ఈరోజు పొద్దున అన్ని పత్రికల్లోనూ ఒక బీజేపీ యాడ్… ఫస్ట్ పేజీ… అందులో ఉన్నదేమిటయ్యా అంటే… అందరికీ ఉచిత వైద్యం, అవ్వాతాతల ఆరోగ్యానికి మన మోడీ గ్యారంటీ… 5 లక్షల వరకూ ఉచిత వైద్యం అనేది ఆ ప్రకటన సారాంశం…
ఇది పాజిటివ్ ప్రచారం… కాంగ్రెసోళ్లు గెలిస్తే ముస్లింలకు మన ఆస్తులు పంచుతారు, పుస్తెలు కూడా మిగలనివ్వరు, అయోధ్య గుడికి బాబ్రీ లాక్ వేస్తారు దాకా ప్రధాని నెగెటివ్ ప్రచారం వెళ్లిపోయింది ఈసారి… అఫ్‌కోర్స్, రాజ్యాంగం రద్దు, రిజర్వేషన్లు రద్దు, మళ్లీ ఎన్నికలే ఉండవు వంటి ఇండి కూటమి ప్రచారానికి మోడీ మార్క్ కౌంటర్లు పడుతూనే ఉన్నయ్… కానీ ఓ పరిమితి దాటిపోయినయ్ ఇవన్నీ…
చాలామంది రాజకీయ పరిశీలకుల అబ్జర్వేషన్ స్టాక్ ఎక్స్‌చేంజ్ మీద ఉంది… అది పడుతూనే ఉంది… పడటానికి బోలెడు కారణాలున్నా సరే… మూడు దశల పోలింగ్ సరళి చూశాక మార్కెట్‌లో బీజేపీ అలవోక గెలుపు మీద సందేహాలు వ్యాపించినట్టు స్పష్టమవుతోంది… సొంతంగా 370 ఇవ్వండి, ఎన్డీయేకు 400 ఇవ్వండి అని రాజకీయంగా ఎన్ని అప్పీళ్లు చేసుకున్నా సరే, ఎక్కడో కంఫర్టబుల్ విన్నింగ్‌కు సంబంధించి తేడా కొడుతున్నట్టుంది…
Ads
అందుకే మోడీ ఫుల్లు నెగెటివ్ క్యాంపెయిన్ లైన్ తీసుకున్నాడా..? సరే, ఈ యాడ్ విషయానికొస్తే… పదేళ్లలో మోడీ ఎదుగుదల ఓ అబ్బురం… ప్రపంచ స్థాయి నాయకుడయ్యాడు… దేశం మొత్తమ్మీద తన పక్కన దీటుగా నిలబడగల వేరే నాయకుడు కనిపించడం లేదు… రెండు టరమ్స్ ప్రధానిగా చేసి, మూడో టరమ్‌కు ఉరకలు వేస్తున్నాడు… ఇవేనా..?
ఆర్టికల్ 370 రద్దు, సర్జికల్ స్ట్రయిక్స్, తక్షణ ట్రిపుల్ తలాక్ రద్దు, పౌరసత్వ సవరణ చట్టం, అయోధ్య గుడి నిర్మాణం వంటివి ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయలేనివి… కానీ నాణేనికి మరోవైపు మోడీ పాలన వైఫల్యాలు బోలెడు… నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి… పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు డబుల్… పైగా మోడీ మార్క్ పన్నులు సరేసరి… సొసైటీ ఇంత ఇచ్చింది కదా మోడీకి… మరి తను జనాన్ని ఇట్టే కనెక్టయి, నా దేశవాసుల రుణం తీర్చుకుంటున్నాను అని చెప్పుకునే ఏదైనా ఉపయుక్త పథకం ఉందా అని ఆలోచిస్తే జవాబు దొరకడం కష్టంగానే ఉంది…
ప్రత్యేకించి ఔషధ, ఆరోగ్య రంగం… అసలు ఫార్మసీ మీద పూర్తిగా కంట్రోల్ తప్పింది… మూడేళ్లలో ఔషధాల ధరలు ఎవరికివారు పెంచేసుకుంటూ దాదాపు డబుల్ చేశారు… తన టీం ఇగ్నోరెన్స్… ఆరోగ్య బీమా పథకాల ప్రీమియం దాదాపు డబుల్ చేశారు… పైగా రెగ్యులేటరీ నిఘా, నియంత్రణ సున్నా… ఈ స్థితిలో 5 లక్షల వరకు వైద్యం ఉచితం అంటున్నాడు గుడ్… కానీ దీన్నే 70 ఏళ్లు దాటినవారికి అని గాకుండా…
కనీసం ఈ విషయంలోనైనా కాస్త ఔదార్యం చూపించి 55 లేదా 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ… కులం, ప్రాంతం, ఆదాయం, మతం, వర్గం తేడాల్లేకుండా 10 లక్షల వరకూ బీమా పథకాన్ని గనుక ఆలోచించి ఉంటే మోడీ ఇంకా బలంగా కనెక్టయ్యేవాడు… ప్రత్యేకించి పేదల ఆరోగ్యానికి సంబంధించి కొన్ని తరాలు గుర్తుండేవాడు… గతంలో వైఎస్ ఆరోగ్యశ్రీ ద్వారా జనం మనస్సుల్లో నిలిచిపోయాడు… ఈ యాడ్‌లో కూడా ఓ పక్కకు చిన్నగా *అందరికీ అంటే అందరికీ* అని ప్రత్యేకంగా పేర్కొన్నారు… (అందరికీ అంటే జనం నమ్ముతారో లేదో అని డౌటున్నట్టుంది, అందుకే మళ్లీ ప్రత్యేకంగా నిలువుగా రాసుకొచ్చారు…)
పక్కా ఇళ్లు, రేషన్ వంటివి కేంద్రం ఇస్తున్నా సరే, అవన్నీ రాష్ట్రాల పథకాల్లో కలిసిపోతాయి, ప్రత్యేకంగా మోడీకి పేరు రాదు, నిజానికి కేంద్రానికి సపరేట్ పథకాలు అవసరమా అనే ప్రశ్న చాన్నాళ్లుగా విధానకర్తల్లో ఉంది… కేంద్ర ఆదాయంలో ఎంత వాటాను రాష్ట్రాలకు ట్రాన్స్‌ఫర్ చేయాలి, వాటి ఆర్థిక క్రమశిక్షణను ఎలా గాడిన పడేయాలనే దిశలో కేంద్రం ఆలోచిస్తే సరిపోతుందని ఆ చర్చల సారాంశం… ఉపాధి హామీ పథకంలో ఎన్ని లోపాలున్నా సరే, దాని నిర్వహణపై చాలా ఆరోపణలున్నా సరే, యూపీయే ప్రభుత్వానికి అలాంటి పథకాల్ని ఆలోచించి, అమల్లోకి తెచ్చిన చరిత్ర ఉంది… ఏమో, గత పదేళ్లలో మోడీ ప్రభుత్వం ఇలాంటి ఒక్క పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిందా అంటే జవాబు కష్టమే… నిజాలెప్పుడూ నిష్ఠురమే..!
Share this Article