ఐదేళ్ల క్రితం… కరీంనగర్ గల్లీల్లో తిరుగుతూ బండి సంజయ్ తనకు అసెంబ్లీ ఎన్నికల్లో వోటేసిన వాళ్లకు థాంక్స్ చెప్పాడని చదివినట్టు గుర్తు… ఫోటో కోసం వెతికితే దొరకలేదు… బాగా నచ్చింది… నిజానికి ఎన్నికల ప్రచారం కోసం తిరగడం వేరు, కానీ పోలింగ్ ముగిశాక జనంలోకి వెళ్లడం పెద్ద టాస్క్…
ఈసారి కూడా వెళ్లాడా..? లేదు..! ఈసారి ఆ స్పిరిట్ కనిపించలేదు… తన మేనల్లుడిని స్కూటీ మీద ఎక్కించుకుని సిటీలో తిరుగుతూ, ఓ బేకరీలో సమోసాలు, ఐస్ క్రీమ్స్ తింటూ, ఓ చాయ్ టేలా దగ్గర కొందరితో ముచ్చట్లు పెట్టినట్టు వీడియోలు, ఫోటోలు కనిపించాయి… గుడ్, ఎన్నికల ప్రయాస నుంచి రిలాక్స్ కావడానికి చాలామందికి చాలామార్గాలు…
నిజానికి పోలింగ్ తరువాత రిజల్ట్ కోసం ఇన్నిరోజులు నిరీక్షించాల్సి రావడం పెద్ద పరీక్ష… ఒకరకమైన శూన్యం… ముఖ్యమైన కార్యకర్తల్ని కౌంటింగ్ దాకా భరించడం ఓ అదనపు వ్యయప్రయాస… పైగా ఒకసారి పోలింగ్ ముగిశాక అభ్యర్థులు మళ్లీ జనంలోకి వెళ్తే కొన్ని ఇష్యూస్ తలనొప్పిని క్రియేట్ చేస్తాయి… (బండి సంజయ్‌కు అని కాదు, ప్రధాన అభ్యర్థులందరికీ…) అందుకే సింపుల్‌గా సోషల్ మీడియాలో, మీడియాలో నాకు వోట్లేసిన ప్రజలకు థాంక్స్ అని ప్రకటనలు జారీ చేస్తారు… ఖతం…
Ads
‘అన్నా, మా ఏరియాకు డబ్బులు రాలేదన్నా, మధ్యలో ఎవరో మింగేశారు…’ ‘సార్, మీరిచ్చిన డబ్బులో సగమే పంచాడు, మిగతావి అదుగో మీ చుట్టూ తిరిగే వాళ్లే దొబ్బేశారు…’ ‘భయ్యా, మీరు ఎంతిచ్చారో తెలియదు గానీ, మా కాలనీ, మా అపార్ట్‌మెంట్ పెద్దలే కాజేశారు, ఒక్కడికీ కనీసం టీ కూడా పోయించలేదు…’ ‘చివరకు మందు సీసాలు కూడా దాచిపెట్టుకున్నారు, పోలింగ్ ఏజెంట్లకు- ముఖ్యకార్యకర్తలకు బిర్యానీ పొట్లాలు కూడా పంపించలేదు పోలింగ్ రోజున’…. ఇలాంటి కంప్లయింట్లు వస్తాయి…
అవన్నీ పోస్ట్ మార్టం చేసుకుంటూ కూర్చుంటే మళ్లీ కౌంటింగ్ రోజున ఒక్కడూ మిగలడు… సో, వీలైనంతవరకూ తప్పించుకునే తిరుగుతారు… పేరుకు రిలాక్సింగ్ అంటారు, కానీ నిజమైన నాయకుడు జనంలో తిరగడంతోనే రిలాక్స్ అవుతాడు…
ఇవేకాదు, ఇంకొన్ని ఇష్యూస్ చుట్టుముడతాయి… ఫలానా నాయకుడు క్రాస్ ఓటింగ్ చేయించాడు, నువ్వేమో గుడ్డిగా నమ్మావు, ఈసారి వాడిని వదిలించుకోకపోతే నష్టం, కష్టం… తరువాత నీ ఇష్టం… వాడే కావాలనుకుంటే చెప్పు, మేం వెళ్లిపోతాం… వంటి ఫిర్యాదులు వస్తాయి… జెండాలు, పోస్టర్లు, ఫ్లెక్సీల ప్రొవైడర్లు సరిగ్గా పంపిణీ చేయకపోవడంతోపాటు ఈసారి సోషల్ మీడియా వింగ్స్ మీద కూడా ఫిర్యాదులు…
గెలిస్తే గెలుస్తాం, ఓడితే ఓడుతాం, అంతేగానీ కౌంటింగ్‌కు ముందు ఈ పంచాయితీలన్నీ పరిష్కరిస్తూ కూర్చోలేం, పైగా ఇన్నాళ్లూ గాడితప్పిన వ్యాపారాలు, ఆర్థిక వ్యవహారాలుంటయ్, అన్నీ చక్కబెట్టుకోవాలి… హైకమాండ్ ఏమిచ్చిదో, మనకు ఎంత చిలుం వదిలిందో కూడా చూసుకోవాలి… పోనీ, హైకమాండ్ ఇచ్చినదాంట్లో ఎంత మిగిలిందో కూడా చూసుకునే వాళ్లూ ఉన్నారు… సో, పోలింగ్ ముగియగానే జనంలోకి వెళ్లడం అంటే, యుద్ధానంతరం కళేబరాల నడుమ తిరుగాడటమే… ఐనాసరే, వెళ్లి ప్రజలకు థాంక్స్ చెప్పేవాళ్లుంటే నిజంగా గ్రేటే..!!
చెప్పనేలేదు కదూ… రేపు పత్రికల్లో ఏయే నాయకుడు ఎలా రిలాక్స్ అవుతున్నరో ఫోటో ఫీచర్లు వస్తాయి..!! మొన్నటిదాకా వోట్ల కోసం వెళ్లి వోటర్ల ఇళ్లల్లో పిల్లల ముడ్లు కడగడం దగ్గర నుంచి ఇస్త్రీ చేయడం, బజ్జీలు వేయడం వంటి కృత్రిమ ఫోటో ఫీట్లు చూశాం కదా, అచ్చంగా అలాంటివేనన్నమాట..!!
Share this Article