ఓటరు దేవుడు ఇప్పుడేమవుతాడు?
“ఎన్నికలైపోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటుంది?
దగా పడిన ఒక ఆడకూతురిలాగా వుంటుంది!
దొంగ నవ్వుల బ్రోకర్ని నమ్మేసి అమాయకంగా రైలెక్కిపోయిన పల్లెటూరి పిచ్చిపిల్లలాగా ఉంటుంది.
ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత దేశం ఎలాగుంటుంది?
చిరిగిపోయిన ప్రచార పత్రాల గుట్టలాగుంటుంది.
Ads
ఎన్నికలైపోయినాక ఏమౌతుంది?
మనకి భోజనం లేదని గుర్తుకొస్తుంది. మన ఇంట పుట్టిన దోమైనా, పరాయింట పుట్టిన జలగైనా మన రక్తం పీల్చే బతుకుతాయని స్పష్టపడుతుంది. మనకి ఉపాధి లేదని, మనకి దిక్కూ, దివాణం లేదని, మనకి తెరువూ, తీరూ లేదని మళ్లీ గుర్తుకొస్తుంది.
తెలిసి తెలిసీ అయిదేళ్లకోసారి జీవితాంతం మోసపోవడం గూర్చి ఏడుపొస్తుంది.
మన మీద మనకి కొంచెం అసహ్యం వేస్తుంది. మన బుద్ధి గడ్డి తింటున్నదని తెలిసి సిగ్గేస్తుంది. ఎన్నికల పతాకాలు విప్పేసిన తర్వాత, గుడారాలు పీకేసిన తర్వాత, పట్టాభిషేక మహోత్సవం ముగిసిన తర్వాత తుపాకీ ఇంకా మనకేసే గురి పెట్టి ఉందని తెలుస్తుంది. మన ఓటే మనల్ని కాటేసిందని తెలుస్తుంది”… -కేయన్ వై పతంజలి
యాభై రోజులపాటు ఓటరు దేవుడై…రోడ్డుమీద అభ్యర్థులు వేసిన దోసెలు ఇప్పుడు వేస్తారా? వేయగలరా?
చేసిన ఇస్త్రీలు ఇప్పుడు చేస్తారా? చేయగలరా?
కలిపిన టీలు ఇప్పుడు కలపగలరా?
ఎక్కిన గుమ్మాలు ఇప్పుడు ఎక్కుతారా?
చేసిన ప్రమాణాలు ఇప్పుడు చేస్తారా?
పోసిన చుక్కలు ఇప్పుడు పోస్తారా?
నోటికి అందించిన బిర్యానీ ముక్కలు ఇప్పుడు అందిస్తారా?
పంచిన పచ్చ కాగితాలు ఇప్పుడు పంచుతారా?
పంపిన కార్లు ఇప్పుడు పంపుతారా?
పెట్టిన కుల సంఘం ఒట్లు ఇప్పుడు పెడతారా?
దూరదూర తీరాలకు ఓటర్లను రప్పించడానికి పంపిన వాహనాలు ఇప్పుడు వెళతాయా?
ఓటు యంత్రంమీద మీట నొక్కినతరువాత కూడా ఓటరు దేవుడిగానే పరిగణింపబడతాడా?
“ఏరు దాటేవరకే ఓడ మల్లయ్య- ఏరు దాటాక బోడి మల్లయ్య”- అని సామెత స్పష్టంగానే చెప్పింది.
“ఓటు వేసేవరకే ఓటు మల్లయ్య- ఓటు వేయగానే ఓటి మల్లయ్య”.
ఓటి కుండలో నీరు నిలవవు. ఓట్ల పండగలో ప్రమాణాలు నిలవవు.
ఫలితాలు రాగానే ఓటరు దేవుడు పిపీలికమై…గెలిచిన అభ్యర్థి గౌరవనీయ, మహారాజశ్రీ అవుతాడు. అతడు/ఆమెకు కుడి ఎడమల తుపాకులు మొలుస్తాయి. కాన్వాయ్ లు వెంట నడుస్తాయి. అంతదాకా చేతులు పట్టుకుని…బాబ్బాబూ ఇవి కాళ్లనుకో అన్న అభ్యర్థులు గెలవగానే అదే ఓటర్లు తమ కాళ్ల మీద పడేలా కాళ్లను బారచాపుతూ ఉంటారు.
ఏమిటది? ఏదో పాత పాట లీలగా వినిపిస్తోంది!
“ఒక్కసారి ఓటు వెయ్యి గణనాథా!
నిన్ను ముంచకుంటే ఒట్టు పెట్టు గణనాథా!” -పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article