ఈమధ్య ఓ ధనిక పైత్యం గురించి చెప్పుకున్నాం కదా… మెట్ గాలా… అదొక పిచ్చి, పైత్యం ప్రకోపించిన ఫ్యాషన్ షో… వందల గంటలు, వందల మంది, కోట్ల ఖర్చుతో ఈ డ్రెస్, ఆ డ్రెస్ అని బోలెడన్ని వార్తలు… ప్రజలధనం నుంచి రాజకీయ పార్టీలకు ఎడాపెడా వందల కోట్ల కమీషన్లు పంచే మేఘా వారి ఇంటామె ఏకంగా 87 కోట్ల నగ ధరించిందట… ఆలియా భట్, అంబానీ బిడ్డ వంటి వారెందరో…
సేమ్, కేన్స్ చిత్రోత్సవం… పిచ్చి పిచ్చి డ్రెస్సులు… హొయలు… అదొక ఫ్యాషన్ షో అయిపోయింది… నిజంగానే ఫ్యాషన్ షోలలో మోడల్స్ ధరించే డ్రెస్సులు నిజజీవితంలో ఎవడైనా వేసుకుంటాడా..? వేసుకుని బజారుకు వస్తే కుక్కలు ఊరుకుంటాయా..? వెంటపడవా..? ఏ కుక్కలు అనేది వేరే సంగతి… సోనీ లివ్‌లో వచ్చిన మాస్టర్ చెఫ్ సెకండ్ సీజన్ కొన్ని ఎపిసోడ్స్ చూస్తే ఇవే గుర్తొచ్చాయి… పాపం శమించుగాక…
బిగ్‌బాస్ తెలుసు కదా… వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో… అనేక భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ షో వస్తుంది… దాన్ని నిర్మించే ఎండమాల్ షైన్ వాళ్లే ఈ మాస్టర్ చెఫ్‌కూ నిర్మాతలు… ఇండియాలో హిందీ, తమిళం, తెలుగులో వస్తుంది… మొదటి సీజన్ మొదట్లో తమన్నా హోస్ట్… మధ్యలోనే ఆమెను పీకేశారు, అనసూయను తీసుకొచ్చారు… మొత్తానికి షో ఫ్లాప్… సెకండ్ సీజన్ వచ్చేసరికి బెంగుళూరు నుంచి స్టూడియో ముంబైకి మారింది…
Ads
తుమ్మ సంజయ్ (మనందరికీ తెలిసిన చెఫ్), చలపతిరావుతో పాటు కొత్తగా నికిత అనే చెఫ్ వచ్చి చేరింది జడ్జిగా… (ఒక ఎపిసోడ్ లో ఆశ్రిత దగ్గుబాటి కనిపించింది, హీరో వెంకటేష్ బిడ్డ..? ప్రొఫెషనల్ బేకర్, చెఫ్..) వేరే హోస్టులు ఎవరూ లేరు లక్కీగా… అట్టహాసం, ఆడంబరపు సెట్, 25 లక్షల ఫస్ట్ ప్రైజ్… ఓవెన్లు, మిక్సీలు, స్టవ్వులు, అనేక రకాల దినుసులు, పాత్రలు… బిగ్‌బాస్ రేంజులోనే ఉంటుంది… కానీ మనం మొదట్లో చెప్పుకున్నదే… ఈ పోటీల్లో చేసే ఏ డిష్ కూడా ఎవరమూ చేసుకోం… స్టార్ హోటళ్లలో కూడా ఎవరూ ఆ డిష్‌లు చేయరు, ఆర్డర్ ఇవ్వరు… తినరు…
అనేక ఇంగ్రెడియెంట్లు కాల్చి, ఫ్రై చేసి, బేక్ చేసి, ఉడికించి… నడిచేవి, పాకేవి, ఈదేవి, దూకేవి అన్నీ… స్నాక్స్ అనలేం, మెయిన్ కోర్స్ అనలేం, బ్రేక్ ఫాస్ట్ టిఫినీలు అనలేం, కర్రీలు అనలేం… వండటం ఒకెత్తు, అలంకరించడం మరో ఎత్తు… చివరకు ప్లేటు కలర్, ఫుడ్ కలర్ కంట్రాస్టు ఉండాలట…
కొన్ని ఎలా కట్ చేయాలో, ఎలా తినాలో కూడా జడ్జిలకే అంతుపట్టకపోవడం ఓ విశేషం… అసలు ఆ టేస్టులు ఏమిటో ఎవరూ చెప్పలేరు, తప్పదు కాబట్టి జడ్జిలు ఏవో నాలుగు మొక్కుబడి, ముఖస్తుతి మాటలు చెప్పి, టేస్ట్ చేసి భరిస్తుంటారు… గతంలో ఓ యాంకరిణి చెప్పింది కదా, వంటల పోటీల్లోని డిష్‌లను రుచిచూస్తేనే యాఖ్ అని…
ఒక్క కంటెస్టెంట్ మాత్రం హెల్తీ అండ్ టేస్టీ డిషెస్ ట్రై చేసింది… మరొకామె ట్రెడిషనల్ డిషెస్‌కు కొత్త ఫ్లేవర్స్ యాడ్ చేసింది… మిగతా అందరూ ఏవేవో పిచ్చి వంటకాలే… నిజానికి ఈరోజు రకరకాల దేశాల్లో ఉన్న మనవాళ్లకు కావల్సింది మన వంటల్ని సులభంగా, వేగంగా, తక్కువ సరుకులతో ఎలా టేస్టీగా, హెల్తీగా చేసుకోవాలి అనేదే… అలాంటివే యూట్యూబులో ట్రెండింగ్… కొన్ని కోట్ల వ్యూస్ ఒక్కో వీడియోకు…
సరే, రియాలిటీ షోలలో కాస్త బాగానే పర్‌ఫామ్ చేస్తోంది కదాని ఓటీటీలో వచ్చే అదేదో చెఫ్ మంత్ర చూస్తే అదింకా నాసిరకం షో… ఈ సీజన్‌కు ఆమే హోస్ట్… అంతకుముందు మంచు లక్ష్మి, శ్రీముఖి చేశారు, కానీ ఫ్లాప్… నీహారికకు స్పాంటేనియస్‌గా సెటైర్లు వేయడం, కంటెస్టెంట్లను ఉడికించడం గట్రా రాదు…
పైగా కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్ షోలో ప్లస్సుగా కనిపించిన యాదమరాజు ఈ వంటల షోకు పెద్ద మైనస్… పైగా స్పాన్సర్ చేసే అదేదో మొబైల్ గురించి చెప్పడానికే ప్రయారిటీ… ప్చ్, వంటల పోటీలకు సంబంధించిన ఏ టీవీ ప్రోగ్రామూ రుచిగా ఉండటం లేదు..!! (జొన్న గట్క, అంబలి, పాయ, సర్వపిండి, సకినాల బ్యాచుకు మోడరన్ టేస్టులు తెలియదని వెక్కిరించినా సరే..)…
Share this Article