల పైన కూర్చోబెట్టుకున్నారు . ఒక్కరి పేరే చెప్పాలంటే వాణిశ్రీ పేరే చెప్పాలి . ఆమె ఆత్మాభిమానం , డైలాగ్ డెలివరీ , అందం , ఆహార్యం , నటన సూపర్బ్ . సావిత్రిని కూడా దాటేసిందా అనిపిస్తుంది .
తర్వాత మెచ్చుకోవలసింది ఆత్రేయనే . మాటలు , పాటలు ఎంత గొప్పగా వ్రాసారంటే మాయాబజార్ , గుండక్క కధ సినిమాల్లో ఎలా అయితే పింగళి , నరసరాజు గార్ల మాటల్లో ఒక్క మాటను కూడా తొలగించలేమో , అలాగే ఈ సినిమాలో ఆత్రేయ మాటల్లో ఒక్క మాటని కూడా తొలగించలేం . ఇంక పాటలు . అన్నీ ఆత్రేయే వ్రాసారు . ఒక్కో పాట ఒక్కో మణిపూస . నాకయితే ఈ సినిమాలో పాటలన్నీ నోటికొచ్చేసాయి . అలాగే మాటలు కూడా . చివరకు రాజబాబు , కె వి చలం , రమాప్రభ డైలాగులతో సహా .
విమానంలో దువ్వూరి వారి పద్యంతో ప్రారంభమయి , నేను పుట్టాను , ఉంటే ఈ ఊళ్ళో ఉండు పోతే మీ దేశం పోరా , లే లే లేలేలే నా రాజా మూడు పాటలు జనాన్ని థియేటర్లో వీరంగం వేయించాయి . జయకుమారి , లక్ష్మీ ఛాయ , జ్యోతిలక్ష్మి ముగ్గురూ అక్కినేనితో నృత్య విహారం చేసారు . నాకు అద్భుతంగా నచ్చిన పాట తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా పాట . ఆ పాటలో వాణిశ్రీ అందం , అక్కినేని చూపులు ఎప్పటికీ మరవలేనివి .
కడవెత్తుకొచ్చిందీ కన్నె పిల్లా అది కనపడితే చాలు నా గుండె గుల్లా , ఎవరో రావాలి ఈ వీణను కదిలించాలి , ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్య నందనం , మనసు గతి ఇంతే మనిషి బతుకింతే పాటలు ఒక్కోటి ఒక్కో మాణిక్యం . కె వి మహదేవన్ సంగీతం ఆత్రేయ సాహిత్యానికి శాశ్వత ప్రాణం పోసింది .
ఈ సినిమాలో పెరుమాళ్ళు దగ్గర నుండి అక్కినేని , వాణిశ్రీల దాకా ఏ ఒక్కరి నటనలో కూడా చిన్న లోపాన్ని కూడా పట్టుకోలేం . అంత గొప్ప దర్శకత్వం . అదృష్టం కలిసొస్తే అన్నీ అలానే కలిసొస్తాయి . నష్టాల్లో కూరుకుపోయి , తట్టాబుట్టా సర్దేసుకుని కారంచేడు వచ్చేందుకు సిధ్ధమవుతున్న రామానాయుడు card show count ఆడితే , డీల్ పడి కనక వర్షం కురిపించింది . సినీ మొఘల్ని చేసింది . విజయా వారితో కలిసి తీసిన ఈ సినిమా బలం విజయా వారి సినిమాలలాగానే స్క్రీన్ ప్లే , సమిష్టి కృషి . అందువలనే మరో మాయాబజార్ , గుండక్క కధ లాగా తెలుగు సినీ చరిత్రలో మిగిలిపోయింది .
ఏంది మిస్సో ఈ న్యూసెన్సు అనే నల్ల రామ్మూర్తి డైలాగ్ కూడా పాపులర్ అయింది . వాడెట్టాడు ఇంక నువ్వెడతావ్ అనే రమాప్రభ డైలాగ్ కూడా పేలిపోయింది . శాంతకుమారి , సత్యనారాయణ , యస్ వరలక్ష్మి , గుమ్మడి , హేమలత , కాకరాల , మీనాకుమారి అందరూ ఎవరికి వారు తపస్సు చేసారనే చెప్పొచ్చు .
తెలుగులో ఎలా అయితే వీరవిహారం చేసిందో అలాగే తమిళంలో , హిందీలో కూడా వీరవిహారం చేసింది . తమిళంలో వసంత మాళిగై టైటిల్ తో శివాజీ , వాణిశ్రీ నటించగా , హిందీలో అదే టైటిల్ తో రాజేష్ ఖన్నా , హేమమాలినిలు నటించారు . అక్కినేని , వాణిశ్రీల జోడే సూపర్ జోడీగా జనం మెచ్చుకున్నారు .
కాలేజి రోజుల్లో , తర్వాత లెక్చరర్ అయ్యాక , ఇప్పుడు ముసలోడిని అయ్యాక కూడా చూస్తూనే ఉన్నా ఈ సినిమాను . ఓ ఇరవై సార్లు చూసి ఉంటానేమో ఈ దృశ్య కావ్యాన్ని . యూట్యూబులో ఉంది . చూడనివారు ఎవరయినా ఉంటే అర్జెంటుగా చూసేయండి . అక్కినేని నటించిన సినిమాల్లో ఇంత అందమైన సినిమా మరొకటి లేదని నా నిశ్చిత అభిప్రాయం .
Share this Article
Ads