శ్యామ్ పిట్రోడా… కాంగ్రెస్ పార్టీకి ఓ గుదిబండలా మారాడు … తనను ఎందుకు వదిలించుకోలేకపోతుందో ఏమో కాంగ్రెస్ పార్టీ..! ఎన్నికల కీలక దశలో ఆయన చేసే వ్యాఖ్యలు పార్టీకే నష్టం కలిగిస్తున్నాయి… వాటి లోతుల్లోకి, ఆయన ఉద్దేశాల్లోకి ఎవరూ వెళ్లేంత సీన్ ఉండదు పోలింగ్ వేడిలో… ఎదుటి పార్టీ అమాంతం ఆయన వ్యాఖ్యల్ని అందుకుని కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేస్తోంది…
అబ్బే, అవి ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలు, పార్టీకి సంబంధం లేదు, మేం సమర్థించడం లేదు అనే డ్యామేజీ కంట్రోల్ కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జైరాంరమేష్ నుంచి వచ్చేలోపు బీజేపీ చేయాల్సిన డ్యామేజీ చేసేసింది… ఆమధ్య అమెరికాలోని వారసత్వ పన్నును ప్రస్తావిస్తూ వివాదాన్ని రాజేశాడు… అది మా పార్టీ అధికారిక విధానం కాదని ఏకంగా ఖర్గే తోసిపుచ్చాల్సి వచ్చింది… ఇప్పుడేమో పిట్రోడా మరో పిచ్చి వివాదాన్ని తలకెత్తుకున్నాడు…
భారతదేశంలో దక్షిణాన ప్రజలు ఆఫ్రికన్లలాగా, తూర్పున చైనీయుల్లాగా, పశ్చిమాన అరబ్బుల్లాగా, ఉత్తరాన శ్వేతజాతీయుల్లాగా కనిపిస్తారు అంటూ పిచ్చి కూతలకు దిగాడు… నిజానికి దేశంలోని వైవిధ్యాన్ని, అనేకంలోని ఏకతను చెప్పడం ఆయన ఉద్దేశం… అనేక భాషలు, అనేక జాతులు, అనేక సంస్కృతులు అయినా సరే, చిన్న చిన్న తగాదాలు తప్ప 75 ఏళ్లుగా కలిసి మెలిసి ఉంటున్న నిజమైన ప్రజాస్వామిక దేశం అని చెప్పాలనుకున్నాడు… దేశంలోని ఏయే ప్రాంతాల ప్రజల రూట్స్ ఏమిటి..? ఎక్కడి నుంచి వచ్చారు..? జాతుల నడుమ తేడాలేమిటి అనే అకడమిక్ చర్చ చాన్నాళ్లుగా ఉంది…
Ads
కానీ పిట్రోడా తను ఏం చెప్పాలనుకున్నాడో గానీ చెప్పిన తీరు మాత్రం మొరటుగా ఉంది, సరైన తీరులో లేదు… దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లలాగా కనిపించడం ఏమిటి..? నాన్సెన్స్… అలాగే ఈశాన్యం, తూర్పు ప్రాంతాల్లో ప్రజలు చైనీయులు ఏమిటి..? ఇది ఒకరకంగా ప్రజల వర్ణాన్ని, రూపురేఖల్ని అవమానించడమే… అదే అందుకుంది బీజేపీ… వెంటనే అస్సోం సీఎం ట్విట్టర్ తెరపైకి వేగంగా వచ్చేసి, నేను ఈశాన్యమే, కానీ నేను ఇండియన్, అలాగే కనిపిస్తాను… దేశంలో బోలెడంత వైవిధ్యం, కానీ అందరూ ఒకటే… కనీసం ఈ ఒక్క విషయాన్నైనా సరిగ్గా అర్థం చేసుకో’ అని కౌంటర్ ఇచ్చేశాడు…
కంగనా రనౌత్ అయితే ఈ పోలికలు, ఈ వ్యాఖ్యలు జాతివివక్షే అంటూ తీర్మానించేసింది… రాహుల్ గాంధీ గురువు కదా, ఇలాగే మాట్లాడతాడు అని రాహుల్ వైపు తిప్పేసింది ఇష్యూను… ఇప్పుడిక ప్రధాని మోడీయే శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై మండిపడ్డాడు… శరీరవర్ణం ఆధారంగా దేశప్రజల్ని అవమానించడానికి, విభజించడానికి ఇదొక ప్రయత్నమని ఎదురుదాడికి దిగాడు… శ్రీకృష్ణుడి శరీరవర్ణం కూడా నలుపే అని గుర్తుచేశాడు… రాహుల్ గాంధీ సమాధానం ఇవ్వాలన్నాడు… అంతేకాదు, ఇష్యూకు ఇంకాస్త ట్విస్ట్ యాడ్ చేస్తూ… కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని ఎందుకు వ్యతిరేకించిందో ఇప్పుడు అర్థమవుతోందన్నాడు…
రవిశంకర్ ప్రసాద్, నిర్మలా సీతారామన్ వంటి ప్రముఖులే గాకుండా చివరకు శివసేన వంటి కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా డిఫెన్స్‌లో పడ్డాయి పిట్రోడా అనాలోచిత వ్యాఖ్యలతో… శివసేన లీడర్ ప్రియాంక చతుర్వేది పిట్రోడా వ్యాఖ్యల్ని కొట్టిపారేసింది… ‘ఆయనేమైనా కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ మెంబరా..? స్టార్ క్యాంపెయినరా..? అసలు ఈ దేశంలో ఉంటాడా..? అంటూ ప్రశ్నించింది ఆమె… కాంగ్రెస్‌ను నష్టపరచడానికి మోడీలు, యోగీలకన్నా ఇలాంటి శ్యామ్ పిట్రోడాలే ఎక్కువ ప్రయత్నిస్తున్నట్టున్నారు..!!
Share this Article