పూజకు పనికిరాని పువ్వు అంటూ ఏమి ఉంటుంది..? అన్నీ ఆ దేవుడు సృష్టించిన ప్రకృతి ప్రసాదాలే కదా అంటారా..? లేదు… దేవుడి నిర్ణయాలకన్నా దేవుడి పూజించేవాళ్ల నిర్ణయాలే అంతిమం… తిరుగు లేదు… విషయం ఏమిటంటే..? కేరళలో దాదాపు 2500 పైచిలుకు గుళ్లలో ఓ తరహా పూలను పూజకు నిషేధించారు…
వాటి వాసన సోకకూడదు, ప్రసాదాల దగ్గర కనిపించకూడదు, దేవుడికి మాలలు వేయకూడదు… చివరకు విగ్రహంపై కూడా పడకూడదు… ఆ పూలే గన్నేరు పూలు… అదేమిటి..? గన్నేరు పప్పు విషం అంటారు గానీ, గన్నేరు పూలకు ఏమొచ్చింది రోగం… ఎంచక్కా ఎన్నెన్నో తరాలుగా దేవుళ్లందరి సేవకూ వాడుతున్నాం కదా అంటారా..? నో…!
ఇవి గన్నేరులో ఓ తరహా… ఎర్ర గన్నేరు అంటారా..? ఇంకేదైనా పేరుందా తెలియదు… ఇంగ్లిషులో ఒలియాండర్ (Oleander) పూలు అంటాం… ఇవిగో ఇవీ…
Ads
కేరళలోని రెండు ప్రధాన దేవస్థాన బోర్డులు… ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డ్, మలబార్ దేవస్వామ్ బోర్డ్… వీటి పరిధిలో దాదాపు 2500 పైచిలుకు గుళ్లున్నాయి… ఇకపై ఈ గుళ్లల్లో ఈ ఒలియాండర్ లేదా అరళి లేదా ఎర్రగన్నేరు పూలను నిషేధించారు… మనుషులతోపాటు జంతువులకు కూడా ఇవి ప్రమాదకరమనే భావనతో ఈ నిర్ణయం…
నిజానికి ఈ పూలు, కాండం, ఆకులు, విత్తనాలు, వేళ్ల నుంచి కేన్సర్ నిరోధక మందులు తయారు చేస్తున్నట్టు బోలెడు యూట్యూబ్ వీడియోలు వచ్చాయి… అంతా హంబగ్… ఇవి నేరుగా తింటే పరలోక ప్రయాణమే… జోక్ కాదు, నిజం… పలుచోట్ల జాతీయ రహదారుల నడుమ డివైడర్లలో పెంచుతున్నారు వీటిని… అది మరో విషాదం…
ఈ అరళి పూల బదులు ఇకపై తులసి, తేచి (ఇక్సోరా), మల్లె, చామంతి, గులాబీ వంటి పూలను మాత్రమే వాడతారు… అసలేమైందీ అంటారా..? కేరళలోని అలప్పుజలో ఈ ఒలియాండర్ అనగా కేరళలో అరళిగా పిలిచే ఈ పూలు తినడం వల్ల ఓ యువతి మరణించింది ఈమధ్య… వీటిని తిని జంతువులు మరణించిన ఉదంతాలూ ఉన్నాయి…
ఈ అరళి ఆకులను, పూలను 24 ఏళ్ల సూర్యా సురేంద్రన్ అనే యువతి అనుకోకుండా తిన్నది… నర్సింగ్ ఉద్యోగంలో చేరడానికి ఆమె యూకే వెళ్లాల్సి ఉంది… విమానాశ్రయానికి వెళ్తూ వీటిని నోట్లో వేసుకుంది… వెంటనే కుప్పకూలింది… ఏదో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు గానీ ఫలితం లేదు, అక్కడే మరణించింది…
నిజానికి ఎడారి గులాబీగా పిలిచే ఈ మొక్క నేరుగా తీసుకుంటే విషం… పాము విషంతో సమానం… కానీ పాము విషం కూడా ఔషధమే అని తెలుసు కదా, ఈ ఒలియాండర్ మొక్కను ఔషధాల్లో వాడితే అస్త్మా, ఎపిలెప్సీ, రుతు బాధలు, మలేరియా, చర్మవ్యాధులు, తామర, దురద, అజీర్ణం వంటి సమస్యలకు వీటిని వాడటం ఏనాటి నుంచో ఉంది… సరిగ్గా వాడగలిగితే ఇది మూలికా వైద్యంలో అపూర్వం… 15 వ శతాబ్దం నుంచీ వాడుతున్నారు…
మరి ఇంత ఉపయోగకరమైన మొక్క పుష్పాలు పూజకు పనికిరాకపోవడం ఏమిటీ అంటారా..? దేవుడికి సమర్పించబడే పూలకు పరిమళం, వర్ణం ముఖ్యం, ప్రమాదరాహిత్యం అంతకన్నా ముఖ్యం… సో, లేటైనా సరే, గుళ్లు ఆ పూల జోలికి పోవద్దనే నిర్ణయం తీసుకోవడం హర్షణీయమే..!!
Share this Article