ప్రజెంట్ పాపులర్ రైటర్స్ మీద ఏదో వ్యాసం చదువుతుంటే… కొన్ని అంశాలు ఆసక్తికరంగా అనిపించాయి… 1) అందరూ అనుకున్నట్టు ప్రజల్లో పఠనాసక్తి ఏమీ చచ్చిపోలేదు… చేతన భగత్ పుస్తకాలు కొన్ని 70 లక్షలు అమ్ముడయ్యాయి… అమిష్ రాసినవి 50 లక్షలు… అనేక భాషల్లోకి అనువాదం… వీళ్లు రియల్ పాన్ ఇండియా స్టోరీ టెల్లర్స్… 2) పాత పురాణాలను కూడా కొత్త పద్దతుల్లో, కొత్తకొత్తగా చెబుతున్న తీరు పాఠకుడిని ఆకట్టుకుంటోంది… ఉదాహరణకు భారతాన్ని భీముడి కోణంలో, రామాయణాన్ని తార కోణంలో చెప్పడం వంటివి… 3) పుస్తకాల మార్కెటింగ్ పద్ధతే మారిపోయింది… ఫిజికల్, డిజిటల్ సమానంగా ఉంటున్నయ్… పుస్తకాల ఎగ్జిబిషన్లు, దుకాణాల్లో పుస్తకాలు కొనడం తగ్గిపోయింది… ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే ఇంటికే వస్తుంది పుస్తకం… 4) అన్నింటికీ మించి పుస్తకాలకు ఆవిష్కరణ సభలు పెట్టి, ఆ వార్తలు రాయించుకుని, పుస్తకాల సమీక్షలు పత్రికల్లో వస్తాయని ఎదురుచూడటం గట్రా రాతియుగం పద్థతి అయిపోయిందిప్పుడు… సైలెంటుగా పుస్తకం రిలీజ్ చేసేయడమే… రిలీజ్కు నెలల ముందే భారీగా ఆన్లైన్ ఆర్డర్లు పొందుతున్న రచయితలూ ఉన్నారు… పాఠకుడి ఇంటికి పుస్తకం చేరడమే రిలీజ్…
ఇదంతా మదిలోకి వస్తుంటే… ఓ వార్త చటుక్కున మధ్యలో చొరబడింది… అది ఈమధ్య వెంకయ్యనాయుడు ఆవిష్కరించిన ఓ పుస్తకం… ఒక రాజకీయ నాయకుడి మీద రాసిన ఓ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ఈ దేశపు ఉపరాష్ట్రపతి ఢిల్లీ నుంచి హైదరాబాద్ తరలిరావడం విడ్డూరమే… రాసింది తెలుగుదేశం క్యాంపుకి చెందిన ఓ రచయిత… ఎన్టీయార్ మీద బోలెడు మంది రాశారు… ఈయనా రాశాడు, అందులో తప్పేమీ లేదు… ఎవరి కోణం వాళ్లది, ఎవరి శైలి వాళ్లది… చదివేవాళ్లు చదువుతారు… కానీ ఒక పొలిటిషియన్ మీద రాయబడిన ఓ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి… రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన ఉపరాష్ట్రపతి రావొచ్చా..? అసలు ఈకాలంలో పుస్తకావిష్కరణలు ఏమిటి ఇంకా..? పత్రికల్లో తమ సంబంధాల్ని వాడుకుని ప్రత్యేకంగా రిలీజుకు ముందే సమీక్షలు, వార్తలు రాయించుకోవడం ఏమిటి..?
Ads
ఎలాగూ తెలుగుదేశం ప్రస్తుత బాధ్యులు ఎన్టీయార్ చరిత్రను మకిలిపట్టించారు… ఇప్పుడు ఆయన్ని లౌకికవాది అని కొత్తగా ప్రచారం చేయాల్సిన అవసరం ఏమిటో, ఫాయిదా ఏమిటో అర్థం కాదు… అది చెప్పడానికి ఉపరాష్ట్రపతి తరలిరావడం అవసరమా అనేదీ ప్రశ్నే… పైగా తమ పేషీ సందేహాలు వెలిబుచ్చితే… రాజకీయాలు ప్రస్తావించకుండానే రాజకీయ నాయకుడి గురించి ఎలా మాట్లాడాలో నాకు తెలుసు అని వాళ్లకు ఏదో చెప్పేసి వచ్చాడట తను… అదీ తనే చెప్పాడు సభలో… అంత అవసరమా..? అసలే హైదరాబాదు, ఓ ట్రాఫిక్ నరకం… అసలే మాకు ఓ ముఖ్యమంత్రి, ఓ గవర్నర్, ఓ కేంద్ర మంత్రి, జెడ్ కేటగిరీలో ఉన్న మరో మాజీ ముఖ్యమంత్రి, అప్పుడప్పుడూ వచ్చిపోయే పొరుగు రాష్ట్రపు ముఖ్యమంత్రి… మరో రాష్ట్ర గవర్నర్… బోలెడు మంది వీవీఐపీలు… ప్రొటోకాల్స్, మర్యాదలు, ఖర్చులు… అక్కడక్కడా ఆపేయబడే ట్రాఫిక్, వాహనదారుల అవస్థలు… ఐనాసరే, ఉపరాష్ట్రపతి అతిథిగా వస్తే ఆనందమే… కానీ మరీ పుస్తకావిష్కరణలు కూడా ఆగమన కారణాలు కావడమే ఆశ్చర్యం..!! ఆ రచయిత మీద, సబ్జెక్టు హీరో మీద ప్రేమ ఉంటే, ఆ పుస్తకావిష్కరణ ఏదో ఢిల్లీలోని ఆయన నివాసంలోనే ఏర్పాటు చేస్తే సరిపోయేది కదా…!!
Share this Article