ఎక్కడో ఏదో తేడా కొడుతోంది… హైదరాబాద్‌లో రాహుల్ సభకు జనం లేకపోవడం ఖచ్చితంగా కాంగ్రెస్ ఆత్మసమీక్ష అవసరమని తెలియజెబుతోంది… రేవంత్ రెడ్డిని బలహీనపరచడానికి ఏమైనా ప్రయత్నాలా..? ఈ ఎన్నికల్లో సరైన సీట్లు రాకపోతే తనను బలిపెట్టాలనే ఆలోచనలా..?
సభాస్థలికి జనం రాకపోవడంతో చాలాసేపు రాహుల్ వెయిట్ చేయాల్సి వచ్చింది… జన సమీకరణ దాకా ఎందుకు..? నగరంలోని కేడర్ సరిగ్గా హాజరైతే చాలు కదా సభాస్థలి నిండుగా కనిపించడానికి… నిజానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సిటీ, మెదక్ ప్రాంతాల్లో మాత్రమే బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకుని, ఉనికిని నిరూపించుకుంది… లేకపోతే ఇంకెంత ఘోరంగా ఉండేదో దాని సిట్యుయేషన్…
తరువాత పోలోమంటూ హైదరాబాద్, మెదక్ ప్రాంతాల బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లోకి వరుస కట్టారు… చాలామంది నగర నేతలు వచ్చారు సరే, మరి ఏకంగా రాహుల్ గాంధీ మీటింగుకే ఈ పూర్ రెస్పాన్స్ ఏమిటి..? ఎక్కడ ఉంది లోపం..? ఇదీ ప్రశ్న… ఈ సభ కూడా మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించింది… ఎవరికి వారు రాజుగారి పాల బిందెకు పాలు తెచ్చినట్టు… వాళ్లు జనాన్ని తీసుకొస్తారని వీళ్లు, వీళ్లు తెస్తారని వాళ్లు వదిలేశారా..?
Ads
అసలే హైదరాబాద్ నగర పరిధిలో బీజేపీ బాగానే బలపడింది… అప్పట్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఠారెత్తించింది… ఈ స్థితిలో నగరంలో బీజేపీ దూకుడును నిలువరించాలంటే పక్కా వ్యూహాలు, ప్రయత్నాలు కావాలి… కానీ అది లోపించింది… ఒకవైపు రేవంత్ రాష్ట్రవ్యాప్తంగా పాల్గొంటున్న సభలు బాగానే జరుగుతున్నాయి… జనం నుంచి స్పందన బాగానే ఉంది, కానీ రాజధానిలో మాత్రం భిన్నంగా కనిపిస్తోంది…
పీసీసీ అధ్యక్షుడు తనే, ముఖ్యమంత్రీ తనే కాబట్టి రాహుల్ సభ ఫెయిల్యూర్‌పై అందరి వేళ్లూ రేవంత్ వైపే చూపిస్తుంటాయి, సహజం… ఇక్కడ జరగాల్సిన సమీక్ష ఏమిటంటే..? ఎవరెవరికి ఏయే బాధ్యతలు అప్పగించారు, ఎక్కడ ఫెయిల్యూర్లు, ఎవరు బాధ్యులు… ఇవీ తేలాలి… లేకపోతే దీని ప్రభావం ఐదారు నియోజకవర్గాల్లో ఉంటుంది… పోల్ మేనేజ్‌మెంటూ ముఖ్యమే…
సిటీలో కాంగ్రెస్‌కు స్పందన బాగా లేదంటే దానికి బీఆర్ఎస్ ఇంకా పుంజుకుందని కాదు అర్థం… దానికంత సీన్ లేదు, పోటీ బలంగా బీజేపీ వైపు నుంచి కనిపిస్తోంది… సిటీలో వోటర్ల నుంచి రెస్పాన్స్ బాగానే కనిపిస్తోంది మోడీ పట్ల… మరీ ఓల్డ్ సిటీలో బీజేపీ అభ్యర్థిని ఒవైసీని పరుగులు పెట్టిస్తోంది… ఆమె గెలుస్తుందా లేదానేది తరువాత… అంతటి ఒవైసీని కూడా కాషాయ రుమాలు కూడా కట్టించి, గుళ్లకు కూడా పంపిస్తోంది…
అన్నట్టు… అక్కడెక్కడో భైంసాలో కేటీయార్ ప్రోగ్రాంపై రాళ్ల దాడి జరిగిందట నిజమేనా..? నిజమేననీ, తనకేమీ కాలేదనీ, అది బీజేపీ గూండాల పనేననీ కేటీయార్ ట్వీట్ చేసినట్టున్నాడు… అప్పట్లో భైంసాలో అల్లర్లు జరిగినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించి, బీజేపీ కేడర్‌ను బాగా సతాయించిందనే కోపం కాషాయ శిబిరంలో బాగా ఉంది… బహుశా ఇది ఆ ఆగ్రహ ప్రదర్శనే కావచ్చు..!!
Share this Article