కావచ్చు, మన ఆలోచనల ధోరణిని బట్టే… చూసే కోణం, అర్థం చేసుకునే తీరు మారతాయేమో… ఈ ప్రపంచపు నెంబర్ వన్ దేశాన్ని పాలించే అధ్యక్షుడి నివాస భవనం వైట్ హౌజ్… అంతేనా..? ఇంకేదైనా విశేషం ఉందా..? ఏమీ లేదు… అబ్బో, ఇది అమెరికా అధ్యక్షుడు ఉండే ఇల్లు అట అనే ఓ ఓవర్ రేటెడ్ ఫీల్‌తో వెళ్లడమే గానీ, నిజంగా అంత పెద్ద సీనేమీ లేదు…
అది చూడగానే మొదట గుర్తొచ్చింది… అప్పట్లో మోడీ, కిషన్‌రెడ్డి తదితరులు బీజేవైఎం గ్రూపుగా వెళ్లి అక్కడ జస్ట్, టూరిస్టులుగా దిగిన ఫోటో… తరువాత మోడీకి వీసా నిరాకరణ, ఆ తరువాత అదే దేశం అధికారికంగా పలికిన రెడ్ కార్పెట్ స్వాగతాలు… వేల మంది వస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, జస్ట్, మనిషి ఎత్తు కూడా లేని చిన్న ఫెన్సింగ్ మాత్రమే అడ్డు…
అసలు ఏముంది ఆ భవనంలో..? నిజం చెప్పాలంటే ఏమీ లేదు… ఓ సాదా సీదా బిల్డింగ్… మరీ సంజీవయ్యపార్కులా టూరిస్టు ప్లేస్ చేశారు దాన్ని… దాన్ని జనం యాక్సెస్ లేని ప్రదేశంగా ఉంచితేనే బాగుండునేమో… నిజం చెప్పాలంటే, మన రాష్ట్రపతిభవన్ బెటర్… సువిశాలమైన వందల ఎకరాల్లో వేలరకాల మొక్కలతో అదొక ఉద్యానవనం… అబ్బురంగా కనిపించే వాస్తు నిర్మాణం… వైట్ హౌజుకు ఆ విశేషం కూడా లేదు…
Ads
పార్కింగ్ ఉండదు, రోడ్డు పక్కన ఖాళీ దొరికితే అదృష్టం… నవ్వొచ్చిందా..? కానీ నిజమే…! రద్దీ ఉన్న మెస్సుల్లో టోకెన్ తీసుకుని, ఏదో ఓ టేబుల్ పక్కన నిలబడి, వీడి తిండి ఎప్పుడైపోతుందా అని ఎదురుచూస్తున్నట్టుగా… రోడ్డు పక్కన ఎవడు కారు తీస్తాడా, అందులోకి అర్జెంటుగా దూరి పార్కింగ్ చేద్దామా అని రౌండ్లు కొట్టాలి చుట్టూరా… భవనంపై తాడుతో కట్టబడిన సర్వైలెన్స్ డ్రోన్, కొందరు మోడరన్ వెపన్స్‌తో గార్డులు… మనల్ని వేల సీసీ కెమెరాలు గమనిస్తుంటాయనే ఫీలింగే తప్ప మన ఇండియాలో కనిపిస్తున్నట్టు వందలాది సీఆర్పీఎఫ్ బలగాలు, వాహనాలు గట్రా డొల్ల హడావుడి ఏమీ లేదు…
ఇక్కడా వీవీఐపీల కాన్వాయ్‌లు వస్తున్నప్పుడు కుయ్ కుయ్ మోతలు, కాకపోతే మోటారు సైకిళ్ల మీద వెనకా ముందు క్లియరెన్సు పార్టీలు… నచ్చింది ఏమిటంటే..? ఆ కీలక భవనాల చుట్టూ కొన్ని వందల ఎకరాల గ్రీనరీ, ఖాళీ స్పేస్ ప్రొటెక్ట్ చేసుకుంటున్న తీరు… వసంతంలో ఓ వారం పది రోజులు ఆ పరిసరాలన్నీ రకరకాల పూలతో వర్ణమయం అయిపోతుంది… చెర్రీ బ్లాజమ్… ప్రకృతి వర్ణసంపద మొత్తం ఆ వీథుల్లో గుమ్మరించినట్టు..! ఆరోజుల్లోనే అది చూడటానికి వేలాది మంది వస్తారు వాషింగ్టన్ డీసీకి (కేపిటల్)… అక్కడ పారుతున్న నదీప్రవాహాన్ని చూశాక మన మూసీ గుర్తొచ్చి వైరాగ్యమొచ్చింది… వికలమైంది…
ఆ పరిసరాలన్నీ టూరిస్టు ప్లేసెసే.,. పలు మంత్రిత్వ శాఖల బిల్డింగులు, హోటళ్లు, బోలెడన్ని మ్యూజియమ్స్… ఆ పాత వాస్తు నిర్మాణాలతో పోలిస్తే వైట్ హౌజే తీసికట్టు… మన పార్లమెంటు భవనం వంటి కేపిటోల్ హిల్ వాస్తుపరంగా గంభీరంగా, ఉన్నతంగా కనిపిస్తుంది… మన అసెంబ్లీ, పార్లమెంటులో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇచ్చే విజిటర్స్ పాసులతో గ్యాలరీ దాకా వెళ్లినట్టే, ఇక్కడా సెనేట్ మెంబర్స్ ఎవరైనా కరుణిస్తే లోపల సమగ్రంగా చూడటానికి వీలుంటుంది… మామూలు జనానికి కూడా చాన్స్ ఉంటుంది కానీ ఒక పాయింట్ వరకే…
వాషింగ్టన్ మాన్యుమెంట్ నచ్చింది… నచ్చింది దాని నిర్మాణం… ఈఫిల్ టవర్‌లా, దుబయ్‌లో బుర్జ్ ఖలీఫాలాగా… అంత ఎత్తుకు తీసుకెళ్లేందుకు నామమాత్రం ఫీజుతో లిఫ్ట్… కానీ చాలా ముందుగా బుక్ చేసుకోవాలి… మన మురుడేశ్వర్‌లో కూడా అంతేకదా అంటారా..? దాదాపు అంతే, దానికి కనీసం ఆధ్యాత్మిక వాతావరణం ఉంది… ఇక్కడ అదేమీ ఉండదు, జస్ట్, ఓ టూరిస్ట్ ఇంట్రస్టు తప్ప..! కమింట్ టు వైట్ హౌజ్… మన సుల్తాన్ బజార్, చార్మినార్ దగ్గర ఉన్నట్టే చిన్న చిన్న దుకాణాలు… బోలెడన్ని ఫుడ్ వ్యాన్స్… రోడ్డు పక్కనే ఆపుకుని ఉంటాయి…
విశేషంగా అనిపించింది… అందరూ ఫోటోలు దిగే దగ్గరే పలువురు ప్లకార్డులతో పలు నినాదాల్ని ఎగ్జిబిట్ చేస్తుంటారు… సింపుల్‌గా ధర్నా చౌక్… హహహ… అంతటి అమెరికా అధ్యక్షుడి నివాసం ఎదుటే బోలెడన్ని వ్యతిరేక గళాలు… సరే, ఆ వాయిస్ ఎవరు వింటారులే అనుకున్నా సరే… తెలంగాణలో కనీసం దానికీ దిక్కులేదు కదా మొన్నమొన్నటివరకు… నవ్వొచ్చేది ఏమిటంటే..? ధర్నా చౌక్ ఎత్తిపారేసిన పాలకులకు కుర్చీ దిగాక అదే చౌక్ దిక్కయింది వాయిస్ వినిపించడానికి..!! చివరగా… రెండుమూడు సులభ్ కాంప్లెక్సులు అవసరం..! నవ్వొద్దు, నిజంగానే..!!
Share this Article